GET MORE DETAILS

మన పండుగ ఉగాది - ప్రత్యేకత - వివరణ

 మన పండుగ ఉగాది - ప్రత్యేకత - వివరణ ఏదైనా ఓపనిని కొత్తగా ప్రారంభించేందుకు మంచి రోజేనా? కాదా? అని ఆలోచించే ఓ విధానాన్ని మనకు ముందుగా నేర్పింది బ్రహ్మదేవుడే. ఎందుకంటే ఆయనే సృష్టిని ప్రారంభించడానికి ఏది మంచిరోజు? అని ఆలోచించి, ఒక మంచిరోజున సృష్టిని ప్రారంభించాడు. అదే యుగ ఆది రోజు ఉగాది రోజు, ఈ యుగాది రోజు అన్నివిధాలా మొదటిదై ఎలా మంచి రోజయిందో వివరంగా చూద్దాం! 

'సృష్టి చేద్దా'మనుకోగానే చతుర్ముఖ బ్రహ్మకాలగణనం లోని 60 సంవత్సరాల్లో సంవత్సర ప్రారంభంలోనే సృష్టి చెయ్యాలనుకున్నాడు. కాలంలోని అరవై సంవత్సరాలలోనూ 

మొదటిదైన ప్రభవసంవత్సరంలో ఉత్తరాయణంలో వసంతఋతువులో చైత్రమాసంలో - శుద్ధ (శుక్ల) పక్షంలో పాడ్యమిలో బ్రాహ్మీముహూర్తంలో సృష్టిని ప్రారంభించాడు.

కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి అయిన ఈ రోజు ఈ విధంగా యుగ ఆది రోజు - ఉగాదిరోజు - సర్వప్రథమమైన రోజు ఔతోందన్నమాట.

ఈ రహస్యాన్ని మరచిపోకుండా చేసేందుకే మొట్టమొదటగా కోసిన మామిడి ముక్కలని, మొట్టమొదటిసారి తీసిన వేపపూతతోనూ, మొట్టమొదటగా వండిన బెల్లం తోనూ, మొట్టమొదటగా పిసికిన చింతపండుతోనూ, మొట్టమొదటగా తెచ్చిన ఒకటి రెండు మిరియపు గింజల పొడితోనూ, కలిపి తినే పచ్చడిగా చేసి, భగవంతునికి నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.

ఈ యుగాదిని సృష్టించినవాడు బ్రహ్మ కాబట్టి, పంచభూతాలైన పృథివి-అప్-తేజస్-వాయు ఆకాశాల్లో మార్పును కూడ సృష్టించాడు. ఆయన. అందుకే పృధివి (భూమి)లోని ప్రతి వృక్షమూ కొత్త కొత్త చిగురుటాకుల్ని వేస్తూ, కొత్త చీరల్ని కట్టుకున్న ముత్తైదువల్లా గోచరిస్తాయి.

కృతయుగం వైశాఖ శుద్ధ తదియనాడూ. త్రేతాయుగం కార్తిక శుద్ధనవమినాడూ, ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశినాడూ ప్రారంభంకాగా, కలియుగం మాత్రం చైత్ర శుద్ధ పాడ్యమినాడు. ప్రారంభమైంది.

ఇతిహాసపరంగా...

ఉగాది పండుగ వచ్చే వసంతకాలానికీ ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు నెలల్లో మొదటి రెండూ అయిన చైత్రం, వైశాఖం కలిపి వసంతఋతువు లేదా వసంతకాలం అవుతోంది. అలాంటి ఈ వసంతకాలం ఎంత గొప్పదో ఇతిహాసమైన శ్రీమద్రామా యణం ప్రకారం చూద్దాం!

'చైత్ర శ్రీమా నయం మాసః పుణ్యః పుష్పిత కాసనః'- రాముని పట్టాభిషేకానికి ఈ వసంత కాలమే మంచిదని వశిష్ఠాదిమహర్షులు నిర్ణయించారు. మఱి పట్టాభిషేకం తప్పిపోయింది గదా!' అనుకోకూడదు. పట్టాభిషేకం చెడితే తప్ప రాముడు అరణ్యాలకుపోడు. అలా కాని పక్షంలో సీతాపహరణం లేదు. అది లేనివాడు రావణ వధ సాధ్యం కాదు. అలా కాని రోజున రామునిగా ఆయన అవతారమే వ్యర్థమౌ తుంది. ఇంతటి కష్టమైన పనికి దేవతలంతా ఏ కాలం మంచిది? అని ఆలోచించి అందరూ ఐకమత్యంతో నిర్ణయించిన కాలం వసంతం అందునా చైత్రమాసం!

