GET MORE DETAILS

అయ్యప్ప మాల ధరించకూడని సందర్భములు

 అయ్యప్ప మాల ధరించకూడని సందర్భములు



1. తల్లిదండ్రులు గతించినచో ఏడాదికాలము వరకు మాల ధరించరాదు.

2. సవతి తల్లిదండ్రులు గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

3. భార్య గతించినచో 6 నెలల వరకు మాల ధరించరాదు.

4. సవతి భార్య (రెండవ భార్య) గతించినచో 3 నెలల వరకు మాల ధరించరాదు.

5. పెదతండ్రులు , పినతండ్రులు , పెద్దతల్లులు , పినతల్లులు , గతించినచో 3 పక్షములు (45  రోజులు) మాల ధరించరాదు.

6. సోదరులు , పుత్రులు , మేనత్తలు , మేనమామలు , తాత (తండ్రి తండ్రి), బామ్మ (తండ్రి తల్లి) గతించినచో  41 దినములు  మాల ధరించరాదు. 

7. కన్నకూతురు , కోడళ్ళు , అల్లుళ్ళు , మరదళ్ళు , వదినెలు , మరుదులు , బావలు , బావమరుదులు  గతించినచో 30 దినములు (1 నెలపాటు) మాల ధరించరాదు.

8. మనవాళ్ళు , మనవరాళ్ళు , దాయాదులు గతించినచో 21 దినములు  మాల ధరించరాదు.

9. ఇంటిపేరు గలవారు , రక్తసంబంధీకులు గతించినచో  21 దినములు  మాల ధరించరాదు.

10. వియ్యాలవారు , దూరపుబంధువులు గతించినచో 13 దినములు మాల ధరించరాదు.

11. ఆత్మీయులు , మిత్రులు  గతించినచో 13 దినములు (దుఃఖము అనుష్ఠించి) మాల ధరించరాదు.

12. ఒకరు దత్తపుత్రులై వెళ్ళిన పిమ్మట దత్తత తీసుకున్న తల్లిదండ్రులు గతించినను అతనికి ఏడాదికాలము సూతకముండును కావున మాల ధరించరాదు. దత్తతకు వెళ్ళిన తరువాత వాని కన్న తల్లిదండ్రులు గతించినచో 6 నెలలు సూతకముండును , కావున మాల ధరించరాదు.

13. పైన తెలిపిన వారిలో ఎవరు గతించినను వారికి విధిగా కర్మకాండలు నిర్వహించే వారసులు లేక ఇంకెవరైనా కర్మలు చేసినచో అట్టివారికి కుడా ఏదాడి సూతకముండును. కావున అట్టివారు ఏడాది కాలము మాల ధరించరాదు.

14. తల్లి , భార్య , కూతురు , కోడలు , మరదళ్ళు , సోదరి , మున్నగువారు 7 నెలల గర్భిని అయినచో మాల ధరించి దీక్ష తీసుకొనరాదు , ఏలనగా దీక్షలో ఉండగా     వారు (7వ నెల , 8వ నెల , 9వ నెలలో ఎప్పుడైనా) ప్రసవించినచో శుభ సూతకము వస్తుంది , కావున మాలను విసర్జన చేయవలసి వచ్చును. అందువలన మాల ధరించరాదు.

15. మాల ధరించి దీక్షలో ఉండగా కన్నకూతురు రజస్వల అయితే ఆ వార్త వినగానే తాను ఎన్ని దినములు దీక్ష ముగించినను , వెంటనే దీక్ష విరమించి , గురుస్వామి ద్వారా మాల విసరర్జించి , మాలను కడిగి , దేవుడి వద్ద వుంచి , పై సంబరాలలో పాల్గొని , కూతురుకి న్యాయము చేకూరునట్లు తన కర్తవ్యాన్ని ఆచరించాలి. అదియే అయ్యప్పకు ఆనందదాయకము , భక్తులకు శ్రేయదాయకం.

16. దీక్షలో ఉండగా బందువర్గాదులలో ఎవరైన గతించినను ఆ వార్త తెలియగానే  మాల విసర్జన చేసి వారి దుఃఖములో పాలు పంచుకోవలయును , అలా కాక మాలో మాకు మాటలు , పలకరింపులు , రాకపోకలు అసలే లేవు మాకు ఆ మరణముతో ఎలాంటి పట్టింపులు లేవు నేను మాలలో ఉన్నాను రాకూడదు అని సాకులు చెప్పి మాల విసర్జింపక సూతకముతో పావన శబరిగిరి ఎక్కుట అపచారము అని మన పెద్దలు ఆదేశించి యున్నారు , కావున శుభాశుభ  సూతకములు కలవారు పైన చెప్పిన సూచనల ప్రకారము తమ గురుస్వాములను సంప్రదించి , మాల విసర్జించి , శబరియాత్ర చేసి సద్గురునాధుడైన శబరిగిరీశుని అనుగ్రహము పొందుటకు ప్రయత్నించవలయును.

