GET MORE DETAILS

అన్నవరం ప్రసాదం అద్భుతః

 అన్నవరం ప్రసాదం అద్భుతః



దేవాలయాల్లో ఒక్కో క్షేత్రానికీ ఒక్కో విశేషం ఉన్నట్టే భక్తులకు పంచే ప్రసాదాల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా ఆలయాల్లో లడ్డూనో, పులిహోరో, చక్కెరపొంగలో ప్రసాదంగా పెడుతుంటారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో ఇచ్చే ప్రసాదం మాత్రం వీటికి భిన్నంగా ఉంటుంది. తయారీ నుంచి వితరణ వరకూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆ ప్రసాదం విశేషాలివి..!

అన్నవరం ఆలయంలో గోధుమ నూకతో చేసే స్వామి వారి ప్రసాదం ఏటా రెండు కోట్ల ప్యాకెట్లు అమ్ముడవుతుంటుంది. కొండ మీద స్వామివారి సన్నిధిలో వ్రతం చేసుకున్నా, లేక సత్యదేవుడి దర్శనానికే ప్రత్యేకంగా వెళ్లినా- ఆ పని అయ్యాక నెయ్యి, యాలకుల వాసనలతో ఘుమఘుమలాడే తీయని ఆ ప్రసాదం తింటే కలిగే అనుభూతే వేరు. చక్కగా విస్తరాకులో పెట్టి ఇవ్వడం వల్లనేమో ఈ ప్రసాదం రుచి మరింత మధురంగా ఉంటుంది.అన్నవరం దేవస్థానంలో భక్తులకు పంచే ప్రసాదాన్ని తయారుచేసేందుకు ఇటీవలే ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించారు. మూడంతస్తుల్లో విశాలమైన ఈ భవనాన్ని దాదాపు ఐదు కోట్లరూపాయల ఖర్చుతో మట్టే సత్యప్రసాద్‌ అనే దాత నిర్మించి ఇవ్వడం విశేషం. భవనంలో ఒక అంతస్తుని ముడిసరకు నిల్వ ఉంచడానికీ, నూక, పంచదారలాంటివి మిల్లుపట్టేందుకూ కేటాయించారు. మరో అంతస్తులో ప్రసాదాన్ని తయారుచేసేందుకు పూర్తిగా ఆటోమేటెడ్‌ మెషీన్లతో వంటశాలను సిద్ధం చేశారు. ఏడుగురు ప్రధాన వంటస్వాముల ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది ఈ పనులను పర్యవేక్షిస్తారు. వరసగా ఏర్పాటుచేసిన 20 పొయ్యిల మీద పెద్ద పెద్ద మూకుళ్లు ఉంటాయి. ప్రసాదం తయారీకి కావలసిన పదార్థాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీట నొక్కగానే పైపుల ద్వారా నేరుగా వచ్చి ఆ మూకుళ్లలో పడతాయి. మొదట ఒక్కో బాణలిలోకీ 35 లీటర్ల మినరల్‌ వాటర్‌ వస్తుంది. అవి మరుగుతుండగా 15 కేజీల చొప్పున గోధుమ నూకని వేస్తారు. నూక బాగా ఉడికాక 30 కిలోల పంచదార రెండు దఫాలుగా పడుతుంది. వాటిని బాగా కలుపుతుండగానే ఆరుకిలోల నెయ్యీ 150 గ్రాముల యాలకుల పొడీ పడతాయి. అన్నీ బాగా కలిశాక సిద్ధమైన ప్రసాదాన్ని ట్రేలలో వేసి ప్యాకింగ్‌ విభాగానికి తరలిస్తారు. ఒక్కో బాణలిలో 80కిలోల ప్రసాదం తయారవుతుంది.

గిరిజనుల నుంచి సేకరించిన శుభ్రమైన విస్తరాకుల్లో ఒక్కో దాంట్లో 150గ్రాముల ప్రసాదం ఉండేలా చూసి ప్యాక్‌ చేస్తారు సిబ్బంది. ఆ ప్యాకెట్లను బుట్టల్లో నింపి, కావడిలో తీసుకెళ్లి, అమ్మే కౌంటర్లకు చేరుస్తారు. మొదటినుంచీ ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇలా విస్తరాకులో ప్యాక్‌ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆకుల కొరతను ఎదుర్కొనడానికి ప్యాకింగ్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నాలు చేసినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఆలయ అవసరాలకోసం నెలకు 15-20 లక్షల ఆకులను విశాఖ ఏజెన్సీ ప్రాంతంనుంచి సేకరిస్తున్నారు. తరతరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ దేవస్థానం ప్రసాదానికి ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల విభాగంలో ఐఎస్‌ఓ గుర్తింపు కూడా లభించడం విశేషం. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా బంగీ ప్రసాదాన్ని(గట్టి ప్రసాదం) తయారుచేస్తున్నారు. సందర్శకుల రద్దీతో సంబంధం లేకుండా కచ్చితమైన ప్రమాణాలను పాటించడం వల్ల అన్నవరం ప్రసాదం నాటికీ నేటికీ అమృతప్రాయంగానే ఉంటోందంటారు భక్తులు.

Post a Comment

0 Comments