కొత్త బ్లడ్ గ్రూప్ ‘ఈఆర్' కనుగొన్న యూకే శాస్త్రవేత్తలు - ఈ గ్రూప్ ఉంటే గర్భంలోనే శిశువు మృతి చెందే ప్రమాదం.
యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన కొత్త రక్తవర్గాన్ని కనుగొన్నారు. దీనికి ‘ఈఆర్’గా నామకరణం చేశారు. ఈ కొత్త బ్లడ్‌గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తంలోని ప్రొటీన్స్ ఆధారంగా బ్లడ్ గ్రూప్‌లను నిర్ధారిస్తారు. ఎర్రరక్త కణాల ఉపరితలంలో ఈ ప్రొటీన్స్ కనిపిస్తాయి. ఏ,బీ,ఏబీ, ఓ.. ఇప్పటివరకూ ఉన్న సాధారణ బ్లడ్ గ్రూప్‌లు. తాజాగా వీటికి ‘ఈఆర్’ జతచేరనుంది.
30 ఏండ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు :
‘ఈఆర్’ను కనుగొనడం ద్వారా పరిశోధకులు 30 ఏండ్ల మిస్టరీ ఛేదించారు. బ్లడ్ గ్రూప్‌లకు సంబంధించి రెండు కేసులు శాస్త్రవేత్తల వద్దకు వచ్చాయి. రక్తంలో సమస్య వల్ల ఇద్దరు మహిళల గర్భంలో శిశువులు మృతిచెందారు. దీనిపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు వారి బ్లడ్‌గ్రూప్ ‘ఈఆర్’గా తేల్చారు. ఈఆర్ గురించి ప్రస్తావించిన 30 ఏండ్ల కిందటి అధ్యయనాన్ని పరిశీలించారు. శరీరంలో ఒకే బ్లడ్‌గ్రూప్ లేకుంటే తీవ్ర సమస్యలు లేదా మరణం సంభవిస్తుందని కనుగొన్నారు. తల్లి, శిశువు రక్త వర్గాలు వేరుగా ఉన్నప్పుడు తల్లి రోగనిరోధకశక్తి తీవ్రమైన రియాక్షన్స్‌కు కారణమవుతుందని గుర్తించారు. ‘తల్లి బ్లడ్ గ్రూప్ ‘ఈఆర్’ అయితే.. ఆమె రోగనిరోధక వ్యవస్థ శిశువు రక్తానికి వ్యతిరేకంగా యాంటిబాడీలను తయారుచేస్తుంది. ఈ యాంటిబాడీలు మావి ద్వారా శిశువుకు చేరుకుంటాయి. వారిలో హిమోలిటిక్ వ్యాధిని కలిగిస్తాయి. గుండె వైఫల్యంతో శిశువు గర్భంలోనే మరణిస్తాడు’ అని తేల్చారు. ఈ పరిశోధన ‘ఈఆర్’ బ్లడ్ గ్రూప్‌ను కనుగొనేందుకు, అది కలిగించే సమస్యలను నివారించేందుకు మార్గాలను సుగమం చేసిందని పరిశోధకులు తెలిపారు. ‘ఈఆర్’ బ్లడ్ గ్రూప్‌ను గుర్తించే సులభమైన పద్ధతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
0 Comments