GET MORE DETAILS

ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవం

 ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కళ్యాణోత్సవంఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం :

ఏకశిలానగరి.. విశేషాల ఝరి.. ఇక్కడి కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక , రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ , లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. 

రామతీర్థం.. నేటికీ పదిలం :

రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది.

కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తరువాత బుగ్గను రామతీర్థంగా , పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వచ్చింది. కానీ ఈ రామతీర్థంలో స్వామికి చక్రస్నానం చేయించుటకు స్థలం సరిపోకపోవడంతో కోదండ రామాలయం ఎదురుగానే నూతనంగా నిర్మించిన పుష్కరిణిలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి చక్రస్నానం జరుపుతారు.

జాంబవంతుడి ప్రతిష్ట :

ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.

రామయ్య నడయాడిన నేల :

శ్రీ రామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ , సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు , యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది.

హనుమ లేని రాముడి కోవెల :

హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు.

విదేశీ మెచ్చుకోలు :

క్రీ.శ. 1652లో భారత యాత్ర చేసిన టావెర్నియర్‌ అనే ఫ్రెంచి యాత్రికుడు భారత దేశంలోని గొప్ప (పెద్దదైన) ఆలయ గోపురాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒకటి అని మెచ్చుకుని ప్రశంసించారు. ఇది అద్భుతమైన క్షేత్రమని ఆయన పేర్కొన్నారు.

వెన్నెల్లో కల్యాణం :

శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ , భరత , శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి.

చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కల్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కల్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కల్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం.

రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కల్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు.

ఒంటిమిట్ట చెరువు :

జిల్లాలోని పెద్ద చెరువులలో ఒంటిమిట్ట చెరువుకు ప్రత్యేకత ఉంది. ఒంటిమిట్టకు వచ్చిన వారితోపాటు ఆ రోడ్డున వెళ్లే వారు ఈ చెరువును చూసే ఉంటారు. మెయిన్‌రోడ్డునుంచి కనుచూపుమేర విశాలంగా కొండల వరకు విస్తరించి ఉన్న ఆ చెరువుకు గొప్ప చరిత్ర ఉంది. 

కడప కైఫీయత్తుల సమాచారం మేరకు .. 1340లో కంపరాయులు విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగమైన ఉదయగిరికి పాలకుడిగా ఉన్నారు. తన పరిధిలోని ప్రాంతమంతా స్వయంగా పర్యటిస్తూ అవసరమనిపించిన చోట దేవాలయాలు , చెరువులు నిర్మింపజేశారు. ఆయన నిర్మించిన చిట్వేలి చెరువు వద్దగల కంపసముద్రం అగ్రహారం , నెల్లూరు జిల్లాలోని కంపసముద్రం తదితర ప్రాంతాలు నేటికీ ఆయన పేరుతోనే ఉన్నాయి. తన పాలనలో ఆయన అటు ఆధ్యాత్మిక , ఇటు సామాజిక సేవలు అందించారు.

ఒంటిమిట్ట ప్రాంతం  1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు - మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి , ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు , మిట్టడులకు అప్పగించారు.

గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద , చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు.

కమనీయం... ఎదుర్కోలు ఉత్సవం :

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది. పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు , లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు.

కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య , తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కల్యాణ వేదికపై కల్యాణం నిర్వహిస్తారు. కాగా ఈ ఆలయం టీటీడీలోకి విలీనమైంది. 2016 నుంచి ఒంటిమిట్ట శివారులో నిర్మించిన కల్యాణ వేదిక ప్రాంగణంలో సీతారాముల పరిణయ ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఎదుర్కోలు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపడుతున్నారు.

రామయ్య రథం కథ ఇదీ :

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి.

1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది.  

తొలి బ్రహ్మోత్సవాలలో శిల్పులు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని డిమాండ్‌ చేశారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యంగల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. అర్చకులు , ఆలయ పెద్దలు మినహా ఇతరులెవరూ రథంపై ఉండకూడదని అడ్డుచెప్పారు. రథ శిల్పులు కూడా పట్టువీడలేదు. తాము రథంపై కూర్చొవాల్సిందేనని పట్టుబట్టారు.

ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజుకు విషయం తెలిసింది. ఆయన వెంటనే ఒంటిమిట్టకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ధర్మాధికారులను ఆదేశించారు. వారు ఒంటిమిట్టకు వచ్చి విషయాలను గమనించారు.

రథాన్ని నిర్మించిన రథ శిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చొనే సంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తమ ప్రభువు మట్లి అనంతరాజుకు తెలిపారు. ఆయన ఆజ్ఞ మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది.

ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది.

రామ మందిరం... సాహితీ సౌరభం :

ఒంటిమిట్ట  రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు.  అయ్యల రాజు తిప్పయ్య క్రీ.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది.

► అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో  నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది.

► బమ్మెర పోతనామాత్యుడు మహాకవి.   భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు.

► వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు)  వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.   

► కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. 

► వర కవి నల్లకాలువ అయ్యప్ప ,  ఉప్పు గొండూరు వెంకట కవి , మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు.  

రాచరికం... రాజసం :

క్రీ.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల సోదరుడు కంపరాయులు ఉదయగిరిని పాలిస్తూ ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఒంటడు , మిట్టడు అనే బోయ సోదరులు ఉండేవారు. వీరిద్దరు రాజులతో పాటు ఆయన వెంట వచ్చిన బృందానికి వసతి కల్పించారు. వారిద్దరు చెరువు , రామాలయం నిర్మించాలని కంప రాయులను అడిగారు. వారి కోరిక మేరకు వాటిని నిర్మించేందుకు ఆయన కృషి చేశారు. ఒంటడు , మిట్టడు కట్టిన ఆలయం కనుక ఈ ఆలయానికి ఒంటిమిట్ట కోదండరామాలయం అని పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది.

► క్రీ.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం , ఎదుర్కోలు మండపాలు , ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు.

Post a Comment

0 Comments