GET MORE DETAILS

పాక్షిక సూర్య గ్రహణము - సా౹౹ 5.02 - 6.27వరకు

పాక్షిక సూర్య గ్రహణము -  సా౹౹ 5.02 - 6.27వరకు




ఈనాడు భారతదేశంలో స్వాతి నక్షత్రం, తులారాశిలో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. 

గమనిక : గ్రస్థాస్తమయ సూర్య గ్రహణం అగుటచే గ్రహణ మోక్షం (గ్రహణ విడుపు) కనిపించదు,

జ్యోతిష్కుల సలహా ప్రకారం హైదరాబాద్, పరిసర ప్రదేశంలో సూర్యగ్రహణ సమయాలు సాయంకాలం ఇలా ఉన్నాయి.

స్పర్శకాలం - సా౹౹ 04:58 

మధ్య కాలం - సా౹౹ 05:27

మోక్షకాలం - సా౹౹ 05:48      

ఆద్యంత పుణ్యకాలం - 50 నిమిషములు.

గ్రహణ దోషము శాంతులు :

1 ) గ్రహణ స్పర్శకాలం స్నానం ఆచరించి సూర్య గ్రహ & కేతు గ్రహ జపం లేదా వారి వారి ఇష్ట దేవ లేదా గురువులు ఉపదేశించిన మంత్రం, బ్రాహ్మణులు గాయత్రి జపం చేసుకోవాలి.

2) గ్రహణ మధ్యకాలంలో పితృలకు తర్పణం చేయాలి.

3) గ్రహణ మోక్ష కాలం నందు దోషపరిహారం కొరకు గోధుమలు (1250 గ్రాములు ) ఉలవలు (1250 గ్రాములు) రాగి పాత్రలో ఆజ్యం (నెయ్యి) పోసి వెండి సూర్య బింబం, వెండి సర్ప బింబం దక్షిణ సహితముగా దానం చెయ్యాలి.

ఈ గ్రహణం స్వాతి నక్షత్రం తులారాశిలో ఏర్పడనున్నది, కాబట్టి తులారాశివారు గ్రహణం చూడరాదు. 

స్వాతి నక్షత్రం వ్యక్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది, మరియు తులరాశిలో చంద్రుడు, సూర్యుడు లేదా తులా లగ్నమైననూ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది.

తులారాశి వారు గ్రహణ సమయంలో ధ్యానస్థితిలో ఉండాలి, గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది.

"గోధుమలు, ఉలువలు, బెల్లం, తోటకూర, అరటిపండును" మీ మీ శక్త్యానుసారంగా గోమాతకు సమర్పించండి, ధాన్యాన్ని నానబెట్టినవే తినిపించండి, మీరు పెట్టిన గ్రాసం ఆవు తింటున్నప్పుడు గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకోండి. 

లేదా ఈ వస్తువులను నిరుపేదలకు కూడా ఇవ్వవచ్చును, రెండింటి ఫలితాలు ఒక్కటే.

 గ్రహణవేధ :

గ్రహణవేధ అనేది గ్రహణసమయానికి ముందు 4 యామముల వ్యవధానంతో ఉంటుంది. 

అయితే ఈ సూర్యగ్రహణం గ్రస్తాస్తము కావున శక్తి ఉన్నవారు ఆ రోజంతా ఉపవాసముండి మరునాడు సూర్యోదయం తరువాత శుద్ధసూర్యబింబాన్ని చూసి విడుపుస్నానం చేసి ఏదైనా భుజించాలి. 

పుత్రవంతులు కూడా ఈ ఉపవాసము ఉండి తీరాలి, అయితే పిల్లలు, గర్భిణిస్త్రీలు, వృద్ధులు, రోగులు మధ్యాహ్నం 12:58 లోపున భోజనాదులు పూర్తి చేసుకోవాలి.

ప్రత్యాబ్దికం :

ధర్మశాస్త్ర గ్రంథాలలో గ్రస్తాస్తమయ సూర్యగ్రహణం లో దీనిని 2 విధాలుగా చెప్పారు. 

1. అదే రోజున సూర్యాస్తమయం తరువాత జరిపించాలి. అయితే, గ్రస్తాస్తమయ గ్రహణం కాబట్టి ఆమశ్రాద్ధం జరపాలి. స్మార్త పండిత సదస్సులలో అదే తీర్మానించారు. 

