Deepavali: ఆ ఏడు గ్రామాల్లో నిశ్శబ్ద దీపావళి
తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని ఏడు గ్రామాల్లో ఏటా ‘నిశ్శబ్ద’ దీపావళి చేసుకుంటారు.
దీపావళి (Diwali) పర్వదినం వేళ దివ్వెల వెలుగులే కాదు, బాణసంచా (Firecrackers) మోత కూడా సాధారణమే! కానీ, తమిళనాడు (Tamil Nadu) ఈరోడ్ జిల్లాలోని ఆ ఏడు గ్రామాల్లో మాత్రం ఈ పండగను నిశ్శబ్దం (Silent Deepavali)గా చేసుకుంటారు. కేవలం దీపాలకే పరిమితమవుతారు. కారణం.. ఆ పల్లెలకు సమీపంలో ఓ పక్షుల సంరక్షణ కేంద్రం (Vellode Bird Sanctuary) ఉండటమే. దేశవిదేశాల నుంచి వలస వచ్చే వేలాది పక్షులకు టపాసుల శబ్దంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. దాదాపు 22 ఏళ్ల నుంచి ఈ పద్ధతినే పాటిస్తున్నారట.
ఈరోడ్ జిల్లాలోని సెల్లప్పంపాళయం, వడముగమ్ వెల్లోడ్, సెమ్మందంపాళయం, కరుక్కనకట్టు వాలాసు, పుంగంపాడి తదితర ఏడు గ్రామాలు ఈరోడ్ జిల్లాలోని వెల్లోడ్ పక్షుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉంటాయి. అయితే.. అక్టోబరు నుంచి జనవరి మధ్య కాలంలో దేశవిదేశాలకు చెందిన వేలాది పక్షులు ఈ కేంద్రానికి వలస వచ్చి, గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఈ నేపథ్యంలోనే పక్షులకు అనువైన వాతావరణం కల్పించేందుకు, వాటిని భయపెట్టకుండా ఉండేందుకుగానూ పక్షుల కేంద్రానికి చుట్టుపక్కల నివసించే 900కుపైగా కుటుంబాలు బాణసంచా పేల్చొద్దని నిర్ణయం తీసుకున్నాయి. గత 22 ఏళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి.
దీపావళి సందర్భంగా ఇక్కడి కుటుంబాలు తమ పిల్లలకు నూతన వస్త్రాలు కొనివ్వడమేగాకుండా.. టపాకాయలకు బదులుగా కాకరపువ్వొత్తుల వంటివాటిని మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తాయని ఓ వార్తాసంస్థ తెలిపింది. ఈ ఏడాది కూడా ఇక్కడి గ్రామస్థులు తమదైన రీతిలో దీపావళిని ఆనందంగా చేసుకుని, తమ ‘నిశ్శబ్ద’ సంప్రదాయాన్ని కొనసాగించినట్లు వెల్లడించింది. దీంతో ఈ రెండు రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని చెప్పింది.
0 Comments