శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారు...? ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం.
శ్రీవారి ప్రసాదాన్ని, ప్రముఖంగా ఉపయోగించే దినుసులను బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు.
1. అన్నప్రసాదాలు : బియ్యంతో చేసేటటు వంటివి - 'ముద్గాన్నం' (కట్టెపొంగలి), తింత్రిణీఫల రసాన్నం (చింతపండు పులిహోర), చక్కెర పొంగలి (బెల్లంతో చేసేది), దధ్యోజనం (పెరుగన్నం), తీపి అన్నం (పంచదారతో చేసేది), మారీచ్యాన్నం (మిరియాల అన్నం లేదా "మొళిహోర"), కదంబం (పులుసన్నం లేదా శాకాన్నం), బకాళా బాతు (మసాలా పెరుగన్నం) మరియు మాత్రాన్నం (అన్నం, గడ్డ పెరుగు, శొంఠి, వెన్నతో తయారు చేయబడినది)
2. బెల్లం లేదా చక్కెర ప్రధానంగా గలవి : పాయసం, సిరా (కేసరి), చిన్నలడ్డు, పెద్దలడ్డు, ఆస్థానలడ్డు, అప్పం, జిలేబీ, మనోహరం (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, బెల్లం, మిరియాలతో చేసిన లడ్డు), పోళీలు, సుఖియం (పూర్ణం బూరెలు), బెల్లపుదోశె, అమృతకలశం (బియ్యం పిండి, బెల్లం, నెయ్యి, మిరియాలతో చేసేది) మరియు "కొలువు ప్రసాదం" (నల్లనువ్వులు, బెల్లం, కొంఠి మిశ్రమం)
3. ఉప్పుతో కూడినవి (లేదా పణ్యారములు) : వడ, దోశె, నెయ్యిదోశె, తేనెతోళీలు (పెద్ద జంతికలు లేదా మురుకులు), సుండలు (పచ్చి శనగపప్పు, కొబ్బరితో చేసిన గుగ్గిళ్ళు)
4. అపక్వ (వండని) ప్రసాదాలు : పంచకజ్జాయం (జీడిపప్పు, గసగసాలు, ఎండుకొబ్బరి తురుము, చక్కెర, యాలకులపొడి ఈ ఐదు పదార్థాల మిశ్రమం), బెల్లం పానకం, ఆవుపాలు, వెన్న, వడపప్పు, మధురఫలాలు (ఒక్కో రకానికి 25 ఫలాల చొప్పున), ఎండుఫలాలు, తమలపాకులు మరియు వక్కలు. అన్నప్రసాదాలను శ్రీవారి కైంకర్యనిమిత్తం సమర్పించే ముందు పాత్రలన్నింటిలో ఆవునెయ్యి వేసి, తులసి దళాలను ఉంచి, అష్టాక్షరీ మంత్రాన్ని (ఓం నమో నారాయణాయ) ఉచ్ఛరిస్తారు.
◆ అన్నప్రసాదాలను శ్రీవారి కైంకర్యనిమిత్తం సమర్పించే ముందు పాత్రలన్నింటిలో ఆవునెయ్యి వేసి, తులసి దళాలను ఉంచి, అష్టాక్షరీ మంత్రాన్ని (ఓం నమో నారాయణాయ) ఉచ్ఛరిస్తారు.
◆ శ్రీవారికి త్రికాలకైంకర్యం జరుపబడుతుంది. మూడు పూటలా జరిగే నైవేద్య సమర్పణ సమయాన్ని (మూడు ఘంటలు) గా వ్యవహరిస్తారు.
1. మొదటి ఘంట:
ఉదయం అయిదు గంటలకు జరిగే నైవేద్యాన్ని (బాలభోగం) అని కూడా అంటారు.
కులశేఖరపడి లోపల శ్రీవారికి అభిముఖంగా, రెండడుగుల ఎత్తైన వేదిక మీద (మాత్రాన్నం) ఉంచుతారు. శ్రీవారికి ఎడమవైపు లడ్డు, వడ వంటి పణ్యారాలు; కుడివైపు బలి ప్రసాదం (శుద్ధాన్నం లేదా తెల్ల అన్నం) ఉంచుతారు.
కులశేఖరపడి బయట, శ్రీవారికి కుడివైపున దధ్యోజనం, శుద్ధాన్నం, పులిహోర, కదంబం, ముద్గాన్నం; ఎడమవైపున గుడాన్నం (చక్కెర పొంగలి), నాలుగు గంగాళాలతో దధ్యన్నం (పెరుగన్నం) ఉంచుతారు.
ఇది "మొదటి ఘంట" ప్రసాదాలుంచే క్రమం.
2. రెండవ ఘంట:
ఉదయం 10 గంటలకు మొదలయ్యే ప్రసాద సమర్పణను (రాజభోగం) అని కూడా అంటారు. ఈ నివేదనలో భాగంగా, శ్రీవారికి అభిముఖంగా (శుద్ధాన్నం) ఉంచుతారు. బలిప్రసాదాన్ని (శుద్ధాన్నం) గర్భాలయ దక్షిణద్వారం వైపు ఉంచి; కులశేఖరపడి వెలుపల దక్షిణంవైపు సిరా, పులిహోర, కట్టెపొంగలి; ఉత్తరంవైపు చక్కెర పొంగలి, దధ్యోజనం ఉంచుతారు. తరువాత ఘనసారం (ముఖవాసం లేదా తాంబూలం) పేరుతో తమలపాకులు, వక్కలు, పచ్చకర్పూరం, యాలకులు, ముక్తాచూర్ణం (ముత్యాల పొడి) సమర్పిస్తారు.