సీతాపహరణం జరిగింది వసంతకాలంలోనే. రాముడు తనను చంపడానికి రాగలడనే విషయం రావణునికి తెలిసిందికూడా వసంతంలోనే! ఆంజనేయుడు మొదటిసారిగా రామచంద్రుణ్ణి చూచిందీ, అహంకారం పోయి తనకంటే రాముడెంతటి గొప్పవాడో ఆ విషయం సుగ్రీవునికి అర్థమైందీ- రామునిచేతిలో వాలికి మోక్షం లభించిందీ- సీతమ్మకు రాముని వార్తలు మొదటిసారిగా అందిందీ రావణవధ అయ్యాక అయోధ్యలో రామచంద్రుడు పట్టాభిషిక్తు డయిందీ అన్నీ కూడా వసంతకాలంలోనే!

అమ్మవారిక్కూడా ఇష్టమైంది. ఈ కాలమే కాబట్టి, ఈ వసంతకాలంలోనే వసంతనవరాత్రుల పేరిట దసరా ఉత్సవాల్లాగా చేస్తారు. బుద్ధిశక్తి బాగా పెరగడానికి 'చదువుల తల్లి సరస్వతిని బాగా పూజించవలసింది ఈ కాలంలోనే' అంటూ 'వత్సరారంభ సంపూజితా' అనే సరస్వతీ సహస్రనామాల్లోని ఒక నామం కూడా చెప్తుంది.

వైద్యపరంగా...

ఇక ఉగాది పచ్చడిలో షడ్రుచులూ ఉంటాయి. మధుర (తీపి), ఆమ్ల (పులుపు), కటు (కారం), కషాయ (ఒగరు), లవణ (ఉప్పదనం), తిక్త (చేదు) రుచులు ఆఱూ కలిసి ఉంటాయి. తీపిని కలిగించే కొత్తబెల్లం ఆకలిని కలి గిస్తుంది. పులుపునిచ్చే కొత్త చింతపండు కఫవాతాల్ని పోగొడుతుంది. కారాన్ని కలిగించే మిరియపు పొడి శరీరంలోని క్రిముల్ని నాశనం చేయడమేకాక శ్లేష్మ రోగాల్ని దగ్గరకి రానీయదు. వగరు పుట్టించే మామిడి ముక్క లాలాజలాన్ని ఊరించి జీర్ణక్రియకి తోడ్పడుతుంది. ఎముకలని బలపరుస్తుంది ఉప్పు, చేదు కలిగిన వేపపువ్వు చేసే లాభాల్ని ఎన్నింటిని చెప్పినా ఏదో ఒకటి మరిచినట్టే ఔతుందిట. అంత గొప్పది వేపపువ్వు.

వేపచెట్లగాలి. ఆరోగ్యప్రదం. వేపచిగుళ్లు కడుపులోని నులిపురుగుల్ని చంపేసి తిరిగి పుట్ట నీయవు. వందకు వందేళ్లూ జీవించే ఈ చెట్టునుంచి వచ్చిన కల్లు, కుష్ఠువ్యాధిని నివారిస్తుంది. దీని ఆకుల్ని బియ్యంలో గాని, పుస్తకాల మధ్యలో గాని పెడితే పురుగు దరిచేరనే చేరదు. వేపగింజలతో నూనె చేసి శరీరానికి రాసు కుంటూంటే కొంతకాలానికి బొల్లి కూడా నయమౌతుంది.

వేపాకును పసుపు నూనెతో కలిపి ముద్ద చేసి ఒంటికి ప్రతివారాంతంలో రాస్తే ఏ తీరు చర్మ వ్యాధైనా సమసిపోతుంది. వేపపూవుని కోసి, ఎండ బెట్టి పొడిచేసి, ఆ పొడిని, ఎండిపోయిన తులసి చెట్టును కాల్చిన భస్మంతో కలగలిపి తింటే యమ దర్శనం కానేకాదట!

ఉగాది రోజును ఎలా గడపాలి ?

