GET MORE DETAILS

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. వెలకట్టలేనిది తల్లిదండ్రుల ప్రేమ. బిడ్డల ప్రతి మలుపులో నిలిచేది వారే : నేడు పేరెంట్స్‌ డే

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. వెలకట్టలేనిది తల్లిదండ్రుల ప్రేమ. బిడ్డల ప్రతి మలుపులో నిలిచేది వారే : నేడు పేరెంట్స్‌ డే

 


తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. బిడ్డల ఆనందమే తమ ఆనందంగా భావించే తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, అనురాగం వెల కట్టలేనివి. ఈ లోకంలో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారేమో గానీ ఎంత వెతికినా ప్రేమ లేని అమ్మ  బాధ్యత లేని నాన్న ఉండరు. అందుకే పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అపూర్వమైనది. అసాధారణమైనది. తల్లి జన్మనిస్తే  ఆ జన్మకు సార్థకత చేకూర్చేందుకు నిత్యం శ్రమించే వ్యక్తి తండ్రి. పిల్లల ప్రతి మలుపులో ప్రతి బాధలో  గెలుపులో తోడుగా నిలిచేది వారే. నేడు పేరెంట్స్‌ డే సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

నగర జీవితం యాంత్రికంగా మారుతోంది. ఉరుకుల పరుగుల జీవనంలో  ఎంతసేపూ డబ్బు సంపాదనే కీలకంగా మారడంతో చాలా మందికి తల్లిదండ్రులను చూసుకునే తీరక ఉండడం లేదు. దీంతో పట్టణాల్లో నూటికి 90శాతం మంది పిల్లలు వారిని విస్మరిస్తున్నారు. ఇళ్లలో వివిధ రకాల గొడవలతో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బిడ్డల్ని కనిపెంచి.. వారి ఉన్నత భవిష్యత్‌ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులు నేడు నిరాదరణకు గురవుతున్నారు. ఈక్షోభ భరించలేక కొంతమంది వృద్ధులు మనోవేదనతో ప్రాణాలు విడుస్తున్నారు. అయితే వృద్ధాప్యంలో తమకూ ఈ దుస్థితి ఏర్పడుతుందనే వాస్తవాన్ని నేటితరం గ్రహించలేకపోతోంది. ఇదిలా ఉండగా పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో భిన్న పరిస్థితి నెలకొంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు సేవలు చేస్తూ ఎంతోమంది ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏదేమైనా తల్లిదండ్రులను నిత్యం పూజించక పోయినా పర్వాలేదు.. కానీ వారిని ఆప్యాయంగా, ప్రేమగా పలకరిస్తే చాలు. ఆ ఆనందాన్ని తల్లిదండ్రులు ఏడాదంతా గుర్తుపెట్టుకుంటారు. అందుకే అందరం తల్లిదండ్రులను ప్రేమిద్దాం.

ఏమిటీ ప్రత్యేకత...

మదర్స్‌డే, ఫాదర్స్‌డే ఉండగా మళ్లీ ఈ తల్లితండ్రుల దినోత్సవం ఎందుకనే సందేహాం కలగకమానదు. మనకు తల్లిదండ్రులిద్దరూ ఒక్కటే. వేర్వేరుగా గౌరవించడం కన్నా.. ఇద్దర్నీ ఒకేసారి గౌరవిద్దాం అనుకునే వారు ఇలా తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదన అమెరికాలో మొదలైంది. 1984లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ అధికారికంగా ఈ దినోత్సావానికి ఆమోద ముద్రవేశారు. దీంతో ఏటా జూలై నాలుగో ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి భేదం ఉండకూడదని సుప్రీం కోర్టు ఆదేశించడంతో పేరెంట్స్‌ డే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

ప్రధాన ఉద్దేశం :

పిల్లలు పెద్దవుతున్నకొద్దీ పెద్దవాళ్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు రీత్యా బిడ్డలు వదిలివెళ్లిపోతుంటే ఒంటరిగా బతకలేక తల్లిదండ్రులు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారు పిల్లలతో ఉందామని ఆశపడతారు. కానీ వారికోరిక నేరవేరదు. దీంతో మానసిక వ్యాధికి గురవుతుంటారు. ఇటువంటివారి వేదనను గుర్తించి ఏడాదిలో ఒక్కరోజైనా వారి ఆశను నేరవేర్చడానికి ఏర్పాటైందే ఈ తల్లిదండ్రుల దినోత్సవం.

