GET MORE DETAILS

లింగాలు కాదు. అవి నరికేసిన బౌద్ధ స్తంభాలు !

 లింగాలు కాదు. అవి నరికేసిన బౌద్ధ స్తంభాలు ! 



బుద్ధుడు కాలామసుత్తం-లో తన అనుచరులకు ఈ విధంగా చెప్పాడు.. ''కాలాములారా! ఏ విషయం గురించి అయినా విన్నది నమ్మకండి! అది పరం పర నుండి గాని, ప్రసిద్ధి గాంచిందని గాని, గ్రంథాలలో ఉందని గానీ, తర్కం వల్ల ప్రాప్తించిందని గాని, న్యాయమని అనిపించిందని గానీ, సుందరంగా ఉందని గాని, ఇష్టమైందని గానీ, సమర్థమై నదని గానీ, ఇంకా మన శ్రమణుడు (గురువు) వచించిందని గానీ స్వీకరించకండి! కాలాములారా! ఒక విషయం అకుశల మైనదని, దోశమైనదని, విజ్ఞులు నిందించేదని దేనిని సందేహించకుండా స్వీకరించడం వల్ల అహితం, దుఃఖం కలుగుతుందని ఎప్పుడైతే మీరు స్వయంగా తెలుసుకుంటారో, కాలాములరా! మీరు దాన్ని వదిలేయండి!

కాలాములారా! ఒక విషయం కుషలమైందని, దోషరహితమైందని, విజ్ఞులు పరిశీలించునదని - దేనిని నిస్సందేహంగా స్వీకరించడం వల్ల సుఖం, హితం కలుగుతుందని ఎప్పుడైతే మీరు స్వయంగా తెలుసుకుంటారో అప్పుడు కాలాములారా! దానిని స్వీకరించి విహరించండి!

భిక్షువులారా! నా మాటలు కూడా నేను చెపుతున్నానని మీరు గ్రహించకండి. జాగ్రత్తగా పరీక్షించిన తర్వాతే గ్రహించండి.'' - అంగుత్తర నికాయ - 3.65

ఎవరికి వారు ప్రతి విషయాన్ని పరీక్షించి, విశ్లేషించి, నిజానిజాలు బేరీజు వేసుకోవాలని బుద్ధుడు బోధించిన ప్రకారమే ఇక్కడ నేను పొందుపరిచిన విషయాల గూర్చి కూడా నిజనిర్ధారణ చేసుకోవాలని కోరుతున్నాను. ఒకప్పటి బౌద్ధారామాలు, జైన మందిరాలు వైదిక మతస్థులు నిర్దాక్షిణ్యంగా మార్పులు, చేర్పులు చేసుకుని, తమ ఇష్ట ప్రకారం ఇష్ట దేవతలకు ఆలయాలుగా ఎలా మార్చు కున్నారో గమనించండి! ఈ దుర్మార్గం తలపెట్టక ముందు బుద్ధుణ్ణి, తమ దశావతారాల్లో ఒకటిగా చేర్చుకున్న విషయం మరవకూడదు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిజిల్లా రామచంద్రా పురం నుండి 4-5కి.మీ. దూరంలో ద్రాక్షారామం ఉంది. 'ఆరామ' అనే పదమే - ఆ స్థలం బౌద్ధులదని చెపుతోంది. బౌద్ధ భిక్షువులు నివాసముండే స్థలాన్ని ఆరామాలు అనేవారు. ఆ రకంగా ద్రాక్షారామం ఖచ్చితంగా బౌద్ధులదే...

