GET MORE DETAILS

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం - యోగా గురించి వివరాలు తెలుసుకుందాం.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం - యోగా గురించి వివరాలు తెలుసుకుందాం. 
యోగా దివ్యౌషధం

సంఘటిత ఆరోగ్యానికి మెరుగైన సాధనం

యాంత్రిక యుగంలో పరిపూర్ణ ఆరోగ్యం

ఐక్యరాజ్య సమితి వేదికపై 2014 సెప్టెంబర్‌ 27న జరిగిన 69వ సమావేశంలో ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చారు. ఐరాస 2014 డిసెంబర్‌ 11న 193 సభ్య దేశాల్లో 177 దేశాలు ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపాయి. దీంతో ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరిపేందుకు ఐరాస ఆమోదించింది. పరిపూర్ణ ఆరోగ్యం కోసం ప్రపంచ మానవాళికి యోగా ఉపకరిస్తుందని తీర్మానించారు.

యోగా పుట్టుపూర్వొత్తరాలు :

క్రీస్తు పూర్వం నుంచే హరప్పా మొహంజోదారో కాలంలో కూడా నాణెలపై ఒక యోగా ముద్ర కనిపిస్తుంది. యోగా చరిత్ర ఈ నాటిది కాదు. పురాతనమైన భారతీయ సంస్కృతిలో భాగమే. నాటి నుంచి నేటి వరకు అభివృద్ధి చెందుతూనే ఉంది. దేశంలోని అనేక గ్రంథాల్లో దీని గురించి రాసి ఉంది. క్రీస్తుకు పూర్వం నుంచి ఉన్న దీన్ని గౌతమబుద్దుడు ఆచరించి చూపగా పతంజలి మహర్షి దాన్ని సమీకరించి క్రోడీకరించారు. వివేకానందుడు ఆధునిక యుగంలో ప్రపంచానికి చాటాడు. ధ్యానం, తపస్సు, యోగా ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకొని నేడు ప్రపంచంలో సుమారు వందకు పైగా దేశాల్లో ఆచరించి ఫలితాలను సాధిస్తున్నారు.

యోగా వల్ల లాభాలు :

యోగాతో ఏకాగ్రత, బుద్ధి కుశలతలు వికసిస్తాయి. సమగ్రంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ప్రకృతి సత్యాన్ని గ్రహించడమే కాకుండా నిత్యం ఆనందంగా ఉండొ చ్చు. అన్ని రకాల అనారోగ్య సమస్యల్ని ఖర్చులేకుండా నయం చేసుకోవచ్చు. తగిన సమతుల ఆహారం తీసుకునే వీలు యోగా ద్వారానే కలుగుతుంది. ప్రాణాయామం ద్వారా కోరిన రీతిలో శ్వాస అదుపులోకి వస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అలసట, ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అద్భుతాలను సాధించవచ్చు.

యోగా మన జాతి సంపద :

భారతదేశపు సంప్రదాయ కానుక యోగా. దీని విశిష్టతను విశ్వం నలుమూలలా ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ చేసిన కృషి వల్ల ఐక్యరాజ్య సమితి జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా భారత ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎంతో ఆనందంతో యోగాసనాల్లో పాల్పంచుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం 2016లో సామాన్య యోగా విధివిధాన క్రమాన్ని రూపొందించింది.

సంఘటిత ఆరోగ్య సాధన :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు నేడు అనేక సంస్థలు, సంప్రదాయ గురువులు యోగా ప్రాశస్త్యాన్ని తెలుసుకొని ముందడుగు వేస్తూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బెంగళూరు శ్వాస అంతర్జాతీయ యోగా విశ్వవిద్యాలయం స్థాపించి యోగా వ్యాప్తికి తోడ్పడుతున్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఆ సంస్థ వెలుగులో సిద్ధార్థ యోగా విద్యాలయం ఎంతో మంది యోగా మాస్టర్లను తయారు చేసింది. జిల్లాలో యోగా వ్యాప్తికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కూడా గత నాలుగేండ్ల నుంచి సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతోపాటు జిల్లాలో సిద్ధార్థ యోగా విద్యాలయం, పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీ, బ్రహ్మకుమారీస్‌, రామచంద్ర మిషన్‌, యోగా భారతి, ఝాన్సీ యోగా కేంద్రం, కూలీలైన్‌ యోగా సెంటర్‌, బాబూక్యాంప్‌ యోగా కేంద్రం, రైటర్‌బస్తీ యోగా కేంద్రం, ప్రకృతి ఆశ్రమం తదితర సంస్థలు ధ్యానం, యోగాపై సామూహిక శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నాయి.

ఏకాగ్రతకు ఏకైక మార్గం యోగా :

నేను డిగ్రీ చేస్తున్నాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు యోగా కోర్సు పూర్తి చేశాను. సింగరేణి సంస్థ సహకారంతో మా ఇంటి వద్ద అందరికీ ఉచితంగా యోగా నేర్పిస్తున్నాను. ఏకాగ్రత పెరగాలంటే యోగానే మార్గం.

మనస్విని, యోగా శిక్షకురాలు


మానసిక ప్రశాంతతనిస్తుంది :

నేను ప్రైవేట్‌ జాబ్‌ చేసుకుంటూనే సింగరేణి ఉద్యోగులకు రైటర్‌ బస్తీలోని యోగా కేంద్రంలో ఉచితంగా యోగాను నేర్పిస్తున్నాను. వ్యాపార ఉద్యోగాల్లో తలమునకలై ఉండే వారికి యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Post a Comment

0 Comments