పరీక్ష పూర్తవగానే పెళ్లి..!
● అందుకే ఇద్దరం ఉంగరాలు తెచ్చుకున్నాం.
●>టెన్త్ విద్యార్థి సమాధానంతో ఇన్విజిలేటర్ షాక్
గుంటూరు జిల్లా చుండూరు, మే 6: పదో తరగతి విద్యార్థి, విద్యార్థిని.. ఆఖరి పరీక్ష పూర్తికాగానే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీని కోసం ఉంగరాలు కూడా తెచ్చుకున్నారు.
పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్ వారివద్ద ఉంగరాలు గుర్తించి ప్రశ్నించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఇన్విజిలేటర్‌తోపాటు ఉపాధ్యాయులు కూడా షాకయ్యారు.
బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి హైస్కూల్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్థులకు శుక్రవారం ఆఖరి పరీక్ష జరిగింది. ఈ సందర్భంగా యడ్లపల్లి హైస్కూల్‌లో ప్రధాన ఇన్విజిలేటర్.. తనిఖీలు చేస్తుండగా ఓ విద్యార్థి జేబులో బంగారు ఉంగరం కనిపించింది. దీంతో ఆయన ఉంగరం జేబులో ఎందుకు పెట్టుకున్నావని ప్రశ్నించారు.
‘ఈ రోజు పరీక్ష అయిపోగానే మా క్లాస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అందుకోసమే ఉంగరాలు మార్చుకునేందుకు దీన్ని తీసుకొచ్చాను’ అని ఆ బాలుడు బదులిచ్చాడు. దీంతో నిర్ఘాంతపోయిన ఆ ఇన్విజిలేటర్.. ఆ బాలుడు చెప్పిన విద్యార్థిని వద్ద కూడా తనిఖీ చేయగా.. ఆమె వద్ద కూడా ఉంగరం ఉంది. పరీక్ష సమయం కాబట్టి చేసేదేమీ లేక ఉపాధ్యాయులు మిన్నకుండిపోయారు. అయితే ఇదేదో పెద్ద వివాదం అవుతుందని గ్రహించి.. పరీక్ష ముగిసిన తర్వాత ముందుగా బాలికలను ఇళ్లకు పంపించి.. ఓ అరగంట తర్వాత బాలురను బయటకు వదిలారు.
0 Comments