గతంలో ఆర్యులు, అనార్యుల మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉండేది. ఆర్యులు చాతుర్వర్ణాన్ని విశ్వసిస్తారు. యజ్ఞాలు చేస్తారు. అనార్యులు వీటికి వ్యతిరేకులు. దక్షుడి యజ్ఞానికి సంబంధించిన కథను పరిశీలిస్తే... దక్షుడు ఆర్యుడు. శివుడు అనార్యుడు. ఒకప్పుడు శైవం హిందూ మతంలో భాగం కాదు. బలవంతుల్ని ఎదిరించలేక, వారి ప్రభావాన్ని తప్పించుకోలేక వారిని తమ మతంలో కలుపుకోవడం వైదిక మతస్థుల తత్వం. బుద్ధుణ్ణి దశావతారాల్లో కలుపుకున్నట్టు, ఇటీవల ఒక ముస్లింను సాయిబాబాగా మార్చి హిందూ మతంలో చేర్చుకున్నట్లు... తొలి దశలో ఆటవికుల దేవుడైన శివుణ్ణి వైదిక మనువాదులు తమ హిందూ మతంలో కలపుకున్నారు. విష్ణువుకు ఇచ్చిన స్థాయిని, ఒక్కోసారి అంతకు మించిన స్థాయిని శివుడికి ఇచ్చారు. దక్షయజ్ఞం కథలో చాతుర్వర్ణ వ్యతిరేకత, యజ్ఞ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. శివుడు ఆటవికుల దేవుడు అనేది ఏ కొంచెం లోతుగా ఆలోచించినా అర్థమవుతుంది. బ్రహ్మ, విష్ణుల వలె మహేశ్వరుడు దేవతా వస్త్రాలు ధరించి దేవలోకంలో ఉండడు. మంచుకొండల్లో, పెద్దగా ఆచ్ఛాదనలు లేకుండా, జంతు చర్మం చుట్టుకుని, మెడలో ఓ సర్పాన్ని ధరించి మోటుగా, అనాగరికంగా కనబడే శివుడు, మిగతా దేవతల కంటే భిన్నంగా ఉంటాడు. వైదిక మతంలో కలుపుకున్నాక పురాణాలలో అతని స్థానం స్థిరపడింది.

ఇకపోతే, ద్రాక్షారామం ఒకప్పటి బౌద్ధక్షేత్రం అని చెప్పడానికి పురావస్తుశాఖ వారికి తగినన్ని ఆధారాలు దొరికాయి. ఇక్కడి మూలవిరాట్‌ లేదా లింగం బుద్ధ చైతన్యంలోని ఒక అయాక స్తంభం అని గుర్తించారు. బౌద్ధుల ఆరాధనా పద్ధతుల్లో చైత్యాలు, స్థూపాలు తప్పకుండా ఉంటాయి. బుద్ధుడివలె బౌద్ధులలో ప్రముఖులైన వారి భౌతిక అవశేషాలపై ఎత్తయిన ఆకారాలు, స్థూపాలు ఏర్పాటుచేసేవారు. ఈ ఎత్తయిన ఆకారాల్ని నరికి, తమకు అనువైన విధంగా లింగాకారంలో చెక్కుకోవడం ఆదిశంకరుని కాలంలోనూ, అతని తర్వాత కాలంలోనూ జరుగుతూనే ఉండేవి. ఇంతకూ ఈ 'లింగం' ఎలా వాడుకలోకి వచ్చిందన్నది బహిరంగ రహస్యమే! ఈ సృష్టికి కారణం కనపడని దేవుడే అని మనిషి చాలా కాలం నమ్మాడు. తర్వాత కాలంలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాల కారణంగా సృష్టి జరుగుతోందని గ్రహించాడు. అందువల్ల స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్ని పూజించడం ప్రారంభిం చాడు. మనదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆ భావనని నిలుపుకుంటూ వచ్చారు. కొన్ని కొన్ని దేశాల్లో పురుష ప్రత్యుత్పత్తి అవయవానికి గుళ్ళు కూడా వెలిశాయి. ఊరేగింపులూ జరుగుతున్నాయి. ఇక్కడ మనదేశంలో అదే లింగమైంది. దానినే శివుడికి ప్రతిరూపంగా కొలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, అనకాపల్లి దగ్గర్లో 'లింగాల కొండ' అని చెప్పుకునే బౌద్ధక్షేత్రం శిల్పాలు చూస్తే విషయం బోధపడుతుంది. స్థంభాల్ని చిన్నగా కుదించి, పైన గుండ్రంగా చెక్కి, లింగాకారంగా నునుపు చేసి, తీర్చిదిద్దుకోవడం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బుద్ధుడి గోళ్ళు పాతిపెట్టి, అక్కడ కట్టిన స్థూపం వల్ల ఉత్తర భారతదేశంలో ఒక నగరానికి లక్నో అనే పేరొచ్చింది. పాళి భాషలో గోళ్ళకు ఉన్న పదం పలకలేక వాడుకలో అది లక్నో అయ్యింది. అలాగే దేశ వ్యాప్తంగా వైదిక మత ప్రచారకులు బౌద్ధాన్ని నాశనం చేసే పనిలో అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. లింగాలు తవ్వుతాం - అని అనే మేతావులు అసలా లింగాలు ఒకప్పటి మార్చుకున్న ఆయాక స్థంభాలని గ్రహిస్తారా? నిజాల్ని జీర్ణించుకునేంతటి విశాల హృదయం వారికి ఉండాలి కదా?