తల్లిదండ్రులు పాటించాల్సినవి :

● పారదర్శకతతో కూడిన పర్యవేక్షణ, లాలన, ప్రేమ, శ్రద్ధ, బాధ్యత, నియంత్రణ పిల్లలపై పూర్తిగా ఉండాలి.

● పిల్లలు పెద్దలు చేసే ప్రతి పనిని పరిశీలించడం, అనుకరించడం చేస్తారు. కాబట్టి పెద్దలు పిల్లల ముందు తమ వస్త్రధారణ, మాటతీరు, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

● పిల్లలు తెలిసోతెలియక అబద్దాలు చెబుతుంటారు. విసుక్కోకుండా వాటి కష్టనష్టాలను వారికి సున్నితంగా తెలియజేయాలి. 

● విజ్ఞానాన్ని విస్తరింప చేసుకోవడానికి కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు వినియోగం సర్వసాధారణంగా మారింది. పిల్లలు వీటిని సక్రమంగా వాడుకునేలా మార్గదర్శనం చేయాలి. 

● కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం మంచిది. వారాంతాల్లో సరదాగా గడపాలి. 

● వద్దు, కాదు, లేదు మొదలైన వ్యతిరేక పదాలను వాడకుండా ఆశావాద, సానుకూల ధోరణిని అలవాటు చేయాలి. 

● వయసుతో పాటు శరీరంలో కలిగే మార్పులు కొందరిలో భయాలను కలిగిస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చనువుగా స్నేహంగా మాట్లాడం ద్వారా ఆ లోపాలను, భయాలను సరిచేయవచ్చు.

● కుటుంబానికైనా, సమాజానికైనా విశ్వసనీయత, సమైక్యత, నీతినిజాయతీ, సుహృద్భావం, మానవీయ విలువలు, సహకారం అనేవి మూల స్తంభాలు. వాటిని వ్యక్తిపరంగా, సమష్టిగా పాటించాల్సి ఉంది. అప్పుడే సమాజంలో నిత్యం చూస్తున్న అనేకానేక అస్తవ్యస్త పరిస్థితులు.. ఆరాచకాలు, అక్రమాలు, అవినీతి అన్నతి నశించి ఆదర్శవంతమైన కుటుంబం.. తద్వారా ఆదర్శవంతమైన సమాజం రూపొందుతాయి.

● ఆహారం, వస్త్రధారణ, మాటతీరు, చేసే పనులు వీటిలో సంస్కారం, విలువలు, ఆరోగ్యం ప్రతిబింబిస్తాయి. అటువంటి చోటు ముందుగా ఇళ్లు. ఆ తరువాత బడి.

పిల్లలు చేయాల్సినవి :

◆ ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, సంతోషాలు అన్నీ తల్లిదండ్రులతో పంచుకోవాలి. ఫ జన్మనిచ్చిన తల్లిదండ్రులే అన్ని విషయాలు అర్థం చేసుకుంటారని గుర్తించుకోవాలి. వారి తరువాతే ఎవరైనా అని భావించాలి. 

◆ తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు, సూచనలు చెప్పే మాటలు అన్నీ తమ మేలుకేనని భావించాలి. 

◆ కౌమార దశలో స్వయం నిర్ణయాధికారం అధికంగా ఉంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రులను అత్యంత విశ్వనీయులుగా లెక్కించాలి.

◆ పిల్లలు ఎక్కడ దారి తప్పుతారో అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉంటారు. వారిని ద్వేషించకుండా వారి నమ్మకం పొందాలి.

◆ తల్లిదండ్రుల వద్ద రహస్యాలు దాచకుండా కుటుంబ స్థితిని గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకోవాలి.

◆ ఆర్థిక స్థాయిని బట్టి కోరికలను నియంత్రించుకోవాలి.

◆ విలువలు తగ్గిపోతున్న నేటి సమాజంలో యువత ఇంటి నుంచే మంచి పౌరులుగా ఎదగాలంటే సమష్టి కృషి అవసరం.

Post a Comment

0 Comments