GET MORE DETAILS

Property Documents: ఆస్తి దస్తావేజులు పోగొట్టుకున్నారా...? ఇలా చేయండి.

Property Documents: ఆస్తి దస్తావేజులు పోగొట్టుకున్నారా...? ఇలా చేయండి.




ఇల్లు, స్థలం, వ్యవసాయ భూమి.. ఇలా ఏ స్థిరాస్తి కొనుగోలు చేసినా ఆస్తి యాజమాన్య హక్కులను కొనుగోలుదారునికి బదిలీ చేయడంలో టైటిల్‌ డీడ్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అంటే, ప్రభుత్వ రికార్డులో ఆస్తి కొనుగోలుదారుని పేరిట అధికారికంగా బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆస్తి కొనుగోలుదారుని పేరుతో నమోదైనట్లు పత్రాలు చేతికి వస్తాయి. 

టైటిల్‌ డీడ్‌ అంటే...?

టైటిల్‌ డీడ్‌ అంటే.. యాజమాన్య పత్రం. ఏదైనా ఆస్తికి సంబంధించి చట్టపరమైన హక్కును తెలియజేస్తుంది. ఆస్తిని అమ్మాలన్నా, తాకట్టు పెట్టి రుణం పొందాలన్నా, ఆ ఆస్తి తమ పేరుపై ఉన్నదని రుజువు చేయాలన్నా.. ఈ డాక్యుమెంట్ అవసరం. అమ్మకం లేదా రుణం పొందే వేళల్లో ఆస్తికి సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది.

ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ పోతే...

ఆస్తికి సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు లేకపోతే ఆస్తికి సంబంధించిన లావాదేవీల (అమ్మకం, రుణం వంటివి) విషయంలో అడ్డంకులు ఎదురవుతాయి. అలాగే స్థలం, వ్యవసాయ భూమి విషయంలో కొన్ని సార్లు వివాదాలు ఏర్పడతాయి. పక్కన స్థలంవారు మీ భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ వద్ద ఆస్తి పత్రాలు లేకపోతే ఆ భూమి మీద మీకు హక్కును నిరూపించుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి, ఆస్తికి సంబంధించిన పత్రాలు జాగ్రత్తగా భద్రపరచాలి. ఒకవేళ మీ ఆస్తికి సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లు పోతే డూప్లికేట్‌ కాపీ పొందవచ్చు. రిజిస్టర్డ్‌ ఆస్తులకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వారు తమ రికార్డుల్లో భద్రపరుస్తారు. అక్కడి నుంచి డూప్లికేట్‌ కాపీ పొందవచ్చు. అయితే దీనికి కొంత ప్రొసీజర్‌ అనుసరించాల్సి ఉంటుంది. 

ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయాలి...

ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయినా లేదా దొంగిలించారని తెలిసిన వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్షర్మేషన్‌ రిపోర్ట్‌) లేదా ఎన్‌సీఆర్‌ (నాన్‌ కాగ్నిజిబుల్‌ రిపోర్ట్‌)ను ఫైల్‌ చేయాలి. దానికి సంబంధించిన ఒక కాపీని మీ వద్ద భద్రపరుచుకోవాలి. ఇది భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది.  మీరు పోలీస్‌ స్టేషన్‌కు నేరుగా లేదా ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిన తర్వాత మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసు శాఖ అధికారులు పరిశోధన చేసి పత్రాలను కనుగొనేందకు ప్రయత్నిస్తారు. ఒకవేళ పత్రాలను పోలీసులు ట్రేస్‌ చేయడంలో విఫలం అయితే నాన్‌-ట్రేసబుల్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌టీసీ)ను జారీచేస్తారు. ఫిర్యాదులకు సంబంధించి పోలీసు అధికారులు ట్రేస్‌ చేయని వాటికి సంబంధించిన నాన్‌-ట్రేసబుల్‌ రికార్డును ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ నిర్వహిస్తారు. ఎన్‌టీసీ వాస్తవంగా నష్టం జరిగిందని తెలియజేస్తుంది. డూప్లికేట్‌ ఆస్తి పత్రాలను పొందేందుకు కావాల్సిన కీలక పత్రం ఇది. అలాగే, దుర్వినియోగం లేదా మోసాలను నివారించడంలోనూ  సహాయపడుతుంది. ఎఫ్‌ఐఆర్‌ను ఆస్తి ఉన్న ప్రదేశంలోని సమీప పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేయనవసరం లేదు. ఆస్తి దేశంలో ఎక్కడ ఉన్నా వ్యక్తులు తాము నివసించే ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేయవచ్చు.

వార్తా పత్రిక ద్వారా నోటీసు...