ఫాహియాన్‌, హ్యూయెన్‌ త్సాంగ్‌ వంటి ఆనాటి బౌద్ధయాత్రికులు మన శ్రీపర్వతం (కొండ) గురించి ప్రస్తావించారు. శ్రీపర్వతం అంటే ఇప్పుడు మనం శ్రీశైలంగా పిలుచుకుంటున్న ప్రాంతం. ఈ శ్రీశైలం కూడా బౌద్ధక్షేత్రమే. బహుశా సాధారణ శకం మొదటి శతాబ్దం నాటిదై ఉండొచ్చు. అప్పటికి మహాయాన బౌద్ధం బాగా వ్యాప్తి చెంది ఉంది. బౌద్ధ పండితుడు నాగార్జునుడు ఇక్కడ ఉండేవాడని హ్యూయెన్‌ త్సాంగ్‌ రచనల వల్ల తెలుస్తోంది. ఇక్కడి ఆలయంలో భద్రపరచబడి ఉన్న శిలా శాసనాలు పద్నాలుగవ శతాబ్దం నాటివి. ఇక్కడి దేవస్థానం బోర్డు ఏర్పడక ముందు, ఇది కడప జిల్లా పుష్పగిరి మఠం ఆధీనంలో ఉండేది. ఫిబ్రవరి - మే నెలల మధ్య ఆలయ ఉత్సవాలు ఆ మఠం ఆధ్వర్యంలో జరిగేవి. మిగతా రోజుల్లో స్థానిక చెంచుల - జంగం పూజారి నిర్వహణలో ఆ ఆలయం ఉండేది. దేశమంతటా జరిగిన విధంగానే ఆది శంకరుని పర్యవేక్షణలో శ్రీశైలం-నాగార్జున కొండలోని బౌద్ధ విగ్రహాలు, స్మారక చిహ్నాలు, చిన్న స్థంభాలు, పెద్ద పెద్ద ఆరామాలు అన్నీ ధ్వంసం చేయబడ్డాయి. మతం కోసం - హింస, దౌర్జన్యం, ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలు చేసింది మనువాదులే! ముస్లిం చొరబాటు దారులు కేవలం సంపదను దోచుకుపోయారు. మనువాదులు దేశంలో భౌతికవాద మూలాల్నే చిదిమేశారు. అసలైన వారసత్వ సంపదని మట్టుబెట్టారు. అబద్దపు కథల్ని ప్రచారం చేసి, అబద్దపు సంస్కృతీ సంప్రదాయాలతో దేశాన్ని నిర్వీర్యం చేశారు.