17. కుటుంబములో శుభసూతకము లేదా అశుభసూతకము కలిగి మద్యలో దీక్ష విరమించవలసి వచ్చినవారు , తదుపరి వెంటనే మాల వేసుకొనక పావన పద్దెనిమిది మెట్లు ఎక్కే రోజు నాటికి మండలకాలము అనగా 41 దినములు దీక్ష వహించే అవకాశము ఉంటేనే మరల మాల ధరించవలయును , అలా వీలుకాని పక్షములో వారు ఆ సంవత్సరం ఇరుముడి లేకుండా శబరిమలై సన్నిధానములోనే ఉత్తరవైపు మెట్లెక్కి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారిని దర్శించి వచ్చుటకు దోషము లేదు.

18. ఎవరైనా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాలవేసుకొని దీక్షలో ఉండగా పొరపాటున గర్భము పోవడము కాని , గర్భస్రావము గాని , లేదా జన్మించిన తరువాత శిశువు పోవడము కాని జరిగినట్లయితే 10 రోజులు సూతకముండును. కావున మాలను విసర్జించవలయును. అలాగే మరల మండల కాలము సమయమున్నచో దీక్షబూని శబరియాత్ర చేయవచ్చును.

19. స్త్రీలు మాత్రము 10 సంవత్సరాల వయస్సు దాటినా వారు మాల ధరించరాదు , ఏలనగా వారు ఏ సమయాన్నైనా ప్రథమ రజస్వల అయ్యే అవకాశముంది దాని వలన శుభసూతకం ఏర్పడుతుంది. అందువలన పావన శబరిగిరిని అపవిత్రం చేయరాదు. అలానే 50 సంవత్సరాలు వయస్సు దాటని వారు మాల ధరించి దీక్ష (41 రోజులు) పూర్తి కాదు. అందువలన వారికి శబరియాత్ర చేసే అర్హత లేదు.

20. దీక్షా సమయములో మన సన్నిదానము దరిలో ఎవరైనా గతించినచో విన్న వెంటనే ఎవరైనా అందరూ స్నానమాచరించి శరణుఘోష చెప్పుతూ అఖండ దీపము ఆ రోజు వెలిగించి సన్నిదానము మూసివేయవలెను. సన్నిదానము స్వాములంతా కలిసి వేరే సన్నిదానములో ఉండవలెను. ఆ కళేబరము తీసిన తరువాత సన్నిదానమంతా శుభ్రపరచి ఆవు పంచకముతో శుద్ధి చేసి మరల పూజలు విధి విధానంగా జరుకోవలెను.

21. మండల దీక్షలో ఉండగా గ్రహణములు (సూర్యగ్రహణము , చంద్రగ్రహణము) ఏర్పడినపుడు విధివిధానంగా పట్టు స్నానము విడుపుస్నానము చేయాలి. అలాగే       మన సన్నిదానములో కలశం వద్ద , గ్రహణము విడిచిన తరువాత కుశదర్భరేకులు వేసి ఉంచవలెను. గ్రహణము విడిచిన తరువాత స్నానమాచరించి  సన్నిదానము శుభ్రపరచి స్నానమాచరించి విధిగా దేవుని పూజలు జరిపించాలి. అలాగే గ్రహణ సమయమున తిను బండారము భిక్షలు చేయరాదు.

22. శ్రీ అయ్యప్ప స్వామి అర్చకులు వారి తల్లిదండ్రులు గతించినచో ఒక ఏడాది పాటు అయ్యప్ప స్వామి దేవస్థానము గర్భగుడిలోనికి రాకూడదు మరియు మాలధారణ చేయడం ఇరుముడి కట్టడం జరగకూడదు

ఇంకా ఏవైనా తెలియని విషయాలు ఉంటే మీ గురుస్వామి ద్వారా తెలుసుకొని గురుస్వామి చెప్పినట్లు నడుచుకుని సద్గురునాధుని కటాక్షాన్ని పొంది ఆయురారోగ్య                ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.

ఓం శ్రీ అనాధ రక్షకనే శరణం అయ్యప్ప

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప



Post a Comment

0 Comments