ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్‌యూలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా
ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో YSRCP రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్‌మేళాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నిరుద్యోగుల కోసం మే 7,8 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా భారీ ఉద్యోగ మేళా నిర్వహించనుంది.
జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన 175కిపైగా కంపెనీలు, సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, పరిశ్రమలు, తయారీ రంగ కంపెనీలు, ఉత్పత్తి సంస్థలు పాల్గొననున్నాయి. నెలకు కనీసం రూ.14 వేల వేతనం నుంచి సంవత్సరానికి రూ.12.5 లక్షల ప్యాకేజీ వరకు ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నారు. జాబ్‌మేళా నిర్వహణకు ఏఎన్‌యూలోని డాక్టర్ వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్, ఈసీఈ, సెంట్రల్ బ్లాక్ తదితర ఐదు భవనాల్లో విభాగాల వారీగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు.
● విజయవాడ, గుంటూరు నుంచి ఉచిత బస్ సౌకర్యం
నిరుద్యోగుల కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికోసం విజయవాడ, గుంటూరు బస్టాండ్ నుంచి ప్రైవేటు బస్సులు నడపనున్నారు. అదనంగా ఆర్టీసీ సర్వీసులూ నడవనున్నాయి. జాబ్‌మేళాలో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత భోజన వసతీ కల్పించనున్నారు. వేసవి దృష్ట్యా అవసరమైతే వైద్యసేవలు అందించేందుకు వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.
మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు సేవలందించేందుకు 500 మంది సిబ్బంది, వలంటీర్లను నియమించారు. నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ కోసం 8985656565 ఫోన్ నంబరును సంప్రదించొచ్చు. www.ysrcpjobmela.com ద్వారా కూడా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అభ్యర్థికీ ఓ కోడ్ ఇచ్చి వారికి సంబంధించిన ఇంటర్వ్యూ జరిగే ప్రాంతాన్ని వారి మొబైల్‌కు ఆన్‌లైన్ ద్వారా తెలిపే ఏర్పాట్లూ చేస్తున్నారు.
ఇప్పటికే తిరుపతి, విశాఖలో మేళాలు నిర్వహించి ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించినట్టు వివరించారు.
0 Comments