GET MORE DETAILS

ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు ఏం పని...?

ఎన్నికల విధుల్లో వాలంటీర్లకు ఏం పని...?• భాగస్వాముల్ని చేయొద్దన్నా వారి ప్రమేయం ఎందుకు ?

• ఏ ప్రాతిపదికన భారీగా ఓట్లు తొలగించారు ?

• జీరో డోర్ నంబర్లో భారీగా ఓట్లు ఉండటం ఏంటి ?

• కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నల పరంపర

 ఓటర్ల జాబితా తయారీ సహా ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల విధుల్లో వాలంటీర్లు పాల్గొంటున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులందుతున్నాయి. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగస్వాముల్ని చేయొద్దని ఆదేశించినా వారి ప్రమేయం ఎందుకు ఉంటోంది? ఇకపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. వాలంటీర్లు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారు? ఎవరి అనుమతితో వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు? ఇంటింటి సర్వేకు కూడా వారిని బీఎల్‌వోలు ఎందుకు తీసుకెళ్తున్నారు' అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నలు గుప్పించింది. ఓటు నమోదు సహా ఇతర మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల తిరస్కరణ శాతం బాపట్ల సహా పలు జిల్లాల్లో సాధారణం కంటే చాలా ఎక్కువగా ఎందుకు ఉంది? వీటికి బాధ్యులెవరని నిలదీసింది. 'ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం వంటి నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు ఎందుకు తొలగించారు? ఏ ప్రాతిపదికన వాటిని తీసేశారు? తొలగించే ముందు వారికి నోటీసులిచ్చారా' అని ప్రశ్నించింది. ఏపీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024పై జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విశాఖపట్నంలో సమీక్ష సమావేశం నిర్వహించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజైన బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్‌ వ్యాస్‌, డిప్యూటీ కమిషనర్‌ హిర్దేష్‌కుమార్‌ తదితరులు పాల్గొని జిల్లాల వారీగా సమీక్షించారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు భారీగా తొలగించారని, అధికార పార్టీకి అనుకూలంగా భారీగా బోగస్‌ ఓట్లు చేర్పించారని, ఒకే చిరునామాలో దశాబ్దాలుగా నివసిస్తున్న వారి పేర్లు ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో గల్లంతు చేశారని, ఒకే డోర్‌ నంబరులో వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారని ఇలా అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024కు సంబంధించి ఫిర్యాదులొస్తున్నాయని... అలాంటి వాటికి అస్కారమివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తే ఊరుకునేది లేదని, కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని కలెక్టర్లకు స్పష్టం చేశారు. బూత్‌ స్థాయి అధికారులకు(బీఎల్‌వో) ఈ అంశాల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా అధ్యక్షతన సమావేశం జరిగింది. 175 నియోజకవర్గాల పరిధిలో వచ్చే ఫిర్యాదులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

ఓటర్ల సంఖ్యలో తేడాలెందుకున్నాయి...?

పలు జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో ఓటరు-జనాభా నిష్పత్తి సాధారణం కంటే ఎక్కువగా ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా ఉందని.. దీనికి కారణాలేమిటని ఆయా జిల్లాల కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. తూర్పుగోదావరి, పల్నాడు, వైయస్‌ఆర్‌, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలో తప్పిదాలు, లోపాలు చోటుచేసుకున్నాయని వాటిని సరిదిద్దాలని సూచించింది. బుధవారం 22 జిల్లాలకు సంబంధించిన సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు తొలుత ప్రజËంటేషన్‌ ఇవ్వగా.. వాటి ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పలు ప్రశ్నలు వేశారు. అనకాపల్లి, ఏలూరు జిల్లాల కలెక్టర్లు సరిగ్గా ప్రజంటేషన్‌ ఇవ్వకపోవటం, సమాచారం సరిగ్గా చెప్పకపోవడంతో వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పూర్తి వివరాలతో రావాలని వారికి సూచించారు.

ఫొటో గుర్తింపు కార్డులపై దృష్టి పెట్టండి:

ఓటరు జాబితాలో పొటోలు కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక కుటుంబంలోని సభ్యులందరకీ ఒకే పోలింగ్‌ బూత్‌లో ఓట్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రిటర్నింగ్‌ అధికారుల నియామకం:

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారులను వాటి పరిధిలోని మండలాలకు సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలను కూడా నియమించింది.

ఒకే డోర్‌ నంబర్‌తో భారీగా ఓట్లా...?

ఒకే ఇంటిలో ఒకే డోర్‌ నంబర్‌తో భారీగా ఓట్లు, జీరో డోర్‌ నంబర్‌తో లక్షల ఓట్లు ఎందుకు ఉన్నాయి అని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పలు జిల్లాల కలెక్టర్లను ప్రశ్నించారు. వాటికి బాధ్యులు ఎవరని అడిగారు. వీటన్నింటిపై వెంటనే పరిశీలన చేపట్టాలని ఆదేశించారు.. బూత్‌, నియోజకవర్గ స్థాయిలో ఏ అధికారి ఓట్ల నమోదు ప్రక్రియ పరిశీలించి ఖరారు చేస్తారో వారే తప్పులు, లోపాలకు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని, ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నియోజకవర్గ స్థాయిలో అప్పటి వరకు జరిగిన ఓట్ల నమోదు ప్రక్రియపై ప్రతి మంగళవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఓటర్ల జాబితా తయారు చేయాలని సూచించారు.

Post a Comment

0 Comments