GET MORE DETAILS

కార్తీక పురాణం - 15 వ అధ్యాయము

కార్తీక పురాణం - 15 వ అధ్యాయము● దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట

అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా ! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని , మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట , చేయుట , శివకేశవులవద్ద దీపారాధనను చేయుట , పురాణమును చదువుట , లేక , వినుట , సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల , విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి , చతుర్దశి , పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.

ఈ మహా కార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను , లేక , ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు , వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి , నీళ్లతో కడిగి , బొట్లుపెట్టి , ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి , దూదితో వత్తులుజేసి , పండ్రెండు దీపములుంచి , స్వామిని పూజించుచు , నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి , నలుమూలలు వెదకి , తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను , శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.


ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా , ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి "ఓయీ ! నీవెవ్వడవు ? ఎందుకిట్లు నిలబడియుంటివి ?" అని ప్రశ్నించగా , "ఆర్యా ! నేను మూషికమును , రాత్రి నేను ఆహారమును వెతుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నున్న ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ , నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని , ఓ మహానుభావా ! నేను ఎందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు" మని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని , "ఓయీ ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ , ధనాశపరుడై దేవపూజలు , నిత్యకర్మలు మరచి , నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు , మంచివారలను , యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు , సమస్త తినుబండారములను కడుచౌకగా కొని , తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి , అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన , నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి , ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు" మని అతనికి నీతులు చెప్పి పంపించెను.


ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.


Post a Comment

0 Comments