GET MORE DETAILS

ఏఐ అల్లకల్లోలం - పెద్ద ఎత్తున ఊడిపోతున్న ఉద్యోగాలు - భారీగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్న కంపెనీలు

ఏఐ అల్లకల్లోలం - పెద్ద ఎత్తున ఊడిపోతున్న ఉద్యోగాలు - భారీగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్న కంపెనీలు



• ప్రపంచవ్యాప్తంగా నిపుణుల ఆందోళన 

• ముంచుకొస్తున్న సంక్షోభం ముప్పు

పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు.. మనిషి సాధిస్తున్న అద్భుతాలు చివరకు మానవాళి మనుగడకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లేదా ఏఐ) ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ. అవును.. ఐటీ, టెక్నాలజీ ఇండస్ట్రీల్లో ఇప్పుడు ఏఐ దెబ్బకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఊడిపోతున్నాయి మరి. ఇతర పరిశ్రమల్లోనూ ఏఐ ప్రకంపనలకు అవకాశాలు కనిపిస్తుండటం.. ప్రస్తుతం యావత్తు మానవ వనరులను భయపెడుతున్నది.

సాంకేతికత హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో.. కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానం చాటి చెప్తున్నది. మనిషి సృష్టించిన విజ్ఞానం.. చివరకు ఆ మనుషుల పొట్టనే కొడుతున్నది మరి. మార్కెట్‌లో డిమాండ్‌ లేదని కొన్ని.. మా ఆదాయం పడిపోయిందని ఇంకొన్ని.. వ్యయ నియంత్రణ చర్యలు అంటూ మరికొన్ని కంపెనీలు.. ప్రస్తుతం ఉద్యోగుల్ని తొలగించేస్తున్నాయి. కారణం ఏదైనా ఈ మొత్తం దుస్థితికి మూల కారణం మాత్రం ఒక్కటే.. అదే ఏఐ. నిజానికి అప్పుడెప్పుడో వచ్చిన కంప్యూటర్లతోనే జాబ్‌ మార్కెట్‌ రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఏఐ దెబ్బకు మొత్తం తలకిందులవుతున్నది.

ఇదీ సంగతి...

సాధారణంగానే ఏ సంస్థ అయినా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదకతను కోరుకుంటుంది. దీనివల్ల మరింత లాభాలను అందుకోవచ్చు. ఈ క్రమంలో సేవలు, ఉత్పాదక రంగాల్లో యాంత్రిక విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ వచ్చింది కృత్రిమ మేధస్సు. అయితే మానవ ప్రమేయాన్ని ఇది నామమాత్రం చేస్తుండటమే అసలు సమస్య. మానవ వనరులతో పోల్చితే ఏఐ ఆధారిత వనరుల ద్వారా కంపెనీలకు వ్యయం మితం, రాబడి అపరిమితం. ప్రధానంగా కృత్రిమ మేధస్సుతో పనిచేసే యంత్రాలు, రోబోల శ్రమ, పనివేళలకు పరిమితులేవీ ఉండవు. దీంతో ఈ పోటీ ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. పైగా మనుషులతో వచ్చే ఎలాంటి జీతభత్యాల సమస్యలకూ ఆస్కారం ఉండదు. పనికి తగ్గట్టుగా యంత్రాలను వినియోగించుకోవచ్చు. అలాకాకుండా ఉద్యోగుల మీద ఆధారపడితే పని ఎక్కువైతే నియామకాలకు, తక్కువైతే తొలగింపులకు వెళ్లాల్సి వస్తుందని, ఈ వ్యవహారం కంపెనీలను ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తున్నదని మెజారిటీ సంస్థల యాజమాన్యాల మాట.