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత.. దీనికి సంబంధించిన నోటీసును కనీసం రెండు వార్తా పత్రికల్లో వచ్చేట్లు చూసుకోవాలి. ఒకటి ఆంగ్లంలో, మరొకటి స్థానిక భాషలో ఉండాలి. ఆస్తికి సంబంధించిన మొత్తం వివరాలు, పోగొట్టుకున్న పత్రాలు, మీ సంప్రదింపు వివరాలతో ప్రకటన ఇవ్వాలి. ఒకవేళ పోయిన పత్రాలు వేరొకరికి దొరికి ఉంటే.. వారు ఆస్తి యజమానికి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. 

ఈ నోటీసు ద్వారా యజమాని ఆస్తికి ఉన్న యాజమాన్య హక్కును క్లెయిం చేస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఆస్తికి సంబంధించి ప్రజల్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రచురణ తేదీ నుంచి 15 రోజుల లోపు క్లెయిం చేసేందుకు ఆహ్వానిస్తూ ఈ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇచ్చేందుకు న్యాయవాది లేఖ, ఈ నోటీసు ఇచ్చేందుకు గల కారణాలను వివరిస్తూ నోటరీ చేసిన అఫిడవిట్‌లతో పబ్లిషర్‌ను సంప్రదించవచ్చు.

ఈ నోటీసు ఇచ్చేందుకు పత్రికను అనుసరించి ప్రచురణకు రూ.3500 వరకు, న్యాయవాదికి చెల్లించాల్సి చట్టపరమైన రుసుముల కోసం దాదాపు రూ.5000 వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు.

షేర్‌ సర్టిఫికెట్‌...

హౌసింగ్ సొసైటీలో ఆస్తి ఉంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) నుంచి డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఆర్‌డబ్ల్యూఏ నుంచి డూప్లికేట్ షేర్ సర్టిఫికెట్‌ పొందేందుకు ఎఫ్‌ఐఆర్ కాపీని, వార్తాపత్రికలో ముద్రించిన నోటీసు క్లిప్పింగ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చిన తర్వాత ఆర్‌డబ్ల్యూఏ సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి, సంఘటన నిజమని తేలితే డూప్లికేట్‌ షేర్ సర్టిఫికెట్‌ కాపీని జారీ చేస్తారు. అయితే దీని కోసం కొంత రుసుములను ఛార్జ్‌ చేస్తారు. అలాగే తదుపరి లావాదేవీల కోసం నాన్‌-అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఓసీ) అడగొచ్చు.

హౌసింగ్‌ సొసైటీలోని ప్రతి సభ్యుడికీ షేర్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇది ఆ వ్యక్తికి సొసైటీలో ఉన్న ఆస్తి షేర్‌ను తెలియజేస్తుంది.

నోటరీ చేయించాలి...

డూప్లికేట్‌ సర్టిఫికెట్‌ కాపీ కోసం దరఖాస్తు చేసుకునే ముందు.. రూ.10 నాన్‌ జుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ నోటరీ చేయించాలి. ఇందులో ఎఫ్ఐఆర్‌ నంబరుతో పాటు, ఆస్తికి సంబంధించిన (పోయిన) పత్రాల వివరాలు, వార్తాపత్రికలలో ప్రచురించిన నోటీసు, ప్రచురణ చెల్లుబాటుకు సంబంధించిన లాయర్ సర్టిఫికెట్‌, దరఖాస్తు చేయడానికి గల కారణాన్ని పేర్కొనాలి. 

డూప్లికేట్‌ పత్రాలు...

15-రోజుల నోటీసు వ్యవధి ముగిసిన తర్వాత, మీరు తప్పనిసరిగా సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి, ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు, పోగొట్టుకున్న పత్రాల వివరాలు, ఎఫ్ఐఆర్‌ కాపీ, నాన్‌ ట్రేసబుల్‌ సర్టిఫికెట్‌, నోటరీ అఫిడవిట్‌లను సమర్పించి డూప్లికేట్/సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి 7 నుంచి 10 పని దినాల్లో డూప్లికేట్‌ సేల్ డీడ్ లేదా టైటిల్‌ డీడ్‌ కాపీని పొందుతారు.

చివరిగా...

డూప్లికేట్‌ ఆస్తి పత్రాలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆమోదంతో స్టాంపింగ్‌తో పొందుతారు కాబట్టి ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఈ సర్టిఫైడ్‌ కాపీ ద్వారా ఆస్తి క్రయవిక్రయాలతో పాటు రుణ దరఖాస్తు వంటి లావాదేవీలను కూడా చేయవచ్చు.

Post a Comment

0 Comments