GET MORE DETAILS

ఉగాది రోజున ఏమి చేయాలి

 ఉగాది రోజున ఏమి చేయాలి



ఉగాది వస్తోందంటే చాలు వేప పచ్చడీ , పంచాంగ శ్రవణమే గుర్తుకుస్తాయి. మరి ఉగాది అంటే ఇంతేనా !  ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కానీ , ఆచరించాల్సిన విధులు కానీ లేవా అంటే లేకేం.

చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెబుతారు. అందుకనే ఆ రోజుని యుగాది లేక ఉగాదిగా గుర్తిస్తారు. ప్రతి పండుగలానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయమని చెబుతారు. నువ్వులనూనెని ఒంటికి పట్టించి చేసే స్నానమే ఈ తైలాభ్యంగనం. ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సంవత్సరానికి తొలిరోజైన ఉగాదినాడు తైలాభ్యంగనం చేసి తీరాలన్నది పెద్దల శాసనం. సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా , ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది వారి అభిమతం.

అభ్యంగన స్నానం ముగిసిన తరువాత గడపకు పసుపు , కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇక ఉగాదిరోజున ఏ దైవాన్ని పూజించాలి అన్నది కూడా ఓ సందేహమే ! ఉగాది రోజున కాలమే దైవం. కాబట్టి మనకు ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని పూజించుకోవాలి. స్థితికారుడైన విష్ణుమూర్తిని స్మరించినా , లయకారుడైన శివుని కొలిచినా , ప్రకృతికి చల్లధనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించినా సమ్మతమే !

ఇష్టదేవతల స్తోత్రాలని పఠించి పూజించిన తరువాత వారికి ఉగాది పచ్చడిని నివేదించాలి. పులుపు , తీపి , వగరు , చేదు , ఉప్పు , కారం అనే ఆరురుచుల కలయికగా ఉగాది పచ్చడిని రూపొందిస్తాము. వైద్యపరంగా ఈ ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. ఆధ్మాత్మికంగా చూస్తే జీవితం సుఖదుఖాల మిశ్రమం అని చెప్పడమే ఉద్దేశంగా కనిపిస్తుంది. ఒక పక్క జీవితం శుభాశుభాల మిశ్రమం అని గ్రహిస్తూనే రాబోయే రోజులకి సిద్ధపడాలనే సూచనని అందించేదే పంచాంగం. అందుకనే సంవత్సరపు మొదటిరోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు పెద్దలు.

ఇక ఉగాది రోజున ‘ప్రపాదానం’ అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపడమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తున్నారు. ఎండలని తట్టుకుంటే నీరు ఇస్తే సరిపోదు కదా ! అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాదినాడు చెప్పులూ , గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మకుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతారు.

ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిదీ కాదు కాబట్టి , ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్లమని చెబుతారు. ఉగాది నూతన సంవత్సరానికి సూచన కాబట్టి కొత్త పనులను చేపట్టమని ప్రోత్సహిస్తారు. ఉగాది రోజున చేయవలసిన పనులు ఇన్ని ఉన్నాయన్నమాట.

Post a Comment

0 Comments