GET MORE DETAILS

ధరల ‘వార్‌’నింగ్‌..! నిత్యావసరాల మార్కెట్‌పై ఉక్రెయిన్‌– రష్యా యుద్ధ ప్రభావం

ధరల ‘వార్‌’నింగ్‌..! నిత్యావసరాల మార్కెట్‌పై ఉక్రెయిన్‌– రష్యా యుద్ధ ప్రభావంఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం మన దేశంలో ధరల మంట రేపుతోంది. ఆ రెండు దేశాల నుంచి భారీగా దిగుమతి అయ్యే ఉత్పత్తులకు ఇప్పటికే రెక్కలురాగా.. త్వరలో పెట్రోల్, డీజిల్‌ పెరుగుతాయని, ఆ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతుందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. యుద్ధం నేపథ్యంలో రష్యా, యూరోపియన్‌ దేశాలు, అమెరికాల మధ్య పరస్పర ఆంక్షల కారణంగా.. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌– సరఫరాల మధ్య సమతుల్యత దెబ్బతింటోంది. ఆయా దేశాల నుంచి జరిగే ఎగుమతులు, దిగుమతుల్లో మార్పులు ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతోంది. నూనెలు, స్టీల్, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇప్పటికే మోతమోగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర శనివారం 118 డాలర్లకు చేరుకుంది. దీనితో అంతర్జాతీయంగా రవాణా వ్యయం పెరుగుతోంది.

కాగుతున్న ‘సన్‌ఫ్లవర్‌’...

మన దేశానికి ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్‌ దేశాల నుంచే పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్‌) నూనె దిగుమతి అవుతుంది. యుద్ధానికి ముందు రిటైల్‌ మార్కెట్‌లో ఈ నూనె లీటర్‌కు రూ.135 నుంచి రూ.140 మధ్య ఉండేది. కానీ ఈ పది రోజుల్లోనే రూ.165 నుంచి రూ.175 వరకు పెరిగింది. దీనితోపాటు వాణిజ్య అవసరాలకు, సబ్బులు, కాస్మెటిక్స్‌ తయారీలో ఎక్కువగా వినియోగించే పామాయిల్‌ ధర కూడా లీటర్‌పై రూ.25కు పైగా పెరిగి రూ.153కు చేరింది. కొరత వస్తుందన్న ఉద్దేశంతో.. ఆయిల్‌ కంపెనీలు ధరలు పెంచక ముందే ఏజెన్సీలు, హోల్‌సేల్‌ డిస్ట్రిబ్యూటర్లు సన్‌ఫ్లవర్, పామాయిల్‌ నూనెను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌ బేగంబజార్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో వ్యాపారులు 15 లీటర్ల క్యాన్‌పై రూ.500 వరకు ధర పెంచి అమ్ముతున్నట్టు తెలిసింది.

ఫర్టిలైజర్స్, ఫార్మా, మెటల్స్‌పై...

క్రూడాయిల్‌ ధరల పెరుగుదలతోపాటు అంతర్జాతీయంగా సరకు రవాణా నౌకాయానంపై ఆంక్షలు, షిప్పింగ్‌ చార్జీలు పెరగడం, రష్యా–యూరోపియన్‌ దేశాల మధ్య సంబంధాలకు గండిపడడం వంటి కారణాలతో.. ఆయా దేశాల్లో తయారయ్యే ముడిసరుకుల ధరలకు రెక్కలొస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ముడిసరుకుల దిగుమతి తగ్గిపోతే.. ఫర్టిలైజర్లు, ఫార్మాస్యుటికల్స్, పౌల్ట్రీ, వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ఇతర మెటల్స్‌ ధరలు భారీగా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.

వంటింటిపై పరోక్ష ప్రభావం :

విదేశాల నుంచి నౌకల ద్వారా సరకు రవాణాకు ఇబ్బంది వస్తే.. వంటింటి ఖర్చుల మీద దెబ్బపడనుంది. కోళ్ల దాణా కొరత, ఇతర కారణాలతో చికెన్‌ రేట్లు పెరుగుతున్నాయి. ధనియాలు, జీలకర్ర, సోయాబీన్‌ వంటివాటి ధరలు పెరుగుతాయి. గోధుమలు ధరలు పెరిగితే.. దాని ఉప ఉత్పత్తులన్నింటిపై ప్రభావం పడుతుంది. దేశ గోదాముల్లో నిల్వ ఉన్న గోధుమలు, బియ్యం ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని ఆర్థిక నిపుణుడు పాపారావు తెలిపారు.

నూనె... ఆ రెండు దేశాల నుంచే...

భారతదేశంలో ఏటా 25 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్‌ నూనెను వినియోగిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. అందులో మన దేశంలో ఉత్పత్తి అయ్యేది కేవలం 50 వేల టన్నులే. 2020–21లో 22 లక్షల టన్నుల సన్‌ఫ్లవర్‌ నూనెను దిగుమతి చేసుకోగా.. అందులో ఉక్రెయిన్‌ నుంచి 17.4 లక్షల టన్నులు, రష్యా నుంచి 2.8 లక్షల టన్నులు ఉన్నట్టు సమాచారం. ఈ రెండింటితోపాటు అర్జెంటీనా నుంచి కూడా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి అవుతోంది. 2019–20లో మొత్తంగా 25 లక్షల టన్నుల నూనెను భారత్‌ దిగుమతి చేసుకుందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్, రష్యాల నుంచి 5,50,000 టన్నుల సన్‌ఫ్లవర్‌ నూనెను భారత్‌ దిగుమతి చేసుకుందని ఇంటర్నేషనల్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సందీప్‌ బజోరియా పేర్కొన్నారు.

త్వరలో పెట్రోల్, డీజిల్‌ వాత :

యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెల 28వ తేదీన 100 డాలర్లుగా ఉన్న క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర ఐదు రోజుల్లో 18 డాలర్లు పెరిగి 118 డాలర్లకు చేరుకుంది. చమురు సంస్థలు ఇప్పటికే బల్క్‌ డీజిల్‌ ధరలను భారీగా పెంచారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రిటైల్‌ పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచకుండా కేంద్రమే భరిస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియ 7వ తేదీతో ముగియనుండడంతో.. రిటైల్‌ పెట్రోల్, డీజిల్‌ ధరల మోత మోగనుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. సగటున లీటర్‌కు రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

అన్నింటి ధరలు పెరుగుతాయి :

యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి దిగుమతి చేసుకునే పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్, సన్‌ఫ్లవర్, పామాయిల్‌ ధరలు సహజంగానే పెరుగుతాయి. వీటికి తోడు యుద్ధం వల్ల పరోక్షంగా కూడా వివిధ వస్తువులు, ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడుతుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారం, మినరల్స్, మెటల్స్, ఇతర ఆర్నమెంట్ల ధరలు పెరుగుతాయి.ప్రొఫెసర్‌ నర్సింహారెడ్డి, ఆర్థిక నిపుణుడు.

సరకు రవాణాపై తీవ్ర భారం :

అమెరికాలో ఉద్ధీపన పథకాల వల్ల కొనుగోలు శక్తి పెరిగింది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. తాజాగా ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో క్రూడాయిల్‌ ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రభావం మన దేశంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతి రంగంపై పడుతుంది.

 నూనె, వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ, మెటల్స్, కాస్మెటిక్స్‌తోపాటు ఫర్టిలైజర్స్, ఫార్మా ధరలు పెరిగే అవకాశం ఉంది.పాపారావు, ఆర్థిక నిపుణుడు

Post a Comment

0 Comments