వైశాఖ పూర్ణిమ. దీనికి మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది.
సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధామైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది.
వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది.
ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి, అమ్మవారి ఆరాధనకి, శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది.
ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమావ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు.
అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు.
0 Comments