విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం : పట్టాలు తప్పిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ , అరుగురు మృతి
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపోవడంతో విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు అలమండ - కోరుకొండ స్టేషన్ మధ్యలో నిలిచిపోయింది.
సరిగ్గా అదే సమయంలో దాని వెనుకే అత్యంత వేగంగా వచ్చిన విశాఖ-పలా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ప్రమాదంలో రాయగడ ప్యాసింజర్‌కు చెందిన మూడు భోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక , రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. బోగీలలో కొందరు ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని సమాచారం. చిమ్మ చీకటిగా వుండటంతో అంబులెన్స్‌లు ఆ ప్రాంతానికి చేరుకోవడం కష్టంగా మారింది. ఎలక్ట్రికల్ సిబ్బంది, రైల్వే సహాయక సిబ్బంది ప్రత్యేక రైలులో చేరుకున్నారు
హెల్ప్ లైన్ నంబర్లు
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
రైలు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు
0 Comments