GET MORE DETAILS

సామెతల్లో ఆయుర్వేదం

 సామెతల్లో ఆయుర్వేదం




● "తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" అని. కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికి మూలికలతో తయారు చేసే లేహ్యం, పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !


● "పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియకపోతే అశ్వగంధ పెద్ద మందు !"


● త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !


● "ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు, కనీసం కందిపుల్ల"  ఇవి పళ్ళు తోముకోవడానికన్నమాట..


● "వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు"


● అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని సామెత ఏమంటే  "కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "


● పుండుమీదకు ఉమ్మెత్త, నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట. సామెత "పుండుమీదకు నూనెలేదంటే  గారెలొండే పెండ్లామా అన్నట్లు"..


● "ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "


● వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది. సామెత ఇలా . "ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "


● కరక్కాయ పువ్వు , పిందె, పండు చాలా ఉపయోగకరమైనవి. శ్వాస, కాస, ఉదర, క్రిమి, గుల్మ, హృద్రోగం , గ్రహణి, కామిల, పాండు ఇన్ని రోగాలను హరిస్తుంది.. అందుకే "మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి " అని సామెత 


● ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది. సామెత ఇదుగో.. "పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "


● "ఒక పూట తింటే యోగి

రెండు పూటలా తింటే భోగి

మూడు పూటలా తింటే రోగి "


● అలానే శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత "కక్కిన బిడ్డ దక్కుతుంది " అని..


ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి ! 

పిల్లలు మాతృభాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?  సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ? అందుకే మాతృ భాషను చంపితే సంస్కృతి చస్తుంది! జాతి జీవనాడి నశిస్తుంది!

Post a Comment

0 Comments