GET MORE DETAILS

తుపాన్లకు పేర్లు పెట్టేందుకూ ఓ విధానం. గాలుల వేగం 61 కి.మీ. ఉంటేనే నామకరణం

తుపాన్లకు పేర్లు పెట్టేందుకూ ఓ విధానం. గాలుల వేగం 61 కి.మీ. ఉంటేనే నామకరణం



తీరం వైపు దూసుకొస్తున్న మిగ్‌జాం తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లను కుదిపేస్తోంది. రెండు రాష్ట్రాలను ఇంతగా వణికిస్తున్న ఈ తుపానుకు మిగ్‌జాం అనే పేరును మయన్మార్‌ సూచించింది. ఈ పేరుకు అర్థం.. బలం, పుంజుకునే శక్తి అని వెల్లడించింది. తుపాన్లకు పేరు పెట్టేందుకు ప్రధాన కారణం.. హెచ్చరికలకు బాగా ఉపయోగపడుతుందనే. అంతేకాకుండా భవిష్యత్తులో ఆ తుపాను నష్టం గురించి చర్చించేందుకూ, పరిశోధకులు అధ్యయనం చేసేందుకు సులువుగా ఉంటుంది. అయితే గంటకు కనీసం 61 కి.మీ. వేగంతో కూడిన గాలులతో తుపానులు సంభవించినప్పుడే వాటికి పేర్లు పెడతారు.

ఎప్పుడు మొదలైంది ?

తుపాన్లకు పేరు పెట్టే సంప్రదాయాన్ని 2000వ సంవత్సరంలో ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఆసియా అండ్‌ పసిఫిక్‌’, ప్రపంచ వాతావరణ సంస్థలు సంయుక్తంగా ప్రతిపాదించాయి. సుదీర్ఘ చర్చల తర్వాత 2004లో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. ఆసియాలో ఏర్పడే తుపాన్లకు హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13 దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి. 2018లో ఇరాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్‌ దేశాలూ ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్‌ తుపాన్లకు ముందే పేర్లను నిర్ణయిస్తుంది. ఈ పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. జాబితాలో మొదటిపేరు బంగ్లాదేశ్‌ కాగా, భారత్‌ది రెండోపేరు. ఉత్తర హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో పుట్టే తుపాన్లకు పేర్లను భారత వాతావరణ శాఖ కేంద్రం ప్రకటిస్తుంది.

మనమూ తుపానుకు పేరు పెట్టొచ్చు..!

భారత్‌ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో తుపాన్లకు సామాన్య ప్రజలూ పేరు సూచించొచ్చు. ఈ పేర్లు అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎవరి మనోభావాలూ గాయపడని విధంగా, చిన్నగా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆసక్తి ఉన్నవారు దిల్లీలో ఉన్న భారత వాతావరణ శాఖకు లేఖ ద్వారా పేరు సూచించవచ్చు.

Post a Comment

0 Comments