GET MORE DETAILS

ప్రారబ్ద కర్మ - వివరణ

ప్రారబ్ద కర్మ - వివరణ



మన ప్రమేయం లేకుండా మన అనుభవంలోకి వచ్చే సంఘటనలన్నీ  ప్రారబ్దకర్మలే. మనం వెళ్తున్న రైలుకి ప్రమాదం జరిగితే ప్రమేయముంటుందా మనదేమైనా? మనకి అందులో వాటిల్లే కష్టం ప్రారబ్ద కర్మే.

జన్మ, మరణం, వివాహం, వైధవ్యం, పునర్వివాహం, సంపాదన, సంతానం వంటివి అన్నీ ప్రారబ్ధ కర్మానుసారమే మనకి లభిస్తాయి. తమ ఉన్నత స్థితికి తమ సమర్థతయే కారణం అనుకుంటారు ఎవరికివారే. చేరుకఅలాగే తమ అసమర్ధత వల్లే ఫలానా నీచ స్థితికి చేరుకున్నామని అనుకుంటారు. అజ్ఞానంతో కూడిన భ్రమ అది.

గతజన్మల్లో చేసిన మంచి కర్మలఫలితాల వల్లనే ఈ జన్మలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపాదన, సుఖాలు లభిస్తాయి. దుష్కర్మల వల్ల అనారోగ్యం, ధనలేమి లాంటి కష్టాలు వస్తాయి. ఈ జన్మలోని వాటి అనుభవాల వల్ల ఆ కర్మలుఖర్చై రద్దవుతాయి.

ప్రారబ్ధ కర్మని గుర్తించడానికి రెండు కొలమానాలు ఉన్నాయి.

చేయాల్సిన పనిని చక్కగా చేసినా దానికి తగిన ఫలితం రాకపోతే అప్పుడు పూర్వ కర్మరూపమైన దైవం బలవత్తరమైనది (ప్రారబ్ద కర్మ) అనే అనుకోవాలి.

 అసంకల్పితమేవేహ యాదకస్మాత్ ప్రవర్తతే!

నివర్త్యారంభమారబ్ధం ననుదైవస్య కర్మతత్!!

అయోధ్య కాండ, 22-24

ప్రారంభించిన పనికి అడ్డుగా ఊహింపరాని విధంగా, అకస్మాత్తుగా ఏదైనా వచ్చిపడితే అది దైవ విలసితమే తప్ప మరోటి కాదు.

ఏ విధమైన ప్రయత్నం లేకుండా ఏదైనా లభించకూడనిది లభిస్తే అది కూడా ప్రారబ్ధ కర్మ అని భావించాలి. మనం రైల్లో ప్రయాణిస్తూండగా కిటికీ అంచున ఉంచిన మన చేతి మీద దాని తలుపు అకస్మాత్తుగా కిందకి జారి మన చేతికి దెబ్బ తగిలితే అది ప్రారబ్ద కర్మానుభవానికే జరిగింది. తలవని తలంపుగా జరిగేవి అన్నీ కూడా ప్రారబ్ద కర్మ పరిపాకం వల్లే జరుగుతాయి.

లాటరీ తగలడం కూడా ప్రారబ్ధ కర్మ కిందకే వస్తుంది. టిక్కెట్ తగిలి ధనం, దుఃఖాలే కాక, సుఖాలు కూడా ప్రారబ్ధ కర్మానుభవం ప్రకారమే మనం అనుకోకుండా వస్తాయి. ఈ విషయంగా మనందరికీ తెలిసిన ముగ్గురి గురించి చెప్పుకోవచ్చు.

ఎన్నెన్నో ప్రయత్నాలూ, ఎన్నో సర్దుబాట్లూ చేస్తే కాని ప్రధాని పదవి లభించదు. దాని మీద చాలామంది రాజకీయ ప్రత్యర్ధుల కళ్ళు ఉంటాయి. అప్రయత్నంగా భారతదేశ చరిత్రలో ముగ్గుర్ని ఆ పదవి వరించింది.

1) ఇందిరా గాంధీని కామరాజ నాడార్ ప్రధాన మంత్రిని చేసాడు.

2) పి.వి. నరసింహరావు సామాను సర్దుకుని ఢిల్లీ నించి వెళ్ళిపోయే దశలో భారత ప్రధాని అయి ఐదేళ్లు పాలించాడు.

3) సోనియాగాంధీ ప్రధాన మంత్రి ఔతారని అందరూ భావించారు. కానీ మన్మోహన్ సింగ్ ఏ ప్రయత్నం లేకుండా, పార్లమెంట్ సభ్యుడు కూడా కాకుండా ప్రధాని అయారు.

వారి పూర్వజన్మార్జిత ప్రారబ్ధ కర్మే వారి ప్రయత్నం లేకున్నా పరిస్థితులని వారికి అనుకూలంగా మార్చేసింది.

అలా అని ఏ విధమైన ప్రయత్నం చేయకుండా 'నా కర్మ ఇంతే' అని అనుకునేవాడు తనకి తానే ద్రోహం చేసుకుంటూ దైవద్రోహం చేస్తున్నట్లే. కొన్ని ఈ జన్మలో చేసే ప్రయత్నంతో అగామికర్మల వల్లే లభ్యం అవుతాయని విస్మరించవద్దు. ప్రారబ్ధ కర్మల వల్ల కలిగే కష్టాలకన్నా చాలామందికి ఈ జన్మలో స్వేచ్ఛా చిత్తంతో చేసే కర్మల వల్లే ఎక్కువ కష్టనష్టాలు వస్తుంటాయి.

చాలామంది 'అంతా నా కర్మ’ అంటూ ప్రతీదీ తమ ప్రారబ్ధ కర్మ వల్లే జరిగిందనుకుంటారు. మనిషికి జీవితంలో కలిగే కష్టసుఖాలన్నీ ప్రారబ్ధకర్మలై వుండాలని లేదు. వాటిలో కొన్ని ప్రారబ్ధ కర్మానుసారం కలిగితే, మరికొన్ని ఈ జన్మలోనే, స్వేచ్ఛా ఇచ్ఛతో, స్వబుద్ధితో అగామి కర్మలని ఆచరించడం వల్ల కలుగుతూంటాయి.

నిర్దోషి అయి కూడా జైలుకి వెళ్తే అది తప్పక ప్రారబ్ధ కర్మ వల్ల జరిగినట్లు, నిజంగా దోషి అయి అప్పుడు జైలుకి వెళ్తే అది ప్రారబ్ధ కర్మ వల్ల కాక, ఈ జన్మలో చేసిన ఆగామికర్మ వల్ల కావచ్చు. ఈ జన్మలో చేసిన కర్మ తాలుకు ఫలితం వచ్చే జన్మ దాకా వాయిదా పడకుండా ఈ జన్మలోనే ఫలితం చూపించడం వల్ల అతను జైలుకి వెళ్ళచ్చు.

ఎదుటివాణ్ణి కొడితే తిరిగి మనల్ని రెండు కొడతాడు. అది తక్షణ ఫలితం ఇచ్చిన ఆగామి కర్మ అవుతుంది. దొంగ పోలీసులకి దొరికిపోవడం కూడా అగామి కర్మ ఫలితం తప్ప ప్రారబ్ద కర్మ ఫలితం అవదు.

Post a Comment

0 Comments