3. మూడవఘంట లేదా రాత్రిఘంట:
రాత్రి 7:30 గంటలకు సమర్పించే నైవేద్యాన్ని (శయనభోగం) గా పిలుస్తారు.
సన్నిధి లోపలనున్న వేదిక మీద మారీచ్యాన్నం (మిరియాల అన్నం), బలిఅన్నం, రెండు వెదురు బుట్టలలో త్రాంద్రవం (తోమాల దోశె), లడ్డు, వడ ఉంచుతారు. కులశేఖరపడికి వెలుపల దక్షిణం వైపు పులిహోర, కదంబం; ఉత్తరంవైపు గుడాన్నం ఉంచుతారు.
పులిహోరను శ్రీవారికి అర్పించిన తరువాత బేడి ఆంజనేయస్వామికి నివేదించుతారు. ఇవేకాకుండా, మనం చిరుతిళ్ళు తిన్నట్లే స్వామి వారికి ప్రతిరోజూ నాలుగు రకాల పణ్యారములు (స్నాక్స్, లడ్డూ, జిలేబిలాంటివి) కూడా అర్పిస్తారు. వీటితో పాటుగా, శ్రీవారికి నిశిరాత్రి (అర్థరాత్రి) నివేదన సైతం చేస్తారు. దీనిలోభాగంగా, తిరువీశం అనబడే బెల్లపు అన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు. సాధారణంగా, శ్రీవారికి ప్రసాదాల నివేదన జరిగే సమయంలో, తిరుమామణి మంటపంలో ఉన్న (బంగారు వాకిలి ముందున్న పెద్ద మంటపం) పెద్దగంటలను వాయిస్తూ, ఆలయంలోను, పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరికి నివేద సూచన నిస్తారు. శ్రీవారికి నివేదన జరిగిన తరువాత మాత్రమే ఆహారాన్ని తీసుకునే భక్తులు నేటికీ ఎందరో ఉన్నారు. అయితే, నిశిరాత్రి జరిగే (తిరువీశం) నివేదనలో మాత్రం పెద్దగంటలకు బదులుగా "స్నపనమండపం" లోని చిన్న గంటను మ్రోగిస్తారు. అంటే, అది దాదాపుగా నడిరేయి సమయం కాబట్టి, స్వామివారికే తప్ప భక్తులకు సూచన అవసరంలేదన్నమాట. కొద్దిసేపటి తరువాత, స్వామివారు పట్టెమంచంపై శయనించటానికి సిద్ధంగా ఉన్నపుడు, ఆ రోజుకు చిట్టచివరి నైవేద్యంగా వేడిపాలతో పాటుగా, నేతిలో వేయించిన ఎండు ఫలాలు మరియు తాజా పండ్ల ముక్కలు ("మేవా" అనబడే పంచామృతం) సమర్పిస్తారు.
ప్రతిరోజూ జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, డోలోత్సవం తరువాత (పంచకజ్జాయం) నివేదిస్తారు. శ్రీవారి భోజనాల "మెనూ" ను నిశితంగా పరిశీలిస్తే, మనకు కొన్ని అబ్బుర పరిచే విశేషాలు అవగత మవుతాయి.
శ్రీవారిది సమతుల్యాహారం : కడుపు నింపే పదార్థాలు, జిహ్వకు రుచిగా ఉండేవి, పుష్టికరమైనవి, ఔషధగుణాలు కలిగినవి, సులభంగా జీర్ణమయ్యేవి, చలువ చేసేవి, ఎముకలను పటిష్టం చేసేవి (శరీరంలో అదనపు కాల్షియం కోసం, ప్రతిరోజు అత్యంత స్వల్పమోతాదులో మంచిముత్యాల పొడిని ఆహారంలో తీసుకునే ఆనవాయితి కొందరు శ్రీమంతుల కుటుంబాల్లో నేటికీ ఉందని చెప్తారు) - వీటన్నింటి సమాహారం. ఇంచుమించుగా ప్రతిరోజూ నైవేద్యక్రమం, ప్రసాదాలు ఇలాగే ఉంటాయి. అయితే ఋతువులను బట్టి స్వల్ప మార్పులు చేస్తారు. అలాగే వారంలో కొన్ని రోజులు అదనపు నైవేద్యాలు సమర్పిస్తారు (పైన చెప్పుకున్న నిత్యనైవేద్యాలతో పాటుగా).
● బ్రహ్మోత్సవాలలో, ధ్వజారోహణ (గరుడిని జండా ఎగురవేయడం) సందర్భంగా, "కోడెపొంగలి" అనే ప్రత్యేకమైన అన్నప్రసాదాన్ని నివేదిస్తారు.
0 Comments