GET MORE DETAILS

తెలుగింటి తొలి పండగ - ఉగాది

 తెలుగింటి తొలి పండగ - ఉగాది



చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు.. మిత్రులందరికీ మార్చి 22 ,2023 నుండి ప్రారంభ మౌతున్న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

కోయిలమ్మ ఊసులు చెప్పాలన్నా, ప్రకృతి పరవశంతో ముస్తాబు అవ్వాలన్నా, రసాలూరే మామిళ్లు నోరూరించాలన్నా, మల్లెలు పరిమళాల మత్తుచల్లాలన్నా... వసంతుడి తోడుకావాల్సిందే. అలాంటి వసంతుడికి స్వాగతం చెబుతూ తెలుగు లోగిళ్లు జరుపుకునే పండగే ఉగాది. 

 ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. 

ప్రకృతి పరంగా చూస్తే... మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణిస్తారు. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు - గుడి పడ్వా, 

మలయాళీలు - విషు, 

సిక్కులు - వైశాఖీ, 

బెంగాలీలు -పాయ్‌లా బైశాఖ్‌, 

తమిళులు - పుత్తాండు 

అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం.

ఈ పండగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. దీన్నే నింబకుసుమ భక్షణం, అశోక కళికాప్రాశనం అని కూడా అంటారు.

కొత్త చింత పండు, 

బెల్లం, ఉప్పు,

మామిడి పిందెలు, 

వేపపువ్వు, 

మిరియాలు లేదా కారం లేదా పచ్చిమిర్చి, 

చెరకు,

శనగపప్పు

వేరుశనగపప్పు

అరటిపండ్లు

మొదలైన పదార్థాలను ఉపయోగించి ఈ పచ్చడిని తయారుచేస్తారు. 

ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెప్పకనే చెబుతుందీ ఉగాది పచ్చడి.

ఉగాది రోజున  పండగను ఎలా జరుపుకోవాలన్నదానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. పెద్దవారితో నువ్వుల నూనెను తలమీద పెట్టించుకుని, నలుగుపిండితో అభ్యంగన స్నానం చేయాలి. తర్వాతకొత్త బట్టలు ధరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. పరగడుపునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేసే శక్తి ఈ పచ్చడికి ఉందని పురాణోక్తి.

సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు. 

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఈ అయిదు అంగాల కలయికనే పంచాంగం అంటారు. మనకు పదిహేను తిథులు, ఏడు వారాలు, ఇరవై ఏడు నక్షత్రాలు, ఇరవై ఏడు యోగాలు,పదకొండు కరణాలు ఉన్నాయి.  వీటన్నింటి గురించీ పంచాంగం వివరిస్తుంది. 

వీటితోపాటు నవగ్రహాల సంచారం, వివాహాది శుభకార్యాల ముహూర్తాలూ, ధరలూ, వర్షాలూ, వాణిజ్యం... ఇలా ప్రజలకు అవసరమైన వాటికి అధిపతులు ఎవరూ, అందువల్ల కలిగే లాభనష్టాలు ఏమిటీ వంటి విషయాలతోపాటు దేశ స్థితిగతులను కూడా పంచాంగంలో ప్రస్తావిస్తారు. 

పంచాంగ శ్రవణంలో నాతోపాటు నా ఊరూ నా దేశం బాగుండాలనుకునే గొప్ప సంప్రదాయం దాగుంది. అందుకే పంచాంగ శ్రవణం వల్ల విశేష పుణ్యం లభిస్తుందంటారు పెద్దలు.

రాష్ట్రాన్ని బట్టి ఉగాది పేరు మారొచ్చు... 

ప్రాంతాన్ని బట్టి పండగను జరుపుకునే తీరు మారొచ్చు... చేసేవిధానాన్ని బట్టి ఉగాది పచ్చడి రుచి మారొచ్చు... 

కానీ ఎక్కడైనా ప్రకృతిలోని మార్పులు ఎంత సహజమో జీవితంలో కష్టసుఖాలూ అంతే సహజమని ప్రకృతి సాక్షిగా చాటిచెప్పడమే ఉగాది పండగ ముఖ్యఉద్దేశం..

Post a Comment

0 Comments