హరిత విప్లవ పిత నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ జయంతి నేడు
యం.రాం ప్రదీప్
తిరువూరు
9492712836
రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు, సహజ వనరులకి మధ్య సమతుల్యం లోపించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతున్నాయి.ఆఫ్రికా వంటి ఖండాలలో ఆకలి మరణాలు సంభవిస్తున్నాయి.మరోవైపు రోజురోజుకూ వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది.ఈ నేపథ్యంలో హరిత విప్లవం కొంత వరకు ఆహారపు కొరతను తీర్చింది.
హరిత విప్లవానికి నాంది పలికిన నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ అమెరికా లోని అయోవాలో ఒక వ్యవసాయ కుటుంబములో1914 మార్చి 25న జన్మించారు. తండ్రి హెన్రీ ఆలివర్ బోర్లాగ్. తల్లి క్లారా. నార్వే దేశమునుండి 1854లో అమెరికాకు వలస పోయిన కుటుంబములో మూడవ తరము వాడు బోర్లాగ్. 106 ఎకరముల పొలమునకు వారసుడు. పందొమ్మిదేళ్ళ వయసు వరకూ పొలం పని, చేపలు పట్టడం, వేటాడ్డం, కోళ్ళు పశువులతో కాలక్షేపం, ఆటపాటలతో గడిపాడు.
తాత ప్రోత్సాహము వల్ల మిన్నిసోటా విశ్వవిద్యాలయంలో చేరి అటవీశాస్త్రంలో పట్టాపొంది ఉద్యోగంలో చేరినాడు. తిరిగి అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్ పాథాలజీ, జన్యు శాస్త్రంలో పీహెచ్‌డీ చేశాడు.
పరిశోధనల్లో ఆయన దృష్టి గోధుమ పంట మీద పడడం ప్రపంచానికి గొప్ప మేలు చేసింది. చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే పొట్టిరకం గోధుమ వంగడాలను కనిపెట్టడం ద్వారా సంచలనం సృష్టించాడు. 1960 ప్రాంతంలో కరువుకాటకాల తో అల్లాడుతున్న ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో ఆ వంగడాలను పరిచయం చేశాడు. 1963లో ఆయన ఇండియా కూడా సందర్శించాడు. ఇరవయవ శతాబ్ది ద్వితీయార్థంలో ప్రపంచాన్ని తీవ్ర కరవునుంచి బయటపడేసి వంద కోట్ల మంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన ఆవిష్కరణలు తోడ్పడ్డాయి.ఆయన ఆవిష్కరణల వల్ల 1960, 1990 మధ్య కాలంవలో వ్యవసాయ దిగుబడులు రెండింతలకు మించి పెరిగాయి. అది హరిత విప్లవంగా మారింది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో సైతం కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 18.7 కోట్ల ఎకరాల్లో బోర్లాగ్ కనిపెట్టిన గోధుమ వంగడాలను వాడుతున్నారు. బోర్లాగ్‌పై 2006లో ది మ్యాన్ హూ ఫెడ్ ద వరల్డ్ అనే పుస్తకం వచ్చింది.
తొలుత హరిత విప్లవం మంచి ఫలితాలనే ఇచ్చింది. రసాయనిక ఎరువులు వాడకం పెరగడం వల్ల పంటలు దిగుబడి పెరిగింది.అదే సమయంలో నేల, నీటి కాలుష్యం పెరిగింది. ప్రస్తుతం సహజ ఎరువులకు ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో ఆకలి కేకలు లేని సమాజాన్ని చూడాలంటే వ్యవసాయానికి పెద్ద పీట వేయాలి. రైతులకు రుణమాఫీ చేయాలి.పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.నాణ్యమైన విత్తనాలు అందించాలి.
0 Comments