GET MORE DETAILS

వైశాఖ పురాణం - 5 వ అధ్యాయము

వైశాఖ పురాణం - 5 వ అధ్యాయము వైశాఖమాస విశిష్టత :

నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము ఇతర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటె నుత్తమమైనదో వివరింపగోరుచున్ననని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను.

మహారాజా ! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్పొలిపినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన ఉదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువనములను కూడ సృష్టించెను. భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను , ప్రకృతిని మర్యాదలను రాజులను , వర్ణాశ్రమ విభాగములను , ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను , తంత్రములను, సంహితలను, స్మృతులను , పురాణేతిహాసములను , ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.

ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.

సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ  ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని , ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగ చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు. సరికదా కోపము కూడ రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండినపండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట యుచితముకాదు. వ్యగ్రులై యేకాగ్రతలేనివారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును ? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు. శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును ? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారముల కిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి యుందురు. స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును ? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు , యాగభోగములకు , బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును. సులభమైన యే వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని , పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును. కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు. అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకలమున సర్వ వస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు , అంగవైకల్యము కలవారు , మహాత్ములు మున్నగు సర్వజనులకును , నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము , పుష్పము , ఫలము , జలము , శాకము , పుష్పమాల , తాంబూలము , చందనము , పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలననేవిలువకట్టరానంత పుణ్యము నిత్తును.

అని భక్తసులభుడు దయాశాలియనగు శ్రీమహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్పఫలపూర్ణములగు అడవులను , పర్వతములను లతాతరువులను , జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను , తుష్టి , పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునులయాశ్రమములను , అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను , వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను , పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను , ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను , శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు , యధాశక్తిగ దానధర్మములను చేయుచు అతిధి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను , కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును. అభ్యాగతుడై , అతిధియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును , అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను , తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యధాశక్తిదాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును. అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతతి వారినయినను యధోచితముగ శిక్షించును. కావున సోదర మానవులారా ! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యధాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యధాశక్తిగ పూజ , దానధర్మములను , భక్తి వినయములతో శ్రద్దాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.

ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు , చారణులు , గంధర్వులు , సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు. తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు , అన్ని వర్ణములవారిని , అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై , చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు , శ్రద్దాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కోరికలను మించి వరముల నిత్తురు.

శ్రీహరి వైశాఖమున మత్తులై , ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని , గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును. వైశాఖ మాసమున తననుగాని , పరమేశ్వరునిగాని , ఇతర దైవతములను సజ్జనులను పూజించినను , వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానిన వారిపై కోపించును. అనగా శ్రీమహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును. వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు. సపరివారముగ వచ్చిన మహారాజును నగరము , గ్రామములు , వనములు , పర్వతములు , నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్సించి యధాశక్తిగ తమకు తోచిన పత్రము , పుష్పము , ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ ! తమయేలుబడిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట , సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను , అతిధులను , అభాగ్యతులను , దైవభావనతో ఉపచారములు చేసి యధాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్తుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును. పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యధోచితముగ వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగ వచ్చిన మహారాజును దర్సింపక కానుకల నీయక యున్నచో మహారాజు కోపితుడై శిక్షించును. పరివారమును యధాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాస వ్రత సమయమున వ్రతము నాచరించి యధాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యధోచితముగ నట్లు శిక్షింతురు. కావున సర్వ జనులును యధాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యధాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును. అందుచే వైసాఖమాసవ్రతము కార్తీక మాఘ మాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు  వైశాఖ మాస విశిష్టతను వివరించెను.

Post a Comment

0 Comments