2. ఆరోజు భోజననిషేధమున్నది కనుక మరునాడు సూర్యుని శుద్ధబింబాన్ని చూసిన తరువాత స్నానంచేసి అన్నశ్రాద్ధం జరుపాలి.

మీకు అనుకూలమైనదానిని వికల్పంగా ఎంచుకొనండి.

గ్రహణం అంటే ఏమిటి ? గ్రహణ సమయం అంటే ఏమిటి ?

గ్రహణం అనేదానికి వేదాలకు ముఖ్యమైన ఆరు అంగాల్లో ఒకటైన జ్యోతిషం ప్రకారం సూర్య గ్రహాన్ని, చంద్రగ్రహాన్ని ఛాయాగ్రహాలైన రాహుకేతువులు పీడించడంగా చెప్పవచ్చు...

గ్రహణానికి ముఖ్యమైనవి సమయాలు :

స్పర్శకాలం, 

మధ్య కాలం, 

మోక్షకాలం అంటారు.

వీటిని అన్నింటినీ కలిపి ఆద్యంత పుణ్యకాలం అంటారు.

గ్రహణం సమయం - ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి?

గ్రహణ కాలం చాలా ఉత్తమమైన సమయం. 

చాలా అరుదైన సమయం, చాలా యోగదాయకమైన సమయం. 

ఈ సమయంలో చేసే సాధనలు కోటిరెట్లు ఉత్తమ ఫలాలను ఇస్తాయి. 

జపాలు కోటి రెట్లు అవుతాయి, దానాలు లక్షల రెట్లు అవుతాయి

ఆచమనం చేయవచ్చా ?

గ్రహణ కాలంలో నీరు కూడా త్రాగకూడదు. 

అయితే ఇది అందరికీ చెప్పలేదు, కేవలం కఠినమైన సాధనలు చేసే వారికి మాత్రమే చెప్పారు.

గ్రహణ స్పర్శకాలానికి ముందే సంధ్యావందనాదులు ప్రారంభించి గాయత్రీ ధ్యానాదులు, అంగన్యాస, కరన్యాసాదులు చేసేసుకొని జపం మొదలు పెట్టాలి. 

గ్రహణ స్పర్శకాలంలోకి జపం చేస్తూ ప్రవేశించాలి, గ్రహణ మోక్షకాలం వరకూ జపం చేస్తూనే ఉండాలి. 

గ్రహణ మోక్ష స్నానం చేసిన తరువాత కాఫీ, టీలు సేవించాలి...

గాయత్రీ జపం చేయవచ్చా ?

తప్పక చేయవచ్చు. చేయాలి కూడా.

గ్రహణవిముక్తి, మోక్షకాలం వరకూ చేస్తూనే ఉండాలి, కేవలం గాయత్రినే కాదు. 

ఎన్ని ఉపదేశాలు పొందితే ఆ మంత్రాలు అన్నీ జిపించాలి.

 తర్పణాలు విడువవచ్చా ?

కేవలం తర్పణాలు మాత్రమే కాదు, పిండప్రదానాలు వంటివి కూడా చేయాలి. 

కనీసం గోసేవ చేసుకొని పెద్దలను పేరుపేరునా తలచుకున్నా చాలు.

గ్రహణాలు షణ్ణవతుల్లో భాగం, అంటే పితృదేవతార్చనలు చేయవలసిన తప్పనిసరి రోజుల జాబితా లోనిది. 

ఈ రోజున పెద్దల పేరిట దానాలు చేసినా తర్పణాలు విడిచినా పెద్దలు అపారంగా సంతృప్తి చెందుతారు.

ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా సంతృప్తి చెందుతారు, నిజానికి పితృశాపాలు, దోషాల నుంచీ విడుదల పొందడానికి ఉత్తమమైన సమయం.

జన్మదోషాలు జాతక దోషాలు కూడా ఈ సమయంలో పితృదేవతార్చనల వలన పోతాయి. 

దానాలు, తర్పణాదులు చేయలేని వారు కనీసం గోసేవ చేసుకున్నా సమస్త దేవతలూ సంతోషిస్తారు. 

