GET MORE DETAILS

నిశ్శబ్ద హంతకి (నేడు ప్రపంచ హైపర్‌టెన్షన్-డే)

 నిశ్శబ్ద హంతకి (నేడు ప్రపంచ హైపర్‌టెన్షన్-డే)




యం. రాం ప్రదీప్

తిరువూరు

9492712836

ఆధునిక కాలంలో బీపీ,షుగర్ వ్యాధులు సర్వ సాధారణం అయిపోయాయి. ఉరుకుల పరుగుల జీవనవిధానం వల్ల, మానసిక, శారీరక  ఒత్తిళ్ళ వల్ల మానవ శరీరం బరువు పెరుగు తుంది. ఫలితంగా అధిక రక్తపోటుతో బాదపడే సంఖ్య పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు . 

ప్రజల్లో అధికరక్తపోటు ఊబకాయానికి ఉన్న సంబంధం గుర్తు చేయటానికే మే 17 న "ప్రపంచ హైపర్‌టెన్షన్‌ డే" గా వైద్య నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 

 హైపర్‌టెన్షన్ డే ను తొలుత "ప్రపంచ హైపర్‌టెన్షన్ లీగ్" ద్వారా నిర్వహించడం జరిగింది.వివిధ ఫెడరేషన్‌లు, సొసైటీలు, జాతీయ సంస్థల సమూహమే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన హైపర్‌టెన్షన్ లీగ్. ఈ సంస్థ ప్రపంచ ప్రజల్లో హైపర్‌టెన్షన్‌ను గుర్తించి, దానిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తుంటుంది.  

జ్వరం వంటి అనారోగ్య సమస్యలను మనం సులభంగా గుర్తిస్తాం. కానీ అధిక రక్త పోటు వంటి అనారోగ్య సమస్యలను గుర్తించటం వైద్యులకే సాధ్యం. కనుక ఈ సమస్య ఉన్నట్లు తెలుసు కున్న తర్వాత దాన్ని క్రమబద్దీకరించేందుకు తరచుగా వైద్యుణ్ని సంప్రదించటం ఎంతైనా అవసరం. అధిక రక్తపోటుని అశ్రద్ధ చేసినట్లయితే అది అనేక అనారోగ్య సమస్యలకు మూలమవుతుంది.

నియమానుసారం వ్యాయామం, పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి. దీంతో అధిక బరువు, ఇతర అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. ఊబకాయం కారణంగా అధిక రక్తపోటు బారిన పడటమే కాకుండా పక్షవాతం, గుండెపోటు వంటి సమస్యలు ఉత్పన్న మవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మారుతున్న జీవనశైలి, జీతంలో పెరుగుతున్న ఉరుకులు పరుగులు, దినదినం శరవేగంగా వ్యాపిస్తున్న వాతావరణం కాలుష్యం, ఆహార నియమాల్లో మార్పులు, నాణ్యత కోల్పోతున్న ఆహార పదార్ధాలు, భారత దేశంలో అధికరక్తపోటు బాధితులు పెరగటానికి ప్రధానకారణాలని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి.

అధిక రక్తపోటు కు ప్రధాన శత్రువు ఉప్పు. మనం రోజూ వాడే ఉప్పులో ఉండే 'సోడియం' రక్తంలో 'ద్రవాభిసరణ ప్రక్రియ' పై ప్రభావం చూపుతుంది. దీంతో రక్త తీవ్రత పెరుగుతుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఉప్పును వీలైనంత వరకు తగ్గించి వాడటం ఎంతో ఉత్తమం. అంతేకాక, పెరుగన్నంలో, పండ్లరసాల్లో అదనంగా ఉప్పును కలిపి తీసుకోవడం మానేయాలి. ఇంకా చిప్స్‌, మిక్చర్‌ లాంటి నూనేలో వేయించి చేసిన వాటిలో  ఉప్పును వాడకూడదు.

