ఆహారంతో ఇలా బరువు తగ్గండి..!
చలికాలం రాగానే ఎక్కడ లేని బద్దకం వస్తుంది. ఉదయాన్నే గజ గజ వణికించే చలిలో వ్యాయామం చేసేందుకు చాలా మంది అనాసక్తిగా ఉంటారు. సాయంత్రం కూడా దాదాపుగా ఇదే వాతావరణం ఉంటుంది. దీంతో వ్యాయామం చేయడంలో కొందరు వెనుకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో శరీరంలో అదనపు కొవ్వు చేరి బరువు పెరుగుతారు. అయితే ఏ కాలంలో అయినా వ్యాయామం కచ్చితంగా చేయాల్సిందే. దీంతోపాటు కింద ఇచ్చిన ఆహారాలను ఈ సీజన్లో తీసుకుంటే శరీరంలో అదనపు కొవ్వు చేరకుండా, అధిక బరువు పెరగకుండా కంట్రోల్లో ఉండవచ్చు. మరి ఈ కాలంలో మనం తీసుకోవాల్సిన ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ప్రోటీన్లు:
కండరాలు నిర్మాణం అవాలన్నా, ఉన్న కండరాలకు బలం చేకూరాలన్నా ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తినాలి. దీంతో మనకు శక్తి లభిస్తుంది. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ముఖ్యంగా చికెన్, సీ ఫుడ్, ఎగ్స్, బీన్స్లో ఫ్యాట్ డెయిరీ, సోయా, నట్స్, సీడ్స్ వంటి లీన్ ప్రోటీన్ ఫుడ్ను ఎక్కువగా తినాలి. మటన్ వంటి మాంసాహారం తగ్గించాలి. దీంతో చలికాలంలో బరువు అదుపులో ఉంటుంది.
2. కూరగాయలు:
తాజా క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్, మెంతికూర, పాలకూర వంటి కూరగాయలు, ఆకుకూరలను ఈ సీజన్ లో కచ్చితంగా తినాలి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. సాధారణంగా శీతాకాలంలో వచ్చే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. సీజనల్ ఫ్రూట్స్:
చలికాలంలో యాపిల్స్, జామ, వింటర్ బెర్రీలు ఎక్కువగా మనకు లభిస్తాయి. కనుక వీటిని ఈ సీజన్లో లో బాగా తినాలి. దీంతో అధిక బరువు అదుపులో ఉంటుంది. ఇవి మలబద్దకాన్ని నివారిస్తాయి.
4. నీరు:
చలికాలంలో సహజంగానే దాహం అధికంగా వేయదు కనుక చాలా మంది నీటిని తక్కువగా తాగుతారు. అలా తాగితే బరువు పెరుగుతుంది. కనుక ఏ కాలంలో అయినా రోజూ తగినంత నీటిని తాగితే తద్వారా శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
5. కార్బొహైడ్రేట్లు:
వైట్ బ్రెడ్, బియ్యం వంటి పదార్థాలకు బదులుగా తృణ ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. గుండె సమస్యలను రానివ్వదు. అధిక బరువును తగ్గిస్తుంది.
0 Comments