GET MORE DETAILS

అయిదు రోజుల అందమైన దీపావళి

అయిదు రోజుల అందమైన దీపావళి01)  ధన త్రయోదశి

02)  నరక చతుర్దశి

03)  దీపావళి

04)  బలి పాడ్యమి

05)  భగనీహస్త భోజనం 

దీపావళి అంటే సంతోషం ... సందడి ... సంబరం. ఈ రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో ... మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటిపడే సరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటులేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది.

చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ వుంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది.

శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.

ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.

ఈ రోజుల్లో వానలు కురవడం, చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు.

ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు ద్వారకానగరానికి చెందిన 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక, అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు. మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు.

ధనత్రయోదశి .. నరకచతుర్దశి .. దీపావళి ... బలిపాడ్యమి ... యమద్వితీయ అయిదు రోజుల పండుగలా భావిస్తుంటారు కనుక కొందరు అయిదు దీపాలను వెలిగిస్తుంటారు. భూదేవి దీపం వేడిని భరించలేదట. అందువలన ప్రమిదలో ప్రమిద పెట్టి వెలిగిస్తుంటారు ... ఆ బంగారు కాంతుల్లో అనుబంధాల వాకిట్లో ఆనందాల సందడి చేసేస్తుంటారు.

 1. ధన త్రయోదశి:

ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నాడు ‘ధన్వంతరి జయంతి’ మరియు ‘ధన త్రయోదశి’ ని జరుపుకుంటాం. ధన్వంతరిని ఆయుర్వేద వైద్యానికి ఆద్యకర్తగా భావిస్తారు. క్షీరసాగర మథనం జరిగినపుడు శ్రీమహావిష్ణువు అంశగా అమృత కలశహస్తుడై  ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి అవతరించిన రోజు. కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడు. ధన త్రయోదశిరోజు ఆయనను భక్తితో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.  

ఈనాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించాలి. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి.

ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి.

వైద్యులు తప్పకుండా ఈ   రోజు ధన్వంతరి పూజ చేయాలి. అలా శ్రద్ధగా పూజిస్తే  వైద్యుల హస్తం అమ్రుతీకరణం అవుతుంది. తద్వారా వారు ఇచ్చిన మందు రోగికి  అమ్రుతంవలె పనిచేస్తుంది. దీనినే హస్తవాసి అంటారు

ఈరోజు ఐశ్వర్య, సౌభాగ్యదాయిని ధనలక్ష్మీదేవిని పూజిస్తారు.  ఆమెను ఈరోజు పూజించడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం హిమవంతుడనే రాజుకు లేక లేక ఓ పుత్రుడు జన్మించాడు. అయితే ఆ కుమారుడు జాతకరీత్యా  వివాహమైన నాలుగవ రోజు పాముకాటుకు గురై చనిపోతాడని చెబుతారు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. వివాహం కూడా అవుతుంది. ఆ రాకుమారుడి భార్య వివాహమైన నాలుగోరోజు రాత్రి రాజసౌథాన్ని దీపాలతో అలంకరిస్తుంది. బంగారం, వెండి, రత్నాలని రాశులుగా పోసి  ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని పూజిస్తుంది. రాకుమారుడి ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతి, బంగారు, వెండి ధగధగలకు కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోతాడు. వచ్చిన పని మరచిపోయి తెల్లవారి తిరిగి వెళ్తాడని చెబుతారు. ధనలక్ష్మీ దేవి అనుగ్రహం వల్లే తన భర్తకు ప్రాణహాని తప్పిందని పురాణ కథనం. అందుకే ఈరోజు స్త్రీలు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. అందుకే ఈరోజు శక్తి కొలది లక్ష్మీ అనుగ్రహం కొరకు ధన లక్ష్మి ని పూజిస్తారు. దీనినే యమ త్రయోదశి గా కూడా జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది.

