తెల్లదొరలని వణికించిన తెలుగువాడి పాట (నేడు గరిమెళ్ళ సత్యనారాయణ జయంతి)
యం. రాం ప్రదీప్
తిరువూరు
9492712836
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ప్రజల్లో దేశభక్తి నింపడానికి ఎంతోమంది కవులు దేశభక్తి జీతాలు రాశారు. బెంగాల్ విభజన సందర్భంగా వందేమాతర నినాదం పౌరులలో దేశభక్తి నింపింది.అలాంటి రోజుల్లో ఒక సామాన్యమైన తెలుగు కవి తెల్లదొరల అరాచకాలను తెగనాడుతూ గొంతెత్తాడు. ఆయన కలం నుంచి జాలువారిన తెలుగు పాట "మాకొద్దీ తెల్లదొరతనము.. దేవా.. మా కొద్దీ తెల్లదొరతనము’’ అనే పాట రాసిన ఆ కవి గరిమెళ్ల సత్యనారాయణ.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా, గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14వ తేదీన గరిమెళ్ళ సత్యనారాయణ జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. ఈయన ప్రాథమిక విద్య ప్రియాగ్రహారంలోనూ... విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరంలలో పై చదువులు చదివారు. బీఏ పూర్తయ్యాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా, విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ పనిచేశారు.
ఆ తరువాత జాతీయోద్యమ స్ఫూర్తితో 1920 డిసెంబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ "మా కొద్దీ తెల్లదొరతనం" పాటను రాశారు. ఆ రోజుల్లో రాజమండ్రిలో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా, ఈనోటా ఈ పాట గురించి ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట.
ఈ పాట ఆనాడు తెలుగు వారిని ఎంతో ఉత్తేజపరిచింది. ఇందుకుగాను బ్రిటిష్ వారు ఆయనకు జైలు శిక్ష విధించారు.ఆయన మంచి గాయకుడు కూడా.చివరిదశలో పేదరికం బారిన పడ్డ గరిమెళ్ళకు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు కొంత సహాయ పడ్డారు. వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవారు. వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలేది కాదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి.
ఒక కన్ను పోగొట్టుకుని, పక్షపాతం బారిన పడ్డ ఆయన దిక్కుతోచని స్థితిలో కొంతకాలం యాచన మీద కూడా బ్రతికారు. స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా ఆయనకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి గరిమెళ్ళ చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవిస్తూ 1952 డిసెంబర్ 18వ తేదీన పరమపదించారు.
0 Comments