GET MORE DETAILS

మాఘ పౌర్ణమి , మహా మాఘి

 మాఘ పౌర్ణమి , మహా మాఘి మాసాలన్నింటిలోకీ మాఘ మాసం విశిష్టమైనంది. అందులో అనుమానం లేదు. రథసప్తమి (సూర్యుడు), భీష్మ ఏకాదశి (విష్ణుమూర్తి), శ్రీ పంచమి (సరస్వతీదేవి), మహా శివరాత్రి (శివుడు)... ఇలా సకల దేవతలనూ కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇది. ఇక మాఘపౌర్ణమి వచ్చిందంటే చాలు పుణ్యతీర్థాలన్నీ కళకళలాడిపోతాయి.

స్నానాలలోకెల్లా మాఘస్నానం ఉత్తమం అని పెద్దలు చెబుతూ ఉంటారు. నదులు, సముద్రాలు, ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం. ఇక మాఘపౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాడము, కార్తీకము, మాఘము, వైశాఖము అంటూ నాలుగు నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. ఏడాదిలో కనీసం నాలుగుసార్లన్నా సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాల మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ఈ నిబంధన వెనుక ఉన్న కారణంగా తోస్తుంది. పైగా ఆ నాలుగు నెలలలోనూ సముద్రపు ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయనీ, ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధతత్వాన్ని కలిగి ఉంటాయనీ అంటారు.

మాఘ పౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు... ఇష్టదేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను తలచుకొనేందుకు కూడా అనువైన సందర్భం. ఈ రోజున సూర్యుడినీ, మహాలక్ష్మినీ పూజించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. సూర్యజయంతి కారణంగా మాఘమాసం యావత్తూ సూర్యునికి ప్రీతికరమైనది. అందుకే మాఘపౌర్ణమి నాడు సముద్రస్నానంతో పాటుగా... ఆ ప్రత్యక్ష నారాయణునికి ప్రీతికలిగేలా సూర్యాష్టకమ్, ఆదిత్యహృదయం వంటి స్తోత్రాలను పఠించడం మంచిది. ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ పద్మాలతో అర్చించమని సూచిస్తుంటారు. 

అటు మహాలక్ష్మికే కాదు, ఇటు పార్వతీదేవికి కూడా మాఘపౌర్ణమి ప్రత్యేకమైనదే! భూమి మీద ఒక శంఖు రూపంలో పడిన పార్వతీదేవి, దక్షప్రజాపతి చేయి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్నపేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. ఇంతకీ శంఖువు, సతీదేవిగా మారిన రోజు మాఘపౌర్ణమే! ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. కేవలం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమే! బుద్ధుడు తాను త్వరలోనే నిర్వాణం చెందబోతున్నట్లుగా ఈ రోజునే ప్రకటించారట. అందుకని ఈనాడు బౌద్ధులు మతగ్రంథాలైన త్రిపిటకాలను వల్లెవేస్తుంటారు.

చెప్పుకుంటూ పోతే మాఘ పౌర్ణమి ప్రత్యేకతలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. మఘ నక్షత్రానికి అధిపతి బృహస్పతి. కాబట్టి ఈ రోజున బృహస్పతిని కనుక పూజిస్తే ఆయన కరుణ లభిస్తుందని చెబుతారు. జ్యోతిషపరంగా బృహస్పతికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. జ్ఞానం దగ్గర నుంచీ ధనం వరకూ బృహస్పతి అనేక సంపదలకు, సౌఖ్యాలకు కారకుడు

ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే మాఘ పౌర్ణమిని మహామాఘి అని పిలుచుకుంటారు. 

ఉత్తరాఖండ్ మొదలుకొని తమిళనాడు వరకు ప్రతి సముద్ర తీరమూ ఓ కుంభమేళాను తలపిస్తుంది .

Post a Comment

0 Comments