క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగమవ్వాలి. మసాలాతో కూడుకున్న ఆహారాన్ని పూర్తిగా మానేయటం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జంక్‌-ఫుడ్స్‌, ఫాస్ట్-ఫుడ్స్, రెడీమేడ్‌, నిలవ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోవడం మానేస్తే అధిక రక్తపోటును కొంతవరకు నివారించడం సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు.

మారుతున్న జీవనశైలి ఒత్తిడి పెంచుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా పసిపిల్లల నుండి కురువృద్దుల వరకు జనమంతా రోజులో ఎక్కువ భాగం కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయడం వల్ల శరీరానికి కావాల్సినంత వ్యాయామం అందటం లేదు. దాంతో దేహంలో కొవ్వుపదార్ధాలు పేరుకుపోయి ఊబకాయం బారిన పడు తున్నారు. ఇది నేడు చిన్న పిల్లల్లో కూడా అధికమవుతోంది. కాబట్టి అధిక రక్తపోటు బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వతహాగా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. దీనికి చేయాల్సిందల్లా, ప్రతిరోజూ వ్యాయామం చేయటం, పౌష్టికాహారం తీసుకోవడం, తీసుకునే ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, తాజాకూరగాయలు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.

ఎప్పుడు చూసినా పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చుని అందులో ఆటలను ఆడటం చూస్తుంటాం. ఈ ఆటల్లో మానసికపరమైన ఒత్తిడి నెలకొంటోంది. అలాగే దైహిక వ్యాయామానికి అవకాశం ఉండక వారు చిన్న వయసులోనే హైపర్‌టెన్షన్ బారినపడే అవకాశాలున్నాయి. పైగా వారు తీసుకునే ఆహారం జంక్‌ ఫుడ్‌తో కూడుకున్నదై ఉంటోంది. దీంతో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం కారణంతోనే అధిక రక్తపోటు (బిపి) మధుమేహం (షుగర్) వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కాబట్టి మనమే కాదు మన పిల్లలు కూడా తీసుకునే ఆహారం పుష్టికరమైనదిగా ఉండేలా చూడాలిసిన బాధ్యత మనందరిది.

తొలిదశలో ఈ రోగ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అందుకే వైద్యపరిభాషలో హైపర్ టెన్షన్ ను "సైలెంట్ కిల్లర్" అంటారు. తలనొప్పి, కళ్ళు తిరగడం, తలభారంగా తరచుగా అనిపిస్తే వెంటనే వైద్యుని సలహాలు పొంది తగు చికిత్స చేయించు కోవాలి.హైపర్‌టెన్షన్ బారిన పడినవారి సంఖ్య 1960లో నాలుగు శాతంగా ఉంది. అదే ప్రస్తుతం ఇరవై నాలుగు శాతానికి చేరుకుందని వైద్య పరిశోధకులు తెలిపారు.

హైపర్‌టెన్షన్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిమనిషి స్వతహాగా తమ ఆరోగ్యంపట్ల ప్రత్యేకశ్రద్ధ పెట్టాలి. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే, ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమబద్ధమైన పౌష్టికాహారం తీసుకోవటం ఆహారంలో పండ్లు, ఆకు కూరలు కూరగాయలు ఉండేలా చూసుకోవటం చాలు ఆరోగ్య నిపుణులు. అధిక రక్త పీడనం వలన గుండెపోటు మరియు మూత్రపిండాల సమస్యలు కలుగుతాయి. సహజసిద్ధంగా లభించే పొటాషియంను ఎక్కువగా తినటానికి ప్రయత్నించాలి.

మీరు అధిక రక్త పీడనాన్ని కలిగి ఉన్నట్లయితే భౌతిక వ్యాయామ కార్యకలపాలను అనుసరించటం వలన గుండెకు ఆక్సిజన్ అందటం అధికం అవుతుంది.  రోజు 15 నిమిషాలపాటు వ్యాయామాలని చేయటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఏది ఏమైనా ఇటువంటి అనారోగ్య సమస్య ఏదైనా కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది. వారిచ్చే సూచనలతో మందులు వాడాలి.

Post a Comment

0 Comments