GET MORE DETAILS

కార్తీక పురాణం - 1 : ప్రథమాధ్యాయము

కార్తీక పురాణం - 1 : ప్రథమాధ్యాయముశ్లో౹౹ వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమే౹

యన్నత్వా కృతకృత్యాస్స్యుః తం నమామి గజాననమ్౹౹

ఋషయ ఊచుః

శ్లో౹౹ వశిష్ఠేన విదేహాయ కథితం బ్రూహినో మునే౹

శ్రోతుకామావయంత్వత్తః కార్తీకవ్రతముత్తమమ్౹౹

తా౹౹ నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి.

సూతుడు ఇట్లు చెప్పెను. శౌనకాది సమస్తమునీశ్వరులారా! వినుడు. ఈ కార్తీకమహాత్మ్యమును వశిష్ఠమహాముని జనకమహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జననమరణ రూప సంసార బంధనమును త్రెంచుకుని మోక్షము పొందుదురు.

ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠమహాముని జనకమహారాజు గృహమునకు జేరెను. అంత జనకమహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనమునుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామముజేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి మునిపాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామరపువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త జంతువులయందును దయగలవాడును, బాలసూర్యసమాన కాంతిగలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తి భావముతో ఇట్లని విన్నవించెను.

బ్రాహ్మణోత్తమా! మీదర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యమింకేమియు లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తినొందినారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము, కనుక ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది.

సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠమహర్షి వికసించిన ముఖముగలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను. రాజోత్తమా! నీకు క్షేమమగుగాక. నేను మా యాశ్రమమునకు బోవుచున్నాను. రేపు మా ఇంటివద్ద యజ్ఞముజరుగును. దానికి ద్రవ్యమును ఈయగోరుదును.

ఆరాజిట్లు పల్కెను. మునీశ్వరా! యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చెదను. గాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీవలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధికఫలమునిచ్చెడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వరా! ధర్మజ్ఞా కార్తీకమాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము.

వశిష్ఠుడిట్లు పల్కెను. రాజా! పూర్వ పుణ్యమువలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాషగలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను. వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్త్వగుణము కలుగును. రాజా! సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీకవ్రతమును తులాసంక్రమణము = సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని, కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని, ఆరంభించి నెలరోజులు చేయవలెను. ఆరంభమందు ఓ దామోదరా! నేను కార్తీకవ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము అని సంకల్పము చేసి కార్తీకస్నానమారంభించవలెను. కార్తీకమాసమునందు సూర్యోదయసమయమున కావేరీనదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించినతోడనే మూడులోకములను పవిత్రముజేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త జలములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులందును, దిగుడుబావులందును, నూతులందును, చిన్నకాలువలందును హరి నివసించియుండును. కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాలవారు జేయవచ్చును.

బ్రాహ్మణుడు కార్తీకమాసమందు గంగకుబోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రములచేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షిపితృతర్పణ మాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకొని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను. తరువాత గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీజపము చేయవలెను. స్త్రీలు గౌరీజపము చేయవలెను. తరువాత ఔపాసనముగావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలోనుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రమమందు షోడశోపచారములతో పూజించవలెను. తరువాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వేదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనముగావించి, తరువాత పురాణకాలక్షేపమును చేయవలయును.

Post a Comment

0 Comments