GET MORE DETAILS

Driving License: ఈ దేశాల్లో భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అనుమతి ఉంటుందని తెలుసా...!

Driving License: ఈ దేశాల్లో భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అనుమతి ఉంటుందని తెలుసా...!


Driving License:  కొన్ని ప్రముఖ దేశాల్లో మన భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా చెల్లుబాటు అవుతుంది. ఆ దేశాలేంటో ఓ లుక్కేద్దాం...

విదేశీయానం ప్రతిఒక్కరికీ ఒక మధురమైన అనుభూతి. కొత్త ప్రదేశాల అందాలను వీక్షిస్తూ.. అక్కడి సంస్కృతిలో భాగం కావడం అనేది జీవితంలో మరపురాని జ్ఞాపకం. అయితే, వేరే దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి సందర్శనీయ స్థలాలను చూడ్డానికి స్థానిక ప్రయాణ వసతులనే ఉపయోగించుకోవాల్సి వస్తుంటుంది. కానీ, ఓ కారు అద్దెకు తీసుకొని మనమే డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తే ఆ కిక్కే వేరు! మరి అక్కడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ (Driving License) ఉండాలి కదా? అయితే, కొన్ని ప్రముఖ దేశాల్లో మన భారత లైసెన్స్‌ కూడా చెల్లుబాటు అవుతుంది. ఆ దేశాలేంటో ఓ లుక్కేద్దాం...

అమెరికా:

అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు ఓ కారుని అద్దెకు తీసుకొని నడపొచ్చు. అయితే, లైసెన్స్‌పై వివరాలు ఇంగ్లిష్‌లో ఉండాలి. అలాగే అది మన దేశంలో చెల్లుబాటులో ఉండాలి. లైసెన్స్‌తో పాటు అమెరికాలోకి ఎప్పుడు ప్రవేశించాం సహా ఇతర వివరాలు ఉండే ఐ-94 ఫారం కూడా వెంట ఉంచుకోవాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటే మన లైసెన్స్‌తో అమెరికాలో ఏడాది పాటు డ్రైవింగ్‌ చేయొచ్చు.

జర్మనీ:

జర్మనీలో మన భారత లైసెన్స్‌ 6 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. పైగా కార్డుపై ఉండే వివరాలు జర్మనీలోకి తర్జుమా చేసి ఉండాలి. అయితే, ఇది తప్పనిసరేం కాదు.

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అనుమతి ఉంది. న్యూ సౌత్‌ వేల్స్‌, క్వీన్స్‌లాండ్‌, సౌత్‌ ఆస్ట్రేలియా, ది క్యాపిటల్‌ రీజియన్‌, నార్తర్న్‌ రీజియన్‌ వంటి ప్రాంతాల్లో భారత లైసెన్స్‌ మూడు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ గడువు ఏడాది వరకు ఉంది. అయితే, దానిపై వివరాలు ఇంగ్లిష్‌లో ఉండాలి. లేదంటే వాటిని అనువదించుకొని తీసుకెళ్లొచ్చు.

యూకే:

ఏడాది పాటు భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌కు యూకేలో అనుమతి ఉంటుంది. అయితే, కొన్ని రకాల కార్లు, కేటగిరీల వాహనాలను నడపడానికి మాత్రమే అక్కడి ప్రభుత్వం అంగీకరిస్తుంది.

కెనడా:

60 రోజుల పాటు భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌తో వాహనాలను నడిపేందుకు కెనడా అనుమతిస్తోంది. కార్డుపై వివరాలు ఇంగ్లిష్‌లో ఉండాలి. దేశంలోకి ఎప్పుడు ప్రవేశించారో తెలియజేసే పత్రాలు కచ్చితంగా వెంట ఉండాలి.

న్యూజిలాండ్‌:

న్యూజిలాండ్‌లోనూ ఏడాది పాటు భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌తో వాహనాలు నడపొచ్చు. ఈ గడువు దాటిన తర్వాత అక్కడి లైసెన్స్‌ తీసుకోవాలి లేదా ఇంటర్నేషనల్‌ పర్మిట్ పొంది ఉండాలి. కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. వివరాలు ఇంగ్లిష్‌లో ఉండాలి. లేదంటే న్యూజిలాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ నుంచి ఆంగ్లంలోకి అనువాదం చేయించుకునే వెసులుబాటు ఉంటుంది.

భూటాన్‌:

భారత్‌కు భూటాన్‌తో చాలా ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే ఆ దేశం ఇక్కడి డ్రైవింగ్‌ లైసెన్స్‌తో వాహనాలు నడిపేందుకు భారతీయులకు అనుమతి ఇస్తుంది. పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ వంటి పత్రాలు వెంట ఉండాలి. అయితే, భూటాన్‌లో వాహనం నడపాలంటే చాలా అనుభవం ఉండాలి.

వీటితో పాటు ఫ్రాన్స్‌, మలేషియా, సింగపూర్‌, దక్షిణాఫ్రికా, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లోనూ భారత డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అనుమతి ఉంది. అయితే, ఎలాంటి చిక్కులూ రావొద్దంటే మాత్రం ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్‌ ఉండడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వీసా, పాస్‌పోర్ట్‌ సహా ఇతరత్రా పత్రాలను ఎప్పుడూ వెంట ఉంచుకోవడం ఉత్తమం. పైగా విదేశీయానానికి ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి.

Post a Comment

0 Comments