2. నరక చతుర్దశి:

నరకాసుర సంహారం జరిగింది ఈరోజే. పైన   వివరంగా తెలుసుకున్నాము కదా ? ఇంకా ఈ చతుర్దశి రోజున ఆచరించాల్సిన  విధానాలు ఇవి

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయ తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.  పితృ దేవతలకు నరక బాధలు లేకుండా చేసే చతుర్దశి  కనుక నరక చతుర్దశి అని కూడా వ్యవహరిస్తారు.

 3. దీపావళి:

లోక కంటకుడు అయిన నరకుని పీడ తొలగినందుకు దీపావళి జరుపుకుంటారు. పైన వివరణ చదువుకున్నాం కదా ? ఇంకా ఈరోజున చేయాల్సిన విశేషాలు చూద్దాం. 

దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ:

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళి  రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది.

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. 

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటారు .  దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. 

 4. బలి పాడ్యమి:

దీపావళి మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున హిందువులు బలి పాడ్యమి గా జరుపుకుంటారు.

పాడ్యమి రోజు ఉదయాన పంచవర్ణముతో బలిని నిర్మించాలి. తెల్లని బియ్యంతో పరివారాన్ని నిర్మించాలి. ఆ మీద పూజ చేయాలి. బలిని ఉద్దేశించి యధాశక్తి దానాలు చేయాలి. 

 బలి ప్రార్థన:

బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో !

భవిష్యేంద్ర సురారాతే పూజేయం, ప్రతిగృహ్యతాం !! 

బలి చక్రవర్తి గురించి మనలో చాలామంది వినేవుంటారు. ఆయనకు 'మాట తిరుగని మానధనుడు’ అని పేరు కూడా ఉంది. ఇచ్చిన  మాట నిలుపుకోవడంలో ఆయనకు ఎంత మంచి పేరుందో అంతటి అహంకారం కూడా ఉంది.   ఒకసారి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి.. వామనుడైన విష్ణువుకు తన సర్వస్వాన్ని దానం చేశాడు. అప్పుడు వామనుడు తన మూడవ కాలును బలిచక్రవర్తి తలపై పెట్టి అహంకార భంగం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు. అప్పుడు గర్వభంగమైన  బలిచక్రవర్తి "దేవా! నాకోసం ఏమీ అడగను. నా ప్రజల కోసం ఓ వరం అడుగుతాను అని అన్నాడు. “నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి" అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు. 

ఈ రోజున అనగా కార్తీక శుద్ధ పాడ్యమిన.. మహావిష్ణువుతో కలిసి బలి చక్రవర్తి తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు.  ప్రతి ఇంటి ముంగిట దీపాలూ, మామిడితోరణాలు, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నరాని బలి సంతోషపడతాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు 'బలి పాడ్యమి 'అయ్యింది. ప్రజల క్షేమం కోసం వచ్చే బలిచక్రవర్తిని ఈ రోజున పూజించాలి.

ఈ రోజున గోవర్థన గిరి పూజ చేయాలని మన పెద్దలు  చెబుతారు. తనను మాత్రమే పూజించాలని, లేకపోతే అల్లకల్లోలం చేస్తానని.. ఇంద్రుడు భీకర గాలి,తుఫానును సృష్టిస్తాడు. అప్పుడు  శ్రీకృష్ణుడు గోవర్థన గిరిని తన చిటికెన వేలు మీద నిల్పి, ప్రజలను కాపాడి.. ఇంద్రుడికి కూడా ఇదే రోజున గర్వభంగం చేశాడు. కనుక ప్రజలను కాపాడిన గోవర్థన గిరిని, శ్రీకృష్ణుడిని ఇప్పటికీ పూజిస్తాము.

5. భగినీ హస్త భోజనం:

కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ.  ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. 

ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ "ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు'' అంటాడు. దీనికి కారణం ఉంది. 

యముడు యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదరసోదరీ పరమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు.

Post a Comment

0 Comments