కొత్తచెఱువులో భూవివాదాలను పరిష్కరించిన శ్రీకృష్ణదేవరాయలు.
శాసనాలపట్ల ప్రజలలో అవగాహన, జిజ్ఞాసలు బాగా పెరిగాయని అందువలననే తమ కార్యాలయానికి శాసనాల ఫోటోలు వెల్లువెత్తుతున్నాయని కేంద్రప్రభుత్వ ఆర్కిలాజికల్ డైరెక్టర్ ఆఫ్ ఎఫిగ్రఫి డా॥ కే.మునిరత్నంరెడ్డి గారు తెలియచేశారు.స్థానికచరిత్ర సంస్కృతులను తెలుసుకోవాలనే తపన తాపత్రయం ప్రజలలో బాగా పెరిగిందని డా॥ రెడ్డి తెలియచేశారు.
ఇటీవల కాలములో శ్రీసత్యసాయి జిల్లాలోని కొత్తచెఱువు మండలకేంద్రం నుండి రెండు శిలాశాసనాలను విశ్రాంత ప్రధానోపాధ్యుడు వెంగన్న పంపించారని, ఆ శాసనాల సారాంశాలు క్రింది విధంగా వున్నాయని డా॥ రెడ్డి తెలిపారు.
కొత్తచెఱువు గ్రామంలోని మొదటి శాసనము శ్రీకృష్ణదేవరాయల కాలంనాటిది, ఇది తెలుగుభాషలో తెలుగులిపిలో వుంది.శాలివాహన శకసంవత్సరము 1435 అంగీరసనామ సంవత్సరము కార్తీక శుద్ధ 12 శుక్రవారం అనగా 12.11.1513 నాటికి చెందినదీ శాసనము.
సారాంశమేమిటంటే చిక్కవడయారు లేదా చిక్కఒడయలు బుక్కపట్నం చెరువు నిర్మాత, ఇతనే అనంతసాగరమనేచెఱువును బుక్కరాయసముద్రం, అనంతపురం గ్రామాలను కూడా నిర్మించాడు. ఇతను తాను నిర్మించిన చెరువుకు తూర్పుదిశగా ఏలిక పేరుమీదుగా బుక్కపట్నం గ్రామాన్ని నిర్మించాడు, పడమర వైపు కొత్తగా వెలిసిన గ్రామాన్ని కొత్తచెరువుగా పిలిచారు.
చిక్కఒడయలు కొత్తచెరువు గ్రామంలో కొంత భూమిని బ్రాహ్మదేయంగా, దేవదాయంగా నిర్ణయించి సర్వమాన్యంగా ఇచ్చాడు.బ్రాహ్మదేయమంటే అక్కడి బ్రాహ్మణులు అనుభవించుకొనేటందుకు ఇచ్చిన భూమి, దేవదాయమంటే దేవాలయ నిర్వహణకు ఇచ్చిన భూమి, ఇక సర్వమాన్యంగా అంటే ఏలాంటి పన్నులు విధించకుండా దానంగా భూమిని ఇవ్వడము.
కొత్తచెరువు గ్రామంలో కాలక్రమంలో దేవాదాయ బ్రాహ్మదేయ భూముల నిర్వహణలో ఎవో అవాంతరాలు చిక్కులు వచ్చాయి. అందువలన స్థానికులు సమస్యను శ్రీకృష్ణదేవరాయల వద్దకు తీసుకుపోవడం జరిగింది. రాయలు ఆ అవంతారాలను అడ్దంకులను తొలగించి దేవదాయ, బ్రాహ్మదేయ భూములను సర్వమాన్యంగా అనుభవించుకోవచ్చని అజ్ఞ జారీ చేసి, ఇదే విషయాన్ని 22.10.1512 లో శాసనరూపకంగా తెలియచేశాడు. ఈ శాసనం బుక్కపట్నం గ్రామంలో వుంది.
ఏం జరిగిందో ఏమో కాని ఈ భూములపై ఈ కలతలు అవాంతరాలు మరల ఉత్పన్నము కాగా, శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటకలోని శివసముద్రదుర్గ ముట్టడిలో వున్నపుడు, దాన గ్రహీతలు, గ్రామపెద్దలు అక్కడి వెళ్ళి మొరపెట్టుకొన్నారు.
వెంటనే రాయలు గతంలో ఇచ్చిన దానాలను యథావిధిగా నిలిపి (Restoration of Devadaya, Bramhadaya Manyams) కొత్తచెరువు గ్రామములో తన ఆజ్ఞను శిలాశాసనరూపంలో ప్రకటించాడు. ఆ కొత్తచెరువు శాసనం గురించే మనం ఇప్పుడు చెప్పుకొన్నాము.
దీనిని బట్టి ఆ రోజులలో కూడా భూవివాదాలు భూమిసమస్యలు ఉండేవని, అవి చిలికిచిలికి గాలివానై చక్రవర్తి సమక్షంలోనే పరిష్కరించబడేవని విశదం అవుతోంది. భూతగాదాలంటే ఇతరులు భూదురాక్రమణ చేయడము, లేదా దాయాదుల మధ్య కలహాలు లేదా గ్రామపాలకుల వలన ఇబ్బందులు వగైరాలు కావచ్చును.
మరో శాసనము కూడా కొత్తచెఱువు గ్రామంలో లభించిందే. ఆ శాసనవివరాలను డా॥ K. మునిరత్నంరెడ్డిగారు ఇలా తెలియచేస్తున్నారు.
తెలుగుకన్నడ భాషలలో వున్న ఈ శాసనము విజయనగర చక్రవర్తి సదాశివరాయల కాలానికి సంబంధించినది అనగా 15.6.1551 నాటిది.
పెనుకొండ రాజ్యం ( రాజ్యమంటే ఇప్పటి రాష్ట్రమనుకోవాలి) జయనాదానికి చెందిన అరువన గ్రామంలోని కొంతభూమిని సాలువ తిమ్మయ్య కుమారులైన తిరుమలయ్య, పురుషోత్తమయ్యలు అనేవారు 24 తెగల దొమ్మరులకు దానంగా ఇచ్చారు. వారికి మేలు జరగాలనే ఉద్దేశ్యంతో ఈ దానం చేయడం జరిగింది. అరవన గ్రామం ఇపుడు గుర్తించడము కష్టము, అనంతపురం జిల్లాలో కూడేరు మండలములో ఓ అరవకూరు వుంది. జయనాద అంటే నాడు లేదా సీమ ( ఇప్పటి తాలూకా వంటిది) కావచ్చును.
ఆ రోజులలో సమాజంలో దొమ్మరులకు సముచితస్థానం వుండేది. 24 శాఖల దొమ్మరులు దేవాలయాలకు అనేక దానాలను చేసినట్లు దృష్టాంతరాలున్నాయి.
దొమ్మరుల సేవలకు మెచ్చి రాజులు దొమ్మరిమాన్యాలను ఇచ్చిన దాఖలాలు చాలావున్నాయి.
0 Comments