GET MORE DETAILS

తరమాని : (లక్ష్మీ చారు) అని కూడా అంటారు.

 తరమాని : (లక్ష్మీ చారు) అని కూడా అంటారు.



1980-90 ల్లో పుట్టిన చాలామంది కచ్చితంగా విన్న పేరు. ఇది చాలా మంది లొట్టలేసుకొని తిన్న వంటకం ఇది. అలాగా తెల్లారి ఊరిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఊరి మొత్తం అదే వాసన వచ్చేది. మధ్యాహ్నం ఎండలో పనిచేసుకొని వచ్చే అయ్యకి ఈ తరమానితో అన్నం వడ్డిస్తే ఆ కష్టం మొత్తం మర్చిపోయి హాయిగా చల్లచేసే అమృతం ఈ తరమాని.

అమ్మా కాస్త బువ్వ ఉంటే పెట్టండి అమ్మా అని వచ్చే బిచ్చగాడు తరమాని వాసనకి అలా వాకిట్లో నిల్చొని అందరి ఇళ్లల్లో వేసిన అన్ని రకాల కూరలు, చారులు కలిసున్న ఆ బొచ్చులో ఈ తరమాని పడితే ఆ బిచ్చగాడికి పండగే...పండుగ.

మన రాష్ట్రంలో ఇప్పుడు వాడుకలో ఉందో లేదో తెలిదు కానీ  శ్రీకాకుళం లో మాత్రం తరమాని పులుసు అంటే ఈ రోజుకీ పొయ్యి మీద ఒక కుండ బియ్యం ఎక్కువ ఉడకాల్సిందే.

ఆ రోజుల్లో తరమాని పులుసుని ఒక వంటకం లాగా కాకుండా అది మా సంస్కృతి అన్నట్టు చూసేవారు. ఆరోజుల్లో కొత్త కోడలు ఇంటికి వస్తే ఆవిడ చేత మొదట చేయించే పని తరమాని కుండ పెట్టించడం.

ఈ కుండ పెట్టె కార్యక్రమం కూడా సాదాసీదాగా జరిగేది కాదు. సంతకి వెళ్లి మట్టికుండ తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి( పురుగులు కుండలోకి వెళ్లకుండా) దానికి కుంకుమతో బొట్టు పెట్టి కొయ్యికి ఉట్టికట్టి అందులో పెట్టేవారు. అన్నం వండిన తరువాత ఆ వచ్చే గంజిని ఆ కుండలో వేసి మూడు, నాలుగు రోజులు తరువాత చూస్తే అది పులిసి పులుపు వాసన వస్తుంటుంది.

దానిని తీసుకొని పొయ్యిమీద పెట్టిన కుండలో ఆ తరమాని వేసి సరిపడ ఉప్పు, కారం, పసుపు, మసాలాలు వేసి కాసేపు మరగనిచ్చి అందులో మీకు కావాలనిపిస్తే బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ఎండు చేపలు( నీసు తినేవారికి) వేసుకొని బాగా మరిగించి (తరమానిలో బెండకాయ ముక్కలే బాగుంటాయి) దాన్ని దించేసి కొంత సేపు ఆగి తాలింపు పెట్టేస్తే సరి.

అన్నం తినేసి గంజి పారబోసే దాని కన్నా ఈ తరమాని విధానం ఎంతో మేలు. బియ్యంలో ఉండే పోషకాలు గంజి లో చేరి అక్కడ నుండి బయటకు వెళ్లిపోతున్నాయి. అదే ఈ తరమాని పులుసులో ఆ గంజి వాడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

నాగరికత తరువాత నేర్చుకున్న ఎన్నో విషయాలు నగరీకత మాయలో పడిన తరువాత వదిలేస్తున్నారు. చింతపండు వాడకం వలన మనకు జరిగే నష్టాలు తెలిసి కూడా(కొన్ని లాభాలు ఉన్నప్పటికీ ) తరమాని వాడకం వలన మనకు కలిగే లాభాలు తెలిసినప్పటికీ మీలో మార్పు రావటం లేదు.

మూడు నాలుగు రోజులు పులిసినది మేము తినాలా...? అని కొంత మంది మాట్లాడుతుంటారు. కానీ వారు వారానికి సరిపడా రసం వండేసి ఫ్రిజ్ లో దాచి వారం మొత్తం తింటారు. దాని కన్నా ఇది ఎంతో మంచిది కాదా.

అది నిల్వ ఉంటే పాడైపోతుంది. అదే తరమాని నిల్వ ఉంటే పోషకాలు పెరుగుతాయి కాస్త ఆలోచించండి.

మీకు ఏదైనా కొత్త వంటకం తినాలి అనిపిస్తే వెంటనే జోమటో, స్వీగ్గీలకి కబురు పెట్టడం మానేసి..కనీసం అప్పుడయన ఈ తరమాని లాంటి పూర్వపు వంటకాలని తయారుచేయడానికి ప్రయత్నించండి.

మన సంస్కృతి ని కాపాడండి. నిర్లక్ష్యం చేయకండి.

Post a Comment

0 Comments