GET MORE DETAILS

పొట్టుతీయని ధాన్యాలే బలం !

 పొట్టుతీయని ధాన్యాలే బలం !



అధిక బరువు, ఊబకాయం ఈ రెండూ శరీరం మీద తీవ్ర భారం మోపేవే. ఇవి రకరకాల సమస్యలనూ వెంట బెట్టుకు వస్తాయి. గుండెజబ్బులు, పక్షవాతం వంటివి కొందరిలో ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కొవ్వు పదార్థాలు తగ్గించటం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవటం మంచిదని నిపుణులు చాలాకాలంగా సూచిస్తూనే ఉన్నారు. వీటికి తోడు పొట్టు తీయని ధాన్యాలనూ ఆహారంలో చేర్చుకోవటం మంచిదని క్లీవ్లాండ్ క్లినిక్ పరిశోధకులు చెబుతున్నారు. వీటితో గుండెజబ్బు ముప్పు తగ్గుతుండటమే దీనికి కారణం పొట్టు తీయని ధాన్యాలకూ గుండె ఆరోగ్యానికీ సంబంధమేంటని అనుకుంటున్నారా. ఇవి రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుండటమే. కాదు ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడతాయి.

ముఖ్యంగా 50 ఏళ్ల లోపువారిలో మరింత మెరుగైన ప్రభావం చూపిస్తుండటం విశేషం. పాలిష్ పట్టిన, పొట్టుతీసిన ధాన్యాలను తీసుకున్నవారితో పోలిస్తే పొట్టు తీయని ధాన్యాలను తీసుకున్న వారిలో డయాస్టాలిక్ రక్తపోటు మూడు రెట్లు ఎక్కువగా మెరుగు పడుతున్నట్టు తాజాగా బయట పడింది. సాధారణంగా రక్తపోటును సిస్టాలిక్ (పై సంఖ్య), డయాస్టాలిక్ (కింది సంఖ్య).. ఇలా రెండు సంఖ్యలతో సూచిస్తారు. గుండె కొట్టు కున్నప్పుడు రక్తనాళాల లోపలుండే పీడనాన్ని సిస్టాలిక్ అని.. లబ్ బ్మాని కొట్టుకోవటానికి మధ్యలో గుండె కండరం విశ్రాంతి తీసుకునే సమయంలో రక్తనాళాల లోపలుండే పీడనాన్ని డయాస్టాలిక్ అనీ అంటారు. 50 ఏళ్ల లోపు వారిలో డయాస్టాలిక్ రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల – గుండెజబ్బు సంబంధ మరణం ముప్పూ పెరుగుతూ వస్తుంది.

ఈ నేపథ్యంలో పొట్టుతీయని ధాన్యాల ప్రభావంపై క్లీవ్ లాండ్ క్లినిక్ పరిశోధకులు అధ్యయనం చేశారు. వీటితో గుండెజబ్బు మూలంగా సంభవించే మరణం ముప్పు సుమారు మూడింట ఒకవంతు, పక్షవాతంతో తలెత్తే మరణం ముప్పు ఐదింట రెండొంతుల వరకు తగ్గుతున్నట్టు తేలింది. దీనికి ప్రధాన కారణం పొట్టుతీయని ధాన్యాలతో రక్తపోటు తగ్గుతుండటమే! అంతేకాదు.. వీటితో బరువు, కొలెస్ట్రాల్ కూడా తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. ముఖ్యంగా గుండెకు హాని చేసే చెడ్డ కొవ్వు స్థాయులు తగ్గటానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. అందువల్ల ఆహారంలో పొట్టుతీయని ధాన్యాలను చేర్చుకోవటం మంచిదని రోజుకు కనీసం 50 గ్రాముల పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments