GET MORE DETAILS

శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం : మాచర్ల , గుంటూరు జిల్లా

  శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం : మాచర్ల , గుంటూరు జిల్లా



◆ భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయాలున్నాయి. అందులో ప్రముఖమైనది శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. ఇది  గుంటూరు జిల్లా మాచెర్ల పట్టణంలో గల చంద్రవంకనది ఒడ్డున ఉంది.

 చెన్నకేశవ స్వామి ఎవరు ? ఆయన కథ ఏమిటి ? ఆ స్వామి ఆరాధన ఎప్పుడు, ఎలా మొదలైంది ?

చెన్ను అంటే అందం. చెన్న కేశవస్వామి అంటే అందమైన కేశవ స్వామి అని అర్ధం. తెలుగునాట చెన్నకేశవస్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు పునరుద్ధరించారు. ఈ కేశవస్వామిని కొలిచిన తరువాత బ్రహ్మనాయుడికి బాలచంద్రుడు పుట్టడంతో పలనాడు ప్రాంతంలో ఈ నాటికీ సంతాన చెన్నకేశవుని గా పిలుస్తారు, కొలుస్తారు. ఇక్కడి ఆలయం కార్తవీర్యార్జునుని ప్రతిష్ట అని కొందరు చెబుతారు.

చెన్నుడు అనే భక్తుడు విష్ణు మూర్తికై తపస్సు చెయ్యగా, ఆ భక్తుని పేరు అందరూ తలచుకునే లాగా, భక్తుని పేరు ముందు పెట్టుకుని చెన్నకేశవునిగా అవతరించాడు అని ఐతిహ్యం.

 విష్ణుమూర్తికి మారురూపుగా ఉండే చెన్నకేశవుడుని దర్శించినవారికి సకల పాపాల హరించుకుపోయి,ముక్తి లభిస్తుందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

కేశవ నామానికి అర్ధం ఏమిటి ?

ఒత్తైన, మెత్తని కేశములు కలవాడని (అందగాడని) ఒక అర్ధం.

క + అ + ఈశ = బ్రహ్మ, విష్ణు, శివ రూపాలు కలగలిపిన త్రిమూర్తి స్వరూపమైన పరమాత్ముడని లోతైన అర్ధం.

● మనం ప్రతినిత్యం పూజలలో ఆచమనం చేసేప్పుడు కేశవ నామాల స్మరణతో నీటిని తీసుకుంటాం. ఆ కేశవ నామాలు 24. ఈ 24 విష్ణుని 24 వివిధ రూపాలు. నాలుగు చేతులలో పద్మం, శంఖం, చక్రం, గద విష్ణుమూర్తి ధరించి ఉంటాడు. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం / పరికరం ఉన్నప్పుడు ఒక్కో రూపంగా దర్శించి, ఒక్కో రూపానికి ఒక్కో (మంత్రాన్ని) పేరుని ఇచ్చారు మహర్షులు.

ఉదాహరణకు : 

● కుడిచేతిలో పద్మం, పైని కుడి చేతిలో శంఖం, పైని ఎడమ చేతిలో చక్రము, ఎడమ చేతిలో గద ధరించిన రూపాన్ని కేశవ స్వరూపంగా అభివర్ణించారు. త్రేతాయుగంలో మన మాచర్ల ప్రాంతం దండకారణ్యం గా ఉండేది.అప్పుడు మాచర్ల ని విష్ణుపురి అని పిలిచేవారు. బ్రహ్మానాయుడు స్వస్తలం మాచాపురం పేరు మీదుగా మాచర్ల పట్టణం నిర్మించాడని కూడా చెపుతారు. కొన్నాళ్లు మాహాదేవిచర్ల గా కూడా వాడుకలో ఉండి క్రమేణా మాచర్లగా ప్రసిద్ది కెక్కింది.

● పల్నాటి బ్రహ్మనాయుడు ఈ ఆలయాన్ని బాగా అభివృద్ది చేసాడు. మొదట శైవ దేవాలయంగా ఉండేదని చారిత్రక కధనాలు ఉన్నాయి. ఈ దేవాలయం బ్రహ్మనాయుడు కాలంలో వైష్ణవ దేవాలయంగా మార్చబడినది.

● శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయం ఆలయంలో ప్రధాన దేవతా మూర్తులు చెన్నకేశవ స్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారు. ఇది సుమారు 13వ శతాబ్దంలో నిర్మించబడింది.

● స్వామివారి మూల విరాట్టు మూడు అడుగుల ఎత్తు కలిగి,నాలుగు చేతులతో శంకు,చక్ర,గధాయుధాలు ధరించి ముఖాన తిరుమణి చూర్ణరేఖలు, శిరమున కిరిటం ధరించి ముడి వేసిన కేశములు కలిగి,పల్నాడు పౌరుషాగ్నిని పోలిఉండేలా మీసకట్టు కలిగి ,అద్బుతమైన విశాల నయనాలతో, వక్షస్థలమందు స్వర్ణకవచ ధారణతో,మెడలో పుష్పాల హారంతో,పాదములకు పావుకోళ్లు(చెక్కతో చేసిన పాదరక్షలు ధరించి) వెండి మకర తోరణమందు అతి సుందరంగా కనిపిస్తారు.

● అన్ని నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తాయి చంద్రవంక మాత్రం తూర్పు వైపు నుండి ఉత్తర,పడమర దిక్కులో ప్రవహించటం కూడా ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. 

● ఆలయం బయట గరుడ ధ్వజ స్థంభాన్ని ప్రతిష్ఠించు సమయంలో దాని పైభాగం కొంత విరిగింది. ఆ విరిగిన భాగమును దేవలయ ఆవరణ లోపన ధ్వజస్థంభం పక్కన ప్రతిష్టించారు. దీనిని కప్పక స్థంభంగా పిలుస్తారు. దీని చుట్టూ ప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం.

● గాలి గోపురం క్రింద ఇరువైపులా ద్వారానికి జయ,విజయుల శిల్పాలు అతి మనోహరంగా ఉంటాయి.ఆలయం లోపల పంచలోహ ద్వజస్తంబంను నమస్కరిస్తే చెన్నకేశవ కృప లభిస్తుందని చెపుతారు.

● చెన్నకేశవ స్వామి ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో మునిగి పోతారు,ఆ దివ్య మంగళ రూపం చూడటానికి రెండు కళ్లు చాలవు.ఆయనను చూడడం బహు జన్మల పుణ్యఫలం.ఆయన్ను చూసిన తదేకంలో ఓం చెన్నకేశవాయ:,మంగళాయ:నమో స్తుతే అంటూ మైమరిచిపోతారు.

● ఆలయ ప్రాంగణంలో శ్రీ గిరీశ్వర స్వామీ ఆలయం నాటి కట్టడాల అందాలను చాటి చెప్పేలా ఉంటుంది.

● విఘ్నేశ్వర,సుభ్రమణ్య,పార్వతి అమ్మవార్ల దేవాలయాలు కూడా ఈ ప్రాంగణంలో మనం దర్శించవచ్చు. నాగేంద్రస్వామి,నవగ్రహాలు,ఇష్ట కామేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ప్రధాన ప్రత్యేకతను సంతరించుకున్నాయి.ఆలయ ప్రాంగంణం లోనే ఉన్న మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారు.

● ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు కనుల విందు చేస్తాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే స్వామి వారి కల్యాణం అద్బుతం గా చేస్తారు,ఈ కళ్యాణం భద్రాచల రామయ్య కళ్యాణం తో పోల్చేంత గొప్పగా కనుల పండుగ గా వేలాది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా చేస్తారు. 

Post a Comment

0 Comments