మనం తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు ముగించాక, ఇంట్లో ఉన్న పెద్ద ముత్తైదువ ఆయురారోగ్యా శ్వర్యాలతో ఉండవలసిందని దీవిస్తూ మన మీద అక్షతల్ని వేసి తలకు (మాడు మీద) నువ్వుల నూనెను పెట్టాలి.

ఆ మీదట మనం ఒంటరిగా నువ్వుల నూనెని రాసుకుని, ఒక గంటసేపు నూనెతో నానాక సున్నిపిండితో తలంటు పోసుకోవాలి. నూనెతో నానే సమయంలో వ్యాయామం గానీ, దైవస్తోత్రాలుగాని రెండూగానీ చేసు కోవచ్చు. అభ్యంగన స్నానమయ్యాక నిత్యం మనం చేసుకునే పూజ ముగించుకుని దైవమందిరంలో ఉన్న అక్షతల్ని ఇంట్లో ఉన్న పెద్దవారికిచ్చి, వాళ్లకు పాదాభివందనం చెయ్యాలి. పసుపుబొట్టు పెట్టిన కొత్తబట్టల్ని మనకిస్తూ ఆశీర్వ దించాలి- వాళ్లు. మనం కొత్త బట్టలు కట్టుకుని దేవుడికి అంతకు ముందే నైవేద్యం పెట్టిన వేపపూవు పచ్చడిని ఆరగించాలి.

పంచాంగ శ్రవణం:

సరిగా ఈ సమయానికి గుళ్లోనో లేక మరో ప్రదేశంలోనే పంచాంగ పఠనం ప్రారంభమవుతుంది. సంవత్సరంలో 'మన జీవితం, మనల్ని పరిపాలించే పాలకుల రాజ్యం, మననందరినీ పరిపాలించే ఆ భగవానుని అభి ప్రాయం' ఎలా ఉందో ఆ విషయమంతా దీనిద్వారా తెలుసుకోగలుగుతాం.

మనం చేసిన పాప పుణ్యాల కనుగుణంగా మనకు రావాల్సిన లాభనష్టాల్ని గమ నించిన భగవంతుడు, లాభాల్ని కల్గించేందుకు శుభగ్రహాలనూ, నష్ట పెట్టేందుకు అశుభగ్రహాలనూ నాయ కులుగా నియమిస్తూ కొత్త సంవత్సరాన్ని నిర్మిస్తాడు.

🌺శుభాకాంక్షలు:

ఇంతకీ ఇలా అన్నిటికీ ప్రథమమైన ఉగాదినాడు శుభాకాంక్షలు ఇలా తెలపాలని మన పెద్దలు మనకు చెప్పారు. 'ప్రజలందరికీ సుఖం కలుగుగాక! పరిపాలకులు న్యాయ మార్గంలో పాలింతురు గాక! హోమాలు చేయడానికై పాలనిచ్చే గోవులవల్లా- భూమిని దున్ని పంటనిచ్చే ఎద్దుల వల్లా-ఆవులవల్ల వచ్చే పాలనూ, ఎద్దులవల్ల వచ్చిన ధాన్యాన్నీ యజ్ఞంలో వినియోగించే వేదవేత్త అయిన బ్రాహ్మ ణుని వల్లా దేవతలు తృప్తిపడి సమస్తలోకాలనీ చల్లగా చూతురుగాక! సకాలంలో వర్షాలు పడునుగాక! భూమినిండా అందరికీ సంతానమూ ఉండుగాక! సంపదలేనివారికి సంపదలు కలిగి, దేశమంతా శాంతిమంతమై ఉండుగాక! ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండుదురుగాక! రాజులు నిర్భ యంగా తమ పరిపాలన చేయుదురుగాక!'- అనేవి మహర్షు లిచ్చిన శుభాకాంక్షలు.

పైగా శుభాకాంక్షలనగానే ఉగాది రోజున ఉదయాన్నే లేచి తల్లి దీవెన పొందుతూ మాడు (బ్రహ్మరంధ్రం) పైన నూనె పెట్టించుకుని తల్లికీ తండ్రికీ నమస్కరించి, తలంటుపోసుకుని కొత్త బట్టలు ధరించి దైవదర్శనం చేస్తే, తమ సంతానంమీద ఆ తల్లిదండ్రుల ఆశీస్సులు ఫలిస్తాయి. పిల్లలబుద్ధి వికసిస్తుంది. కూడా! - ఇది ఋషులు చెప్పిన నిజం అనుభవంలో ఉన్న సత్యం!

Post a Comment

0 Comments