ఆధార్‌తో పాన్ జత చేయలేదా? ఈ పనులు సాధ్యం కాదు
ఆదాయపు పన్ను చట్టంలోని 139 ఏఏ సెక్షన్ ప్రకారం పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)ను, ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాలి. దీనికి ప్రభుత్వం ఇచ్చిన గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. ఈ గడువు లోపు ఆధార్‌ను అనుసంధానం చేయని పాన్‌లు దాదాపు రద్దు (ఇన్-యాక్టివ్) అయినట్లే. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అమల్లో ఉండే పాన్ లేకుండా చాలా రకాలైన పనులు పూర్తి చేయలేం. ఆదాయపు పన్ను చట్టంలోని 114బి నిబంధన ప్రకారం దాదాపు 15 రకాలైన లావాదేవీలు నిర్వహించటానికి పాన్ తెలియజేయటం తప్పనిసరి. దీని నుంచి కేవలం 80 ఏళ్లకు పైబడిన వెరీ సీనియర్ సిటిజన్లకు మాత్రం మినహాయింపు ఉంది. అదే విధంగా అసోం, జమ్మూ కశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల ప్రజలకూ మినహాయింపు ఇచ్చారు. మిగిలిన ప్రాంతాలు, వర్గాల ప్రజలకు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయటం తప్పనిసరి.
ఒకవేళ పాన్ ఇన్-యాక్టివ్ అయితే ఈ కింది పనులను పూర్తి చేయలేం.
◼️ బ్యాంకు ఖాతా ప్రారంభించడం.
◼️ క్రెడిట్ లేదా డెబిట్ కార్దు దరఖాస్తు దాఖలు చేయటం.
◼️ స్టాక్ బ్రోకింగ్/ డీమ్యాట్ ఖాతా తెరవడం.
◼️ హోటల్ లేదా రెస్టరెంట్‌లో రూ.50,000 కంటే మించిన బిల్లు నగదు రూపంలో చెల్లించడం.
◼️ రూ.50,000 కంటే ఎక్కువ సొమ్ముతో మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనడం
◼️ రూ.50,000 కంటే ఎక్కువ సొమ్ముతో డిబెంచర్లు, బాండ్లు తీసుకోవటానికి.
◼️ బ్యాంకులో ఒక రోజులో రూ.50,000 కంటే మించిన సొమ్ము డిపాజిట్.
◼️ రూ.50,000 కు మించిన బ్యాంకు డ్రాఫ్టు, పేఆర్డర్, బ్యాంకర్స్ చెక్ తీసుకోవడం.
◼️ రూ.50,000 కు మించిన టైమ్ డిపాజిట్.
◼️ రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉన్న బీమా పాలసీ కొనుగోలు.
◼️ రూ.1,00,000 కు మించిన సెక్యూరిటీల (షేర్లు కాకుండా...) కొనుగోలు లేదా విక్రయ లావాదేవీ.
◼️ స్టాక్‌మార్కెట్లో నమోదు కాని కంపెనీల్లో ఈక్విటీ షేర్లలో రూ.1,00,000 కు మించిన సొమ్ము మదుపు చేయడం.
💥ఇవే కాకుండా పాన్ క్రియాశీలకంగా లేకపోతే మరికొన్ని రకాలైన పనులకు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. అవి ఏమిటంటే...
▪️ మోటారు వాహనాలు (ద్విచక్ర వాహనాలకు మినహాయింపు) కొనుగోలు చేస్తే అధిక పన్ను చెల్లించాల్సి. వస్తుంది.
▪️ రూ.10 లక్షల కంటే మించిన మొత్తానికి స్థిరాస్తిని కొనుగోలు చేసే సమయంలో రూ. 2 లక్షలకు మించిన విలువైన వస్తువును కొనుగోలు చేయటానికి లేదా సేవలు పొందటానికి.
💥 ఇంకా అవకాశం ఉంది...
పాన్ ఆధార్‌తో అనుసంధానం చేయటానికి కేంద్ర ప్రభుత్వం గడువును పలు దఫాలుగా పెంచుతూ వచ్చింది. చివరికి ఈ గడువు గత నెలాఖరుతో ముగిసింది. అపరాధ రుసుము చెల్లించి పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయటానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఈ పనిని ఇప్పటికైనా పూర్తిచేయటం మేలు. తద్వారా పాన్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఆ పని చేస్తే పైన ప్రస్తావించిన పనులు నిరభ్యంతరంగా పూర్తి చేయటానికి వీలు కలుగుతుంది. అనుసంధానం కోసం దరఖాస్తు చేసినప్పటి నుంచి నెల రోజుల వరకూ గడువు ఉంటుంది. అప్పటి వరకూ పాన్ చెల్లుబాటు కాదు.
0 Comments