స్త్రీలు స్తోత్రాలు చదువుకోవచ్చా ? 

స్త్రీలు స్తోత్రాదులు  చదువుకోవాలి.

మంత్రోపదేశం పొందిన వారు జపాలు చేసుకోవాలి, అయితే స్త్రీలు శివ సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా సప్తశతి వంటివి, గీత వంటివి చదువుకోవచ్చు. 

లేదా నామస్మరణను చేసుకోవచ్చు, అంటే బీజాక్షరాలు మంత్రాక్షరాలు లేకుండా కేవలం నామసాధన చేయవచ్చు.

లేదా పురాణ గ్రంథాలు చదువుకోవచ్చు.

గర్భిణీలు, రజస్వలలు ఏమీ చేయకుండా క్రీయాశూన్యంగా పడుకోవాలి.

గ్రహణం సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలా? అక్కర్లేదా?

గ్రహణ సమయానికి ముందు, తరువాత జ్యోతి ప్రజ్వలనాలు చేయవచ్చు. 

కార్తీక మాసం వస్తోంది కనుక స్పర్శా కాలానికి పూర్వమే దీపప్రజ్వలన చేయాలి. 

మోక్షం తరువాత మరలా జ్యోతి ప్రజ్వలనం చేయవచ్చు.

రాత్రి లేదా పగలు భోజనం కాక పళ్లు ఫలహారం పనికొస్తుందా?

నేడు సూర్యగ్రహణం గ్రస్తాస్తమయం అవుతుంది, అంటే గ్రహణం ఉండగానే సూర్యాస్తమయం అవుతుంది కనుక మరునాడు సూర్యుడిని చూసేంత వరకూ అశౌచం ఉంటుంది. 

అంటే మరునాడు సూర్యోదయం తరువాతనే మడినీళ్ళు పట్టుకొని వండుకొని తినాలి. అప్పటి వరకూ ఏమీ తిన కూడదూ త్రాగరాదు. అయితే ఈ నియమాలు అందరికీ వర్తించవు.

ముఖ్యంగా పిల్లలకు బాలబాలికలకూ, గర్భవతులకు, దీర్ఘకాలప్రాణాంతక వ్యాథులు ఉన్నవారికి, బిపిలు షుగర్లు వంటి ఉన్నవారికి, వృద్ధులకూ, బాలింతలకు మినహాయింపులు ఉన్నాయి.

వీరు పాటించాల్సిన అవసరం లేదు, అయితే గర్భవతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, పాలుతాగే పిల్లలలకు మినహాయింపు ఉంది, తల్లిపాలకు దోషం లేదు.

ఇక ఆకలికి ఆగలేని వారు దుంపలు, సగ్గుబియ్యంతో చేసినవి, అటుకులతో చేసిన పదార్థాలు పళ్ళు పాలు వంటివి తీసుకొని తీరాలి.

 గృహస్థులకు శుష్కోపవాసాలు చెప్పలేదు, కనుక ఫలహారాలు సేవించవచ్చు.

దానాలు గ్రహణం సమయంలోనా లేక విడిచిన తరువాతా ?

ఈ ప్రశ్నకు సమాధానం శాస్త్రంలో ఉన్నదాని కన్నా ఆచరణలో ఉన్నదానికే ప్రాధాన్యత ఇవ్వాలి!!

గ్రహణ సమయంలో ప్రతీ బ్రాహ్మణుడూ గాయత్రినో లేదో ఏదో ఒక సావిత్రినో ఆశ్రయించి జపం చేసుకుంటూ ఉంటారు, అటువంటి వారికే దానం చేయడం ఉత్తమం, కనుక వారు దొరకరు.

ఇష్టదైవం ప్రీత్యర్థం అనా లేక సూర్య ప్రీత్యర్థం అనా జపసంకల్పం చేయాలి?

కేతగ్రస్త సూర్యగ్రహణదినే గ్రస్తాస్తమయ గ్రహణ కాలే అని సంకల్పాలు చెప్పుకొనాలి,

కొంత మంది సూర్యోపారగ అని కూడా చెబుతారు. హిరణ్యశ్రాద్ధాదులు నిర్వహిస్తారు.

 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



Post a Comment

0 Comments