నేనంటే ఎవరు...?
ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ తనను పరిచయం చేసుకునే సందర్భంలో ‘నేను’తోనే ప్రారంభిస్తాడు. నేనంటే ఎవరు? మనిషి జాతా, కులమా, గుణమా, శరీరమా, ధనికత్వమా, అధికార హోదానా... మరేదైనా ప్రత్యేకతా?
శిశువు జన్మించినప్పుడు కులమతాల స్పృహ ఉండదు. ‘నేను’ అనే అహంకారం ఉండదు. మాటలు వచ్చాక ‘నేను’ మొదలవుతుంది. శరీరం, దానికి అంటిపెట్టుకున్నవన్నీ ‘నావి’ అనుకుంటాడు. అలాగే పెద్దవాడవుతాడు. ఈ భావన బలపడుతున్న కొద్దీ సభ్యసమాజం నుంచి వేరుపడుతుంటాడు. మనసు అనే కోశంలో పాములా స్వార్థం బుసలు కొడుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎవర్ని కాటు వేస్తుందో తెలియదు. కాటు వేసే పాముకు* *కారణాలేముంటాయి? అది దాని స్వభావం. స్వార్థపరుడు ప్రతి అవకాశాన్నీ వాడుకుంటాడు.
సమాజంలో అందరూ మంచివారే ఉండరు. భిన్న మనస్తత్వాలవారు ఉంటారు. తమను, తమ గౌరవమర్యాదలను కాపాడుకుంటూ మనిషి జీవనప్రయాణం సాగించాలి.
నేను- ఎవరో తెలుసు కోవడంలోనే ఆధ్యాత్మిక రహస్యం అర్థమవుతుంది’అనేవారు రమణ మహర్షి. నేను అనే మాయ సృష్టి మొదలు నుంచి మనిషిని ఆవరించుకుని ఉంది. శ్రీరాముడు కూడా ‘నేను’ నిర్వచనం కోసం వసిష్ఠమహర్షిని ఆశ్రయించాల్సి వచ్చింది. విశ్వామిత్ర, వసిష్ఠ, శ్రీరాముల ఆధ్యాత్మిక చర్చ యోగ వాసిష్ఠంగా రూపుదిద్దుకొంది.
ఆ గ్రంథం చదివి, అవగతం చేసుకున్నవారికి మాయతెరలు తొలగి ‘నేను’ ఎవరో* *అర్థమవుతుంది. ఏది నిజం కాదో అదే మాయ. అసత్యాన్ని నిజమనే భ్రమ కలిగిస్తుంది మాయ.
మంచితనమనే ముసుగు ధరించిన ఎందరో మనకు జీవితంలో తారసపడుతుంటారు. వీళ్లనే ‘గోముఖ వ్యాఘ్రా’లంటారు. పులి ఆవు ముఖం ధరిస్తే స్వభావం మారదు.
ప్రతి వ్యక్తినీ గుడ్డిగా నమ్మకూడదు. అతి నమ్మకంతోనే సమస్యలు మొదలవుతాయి. కొన్ని సమస్యల నుంచి ఎలాగోలా బయటపడతాం. కొన్ని ‘ఊబి’లోకి దింపేస్తాయి. ముందు జాగ్రత్తతో ముప్పును తప్పించుకోవాలి. ఏదో జరిగేవరకు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏదీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.
జాగ్రత్తగా గమనిస్తే ‘నేను’లో దాగిన అనేక రూపాలు మనకు ప్రత్యక్షమవుతాయి. గృహంలో ఉన్నప్పుడు నేను- భర్తగా, తండ్రిగా, పెద్దలు ఉంటే కుమారుడిగా, సోదరుడిగా వ్యవహరిస్తాడు. వృత్తి, ఉద్యోగాల వేళ ‘నేను’ అధికార హోదా అవుతాడు. మిత్రుల మధ్య ఒక సరదా మనిషి అవుతాడు. బాల్యమిత్రులు అగుపిస్తే బాలుడైపోతాడు. బంధువుల మధ్య బాంధవుడవుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దీనుడవుతాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆపన్నుడవుతాడు. శత్రువుల పట్ల కర్కశుడవుతాడు. ఇలా ‘నేను’ నిత్యమూ అనేక పాత్రలు పోషిస్తుంటుంది.
జ్ఞాన బోధల్లో ‘నేను’ అంటే ఆత్మ అనే నిర్వచనాలు వింటాడు. కాబోలు అనుకుంటాడు తప్ప ఆత్మవిచారం చేసి, తనలోని అంతర్యామిని వెతుక్కోడు. జీవిత చరమాంకం దాకా నేను ఆత్మ భావనలోకి మారకపోవడమే మాయ. దీన్ని జయించాలంటే గీతాకృష్ణుడు చెప్పినట్లు, వైరాగ్యమనే ఆయుధం కావాలి. లేదా సంపూర్ణ శరణాగతి చెయ్యాలి. లేకపోతే జీవితం నిష్ఫలమవుతుంది.
మనకు దైవరూపాలు ఎన్ని ఉన్నా మూలరూపం ‘ఓం’కారమే. యోగులు ‘ఓం’కారమే ధ్యానిస్తారని చెబుతారు. ఓంకారంలోని అకార-ఉకార-మకారాలే త్రిమూర్తులంటారు. మనిషి ‘నేను’ భావనలోంచి ఆత్మభావనలోకి ప్రవేశించడానికి ‘ఓం’కార ధ్యానం ఉపకరిస్తుందని యోగులు చెబుతారు.
0 Comments