GET MORE DETAILS

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం : అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం : అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా 



కృతయుగంలో వశిష్ట మహాముని గోదావరిలోని పాయను తెచ్చి సాగరసంగమం గావించి  తపస్సు చేసిన ప్రాంతం " అంతర్వేది " 

త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి దర్శించుకున్న క్షేత్రం "అంతర్వేది"

ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రకు వెళ్తూ ఆగిన తీర్థం "అంతర్వేది" 

వశిష్ఠ మహర్షి కోరికపై శ్రీమహావిష్ణువు ధర్మపత్నీ సమేతంగా వెలసిన పుణ్యస్థలి "అంతర్వేది"

ఏటా మాఘమాసంలో రథసప్తమి పర్వదినంతో ప్రారంభమై పదిరోజుల పాటు ఈ క్షేత్రంలో జరిగే తిరుకల్యాణోత్సవాల శోభ నభూతోనభవిష్యతి అంటారు భక్తులు. 

ఆ పదిరోజులూ అంతర్వేదిలో అడుగడుగునా నారసింహ జయజయధ్వానాలతో ఈ క్షేత్రం మారుమోగుతుంటుంది. మాఘశుద్ధ దశమినాడు  స్వామివారి కల్యాణోత్సవం, మర్నాడు మధ్యాహ్నం రెండు గంటలకు దివ్య రథోత్సవం. ఆ వేడుకల్లో స్వామివారి దర్శనభాగ్యం కాగానే భక్తులు ఆనందపారవశ్యంలో మునిగిపోతారు. ఆ క్షణం అపురూపం.. అందరి హృదయాలూ స్వామికే అంకితం!

స్థలపురాణం :

కృతయుగాన వశిష్ఠ మహర్షికీ విశ్వామిత్రుడికీ పోరు జరిగింది. ఆ సమయంలో విశ్వామిత్రుడు తన మంత్రబలంతో హిరాణ్యాక్షుడి కుమారుడైన రక్తవిలోచనుడిని రప్పించి వశిష్ఠ మహర్షి కొడుకులు వందమందినీ చంపించాడట. పుత్రశోకాన్ని భరించలేకపోయిన వశిష్ఠ మహర్షి నరసింహస్వామిని ప్రార్థిస్తూ తపస్సు చేశాడట. అప్పుడు స్వామి ప్రత్యక్షమై రాక్షసుడ్ని సంహరించాడట. అయితే రక్తవిలోచనుడికి ఒక వరం ఉంది. అతని శరీరం నుంచి చిందే రక్తపుబొట్టు ఎన్ని ఇసుకరేణువులపై పడితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తారు. దాంతో స్వామివారి రక్తవిలోచనుని సంహరించే సమయంలో ఒక మాయాశక్తిని సృష్టించారట.

ఆ శక్తి తన నాలుకను చాచి రక్కసుని రక్తపుబొట్టు కింద పడకుండా చేయడంతో నరసింహస్వామి చక్ర ప్రయోగం చేసి రాక్షసుడ్ని సంహరించాడట. రాక్షస వధానంతరం ఆ మాయా శక్తి తన నాలుకను విడల్చగా ఆ రక్తం 'రక్తకుల్య' నదిగా మారిందని ప్రతీతి (ఆ మాయాశక్తిని  అశ్వరూఢాంబిక గా... గుర్రాలక్కదేవిగా స్థానికుల పూజలందుకుంటోంది).

తన కోరిక తీర్చిన నరసింహస్వామిని అక్కడే అవతరించాల్సిందిగా వశిష్ఠ మహర్షి కోరిన మీదట స్వామి అంతర్వేదిలో వెలశాడని స్థలపురాణం. ఈ రక్తకుల్య నదిలోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధమును శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. 

ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభికగానూ వెలిశారు.

( గుర్రాలక్క) ఆలయము నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రదాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో కలదు. 

మరో కథనం ప్రకారం... 

ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదిక గా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు.

ఆలయ నిర్మాణం :

పూర్వం మందపాటి కేశవదాసు అనే పశువుల కాపరి అంతర్వేది ప్రాంతంలో గొడ్లు కాసుకుంటుంటే ఒక ఆవు అక్కడ పుట్టలో పాలధారలు విడవటం చూసి భయపడ్డాడు. ఆ రోజు రాత్రి నరసింహస్వామి అతని కలలో కనిపించి తానుండే ప్రదేశం గురించి చెప్పడంతో అతను గ్రామస్థుల్ని కూడగట్టుకుని పుట్టను తవ్విచూడగా విగ్రహం లభ్యమైంది. అప్పుడు కేశవదాసు స్వామికి చెక్కలు, కర్రలతో మందిరం నిర్మించాడట.

ఇక ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని బెండమార్లంకకు చెందిన కొపనాతి ఆదినారాయణ కుమారుడు కృష్ణమ్మ క్రీ.శ. 1823లో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. 

కల్యాణం జరిగిన మర్నాడు దివ్యరథంపై స్వామివారిని ఉభయ దేవేరులతో ఊరేగించడం సంప్రదాయంగా వస్తోంది. రథం పై కొలువు తీరిన దివ్యమూర్తులను గుర్రాలక్కమ్మ గుడి వరకు తీసుకువెళ్తారు. స్వామి తన సోదరి అయిన గుర్రాలక్కమ్మకు సారె, చీర పెట్టిన వైనాన్ని ఆద్యంతం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

నర్సన్న కల్యాణమైతేనే...

ఏటా మాఘమాసంలో అంతర్వేది నృసింహ స్వామి కల్యాణం అయిన తర్వాతనే స్థానికంగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. మాఘమాసంలో స్వామివారి కల్యాణానికి ముందు ఎంత మంచి ముహూర్తం ఉన్నా పెట్టుకోరు. ఇది అనాదిగా సంప్రదాయంగా వస్తోంది. స్థానిక పల్లిపాలెం గ్రామంలో అయితే 80 శాతానికి పైగా నృసింహ నామధేయులే కనిపించడం విశేషం. 

ఏటా మాఘమాసంలో కొద్దిరోజులపాటు సూర్యాస్తమయ సమయంలో కిరణాలు గర్భగుడిలోని స్వామి వారి పాదాలను తాకడం ఇక్కడి విశేషం 

సఖినేటి పల్లి : త్రేతాయుగంలో శ్రీ రాముడు అరణ్యవాస సమయంలో ఈ పల్లె మీదుగా పయనిస్తూ సీతతో "సఖీ !ఇదే నేటి పల్లి. మనం ఇక్కడే విశ్రమిద్దాం!" అని అన్నాడట. అప్పటి నుంచి ఆ వూరి వారు తమ వూరిని సఖినేటిపల్లిగా పిలుచుకునే వారని అంటారు.

Post a Comment

0 Comments