రిస్క్‌లో 1.15 లక్షల ఉద్యోగాలు

ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఆయా సంస్థలు ప్రకటించిన ఉద్యోగ కోతలు దాదాపు 1.15 లక్షలు. కేవలం జనవరి, ఏప్రిల్‌ నెలల్లోనే 80వేల ఉద్యోగుల్ని తీసేయబోతున్నట్టు కార్పొరేట్‌ కంపెనీలు స్పష్టం చేయడం గమనార్హం. ఇక ఈ జనవరి-మార్చిలో 200లకుపైగా కంపెనీల్లో 50,800 మంది కొలువుల్ని కోల్పోయినట్టు లేఆఫ్స్‌.ఫై గణాంకాలు చెప్తున్నాయి. కరోనా నేపథ్యంలో మొదలైన ఈ ఉద్యోగ కోతలు.. 2022లో తారాస్థాయికి చేరాయని ‘ది చాలెంజర్‌ రిపోర్ట్‌’ అంటున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దదిక్కుగా ఉన్న అమెరికాలో ఏఐ కారణంగా దాదాపు 10 శాతం ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని ఓ ఆర్థిక నివేదిక అంటున్నది. కొత్త నియామకాలను దాదాపుగా నిలిపేస్తున్న కంపెనీలు.. ఉన్న ఉద్యోగుల్లోనూ ఏఐ నైపుణ్యం కలిగినవారికే ప్రాధాన్యాన్నిస్తున్నాయని బ్లూంబర్గ్‌ తాజాగా తెలియజేసింది.

అమెరికాలో భారతీయ విద్యార్థులకు దొరకని ఇంటర్న్‌షిప్‌లు

భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు నిరాశే ఎదురవుతున్నది. అగ్రరాజ్యంలో కనీసం ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లూ దొరకడం లేదు. ఉన్నత విద్యను అభ్యసించి బడా కార్పొరేట్‌ కంపెనీల్లో కొలువులను పట్టాలంటే ఈ ఇంటర్న్‌షిప్‌ చాలాచాలా ముఖ్యం. కానీ ఆర్థిక మందగమనం ప్రభావంతో స్థానికులకే అక్కడి సంస్థలు అవకాశాల్ని ఇస్తున్నట్టు విద్యార్థులు, ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్లు, ఇండో-అమెరికన్‌ ప్రొఫెషనల్స్‌ చెప్తున్నారు. ఈ ఏడాదే అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా ఉండటం.. పరిస్థితుల్ని ప్రభావితం చేస్తున్నట్టు వారు పేర్కొంటున్నారు.

ఇక ద్రవ్యోల్బణం, అధిక జీవన వ్యయం, నిరుద్యోగం, స్పాన్సర్‌షిప్‌ సమస్యలు.. భారతీయ విద్యార్థులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ‘అమెరికా అత్యుత్తమ విద్యా సంస్థలైన ఎన్‌వైయూ స్టెర్న్‌, యూసీ బెర్క్‌లీ, బ్రౌన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వెనియా, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకూ ఈసారి సమ్మర్‌లో ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లు లేవు’ అని ఎడ్యుకేషన్‌ కన్సల్టింగ్‌ కంపెనీ కాలేజీఫై సహవ్యవస్థాపకుడు ఆదర్శ్‌ ఖండేల్వాల్‌ అన్నారు. ‘గత ఆరు నెలలుగా ఎన్నో కంపెనీల్లో దరఖాస్తు చేశాను. అయినా ఫలితం లేదు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ (స్టెమ్‌) విద్యార్థులకూ ఇబ్బందులు తప్పడం లేదు’ అని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌, సైకాలజీలను చదువుతున్న 22 ఏండ్ల ఫైనలియర్‌ గ్రాడ్యుయేట్‌ ఒకరు చెప్పారు. నిజానికి కరోనాకు ముందు స్టెమ్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ల్లో భారీగా అవకాశాలుండేవని సదరు విద్యార్థి అన్నారు.

ఉద్యోగ కోతలకు టాప్‌-10 కారణాలు:

    ▶️ కృత్రిమ మేధస్సు

    ▶️ ఆర్థిక మందగమనం

    ▶️ ద్రవ్యోల్బణం

    ▶️ అధిక వడ్డీరేట్లు

    ▶️ మితిమీరిన నియామకాలు

    ▶️ మదుపరుల ఒత్తిళ్లు

    ▶️ కరోనా పరిణామాలు

    ▶️ బ్యాంక్‌ సంక్షోభాలు

    ▶️ మార్కెట్‌ పరిస్థితులు

    ▶️ అంతర్జాతీయ ఉద్రిక్తతలు

Post a Comment

0 Comments