ప్రముఖ పాశ్చాత్య పండితుడు జాన్‌ విల్సన్‌ ''పండరీపూర్‌'' బౌద్ధానికి చెందిన స్థలమని తన 'మెమొరీస్‌ ఆన్‌ ద కేవ్‌ టెంపుల్స్‌' గ్రంథంలో రుజువు చేశాడు. నామ్‌దేవ్‌ కంటే 1500 సంవత్సరాలకుముందు నుంచే మహారాష్ట్ర బుద్ధుని అనుచరుల భూమి. అక్కడ అహింస, కరుణ - గొప్పగా వర్థిల్లాయి. పుట్టిన పిల్లలకు 'భికోబా' లేదా 'భికుబాయి' అని పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీ అయ్యింది. ఆర్‌.సి.ధేరే మరాఠిలో రాసిన మొదటి పాట 'మానసోల్లాస్‌' బుద్ధస్తుతిలో రాసిందే! అది సాధారణ శకం 1131నాటి సంస్కృత గ్రంథం. సాధారణ శకం 1249నాటి శాసనాలు బౌద్ధ సంప్రదాయాలకు సంబంధించిన పాండురంగ, పుండరీక పేర్లను పేర్కొన్నాయి. ఇవి ప్రసిద్ధ బౌద్ధగ్రంథం 'స్వధర్మ పుండరీక' నుండి తీసుకున్నవి. పుండరీక అంటే కమలం. కమలాన్ని పాళీ భాషలో పాండురంగ అని పిలుస్తారు. ఆయుధాలు ఉపయోగించిన రాముడు, కృష్ణుడిలా కాకుండా ప్రేమ, అహింసలతో బుద్ధుడు శత్రువులను జయించాడనీ, ఆ కారణంగానే నడుముపై రెండు చేతులు ఉంచిన - కాత్యావలంబిత ముద్రలో ఉన్నాడని వివరిస్తూ ఎ.ఆర్‌.కులకర్ణి అంగుళీమాల కథను ప్రస్తావించాడు.

సంత్‌ తుకారం, సంత్‌ ఏక్‌నాథ్‌ల మాటల్లో పండరీపూర్‌ బౌద్ధక్షేత్రమని రూఢగాీ తెలుస్తోంది. 'ధర్మం క్షీణించి, అధర్మం పెరగడాన్ని చూసి నీవు బుద్ధుని రూపంలో పండరీపూర్‌లో ప్రత్యక్షమయ్యావు' అని విఠల భగవానుడితో సంత్‌ ఏక్‌ నాథ్‌ అంటాడు. 'నీ ద్వారం దగ్గర సాధువులు నీకోసం వేచి ఉన్నారు. కానీ, నీవు బుద్ధుని అవతారంలో పండరీకుని కోసం నిలబడి ఉన్నావు' అని అంటాడు ఏక్‌నాథ్‌! సంత్‌ తుకారామ్‌కు నామ్‌దేవుడికి విఠలుడు మౌనంగా ఉన్న బుద్ధుని రూపంలో కనిపించాడని చెపుతారు. బుద్ధుడవయిన నువ్వు మౌనవ్రతం పాటించడం నా దురదృష్టం. పేరులోనూ, రూపంలోనూ భగవంతుడు బుద్ధుడిలా ధ్యాన ముద్రలో ఉండి, మౌనం వహించాడు - అని సంత్‌ తుకారం చెప్పేవాడట!

దేశంలోని ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నీ ఒకప్పటి బౌద్ధారామాలేనన్నది తెలిసిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న శివలింగాల గూర్చి కూడా అనుమానాలు అక్కరలేదు. బౌద్ధారామాల్లో ఉన్న చిన్న అయాక స్థంభాల్ని నరికి, పైభాగం గుండ్రంగా, నునుపుగా చేసి వాటిని శివలింగాలుగా ప్రకటించుకున్న విషయం స్పష్టంగా బట్టబయలైంది. అల్పసంఖ్యాకులుగా మిగిలిపోయిన బౌద్ధులు ఇప్పుడు ఉద్యమాలు చేసే పరిస్థితిలో లేకపోవచ్చు, కానీ గతంలో జరిగిన దౌర్జన్యాలు ఈ తరం వారు సంపూర్ణంగా తెలుసు కుంటున్నారు. అర్థం చేసుకుంటున్నారు. ఫలితంగానే, నేటి తరం మళ్ళీ బుద్ధుడి బోధనలవైపు, మానవవాదం వైపు ప్రయాణిస్తున్నారు. అందువల్ల భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది.


- డాక్టర్‌ దేవరాజు మహారాజు

  వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత,

జీవశాస్త్రవేత్త.

Post a Comment

0 Comments