GET MORE DETAILS

మన ఇతిహాసాలు - భాగవతంలో కృష్ణుడు బకుడిని ఎందుకు సంహరిస్తాడు?

మన ఇతిహాసాలు - భాగవతంలో కృష్ణుడు బకుడిని ఎందుకు సంహరిస్తాడు?



ఒకసారి బృందావనంలోని గోపబాలురందరూ బలరామకృష్ణుల్ని వెంట పెట్టుకుని అడవికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకు ఒక పెద్ద కొంగ కనిపించింది. ఆ బకుడ్ని చూడగానే గోపబాలకులు భయపడి పోయారు. దాని ముక్కు మూరెడు పొడుగుంది. దాని శరీరం బలిష్టంగా వెండికొండ మాదిరి వుంది. అది గభాలున వచ్చి కృష్ణయ్య ముందర వాలి అతడ్ని మింగేసింది. అది చూసి గోపబాలురందరూ పెద్దగా ఏడ్చారు. వారి ఆక్రందన విన్న మహేంద్రుడు ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందనుకుని శస్త్రాస్త్రాలు తీసుకుని అక్కడికి వచ్చాడు. వస్తూనే కొంగ మీదకు తన వజ్రాయుధాన్ని విసిరాడు. అయినా ఆ వజ్రాయుధం బకుడ్ని ఏమీ చేయలేకపోయింది. అది గ్రహించి మహేంద్రుడు బ్రహ్మదండాన్ని ప్రయోగించాడు. బ్రహ్మదండం దెబ్బకు బకుడు మూర్ఛపోయినా మళ్ళీ వెంటనే తేరుకున్నాడు.

ఇంతలో రుద్రుడు వచ్చాడు. ఆయన తన త్రిశూలాన్ని బకుని మీద ప్రయోగించాడు. ఆ త్రిశూలం బకుని శరీరంలో కొంతభాగాన్ని మాత్రమే ఖండించగలిగింది. అది చూసి వాయుదేవుడు తన శక్తిని ప్రయోగించాడు. అయినా బకుడు రవ్వంత కూడా చలించలేదు. ఆ తరువాత కుబేరుడు బకునిమీద తన కత్తిని విసిరాడు. అది వెళ్ళి బకుని శరీరాన్ని మరికొంత మేర ఖండించింది. చంద్రుడు హిమాస్త్రాన్ని సంధించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది.

అగ్నిదేవుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది బకుని రోమాలను మాత్రం భస్మం చేసింది. అది చూసి వరుణదేవుడు తన పాశాన్నీ, కాళి తన గదను బకుని మీదకు విసిరారు. బకుడు అప్పటికీ చలించలేదు.

దేవతలు బకుని శక్తికి ఆశ్చర్యపోయారు. వాళ్ళు చూస్తుండగానే బకుడు అమాంతం ఆకాశానికి ఎగిరాడు. ఎగురుతూ పెనుగాలులు సృష్టించాడు. గాలివిసురుకి దేవతలు భయపడి తలో దిక్కుకీ పారిపోయారు. ఆ సమయంలో దేవతలకు ఏమి చెయ్యాలో పాలుపోక నల్లనయ్యను ప్రార్థించారు. బకుని నోటినుంచి బయటకు వచ్చి తమను కాపాడవలసిందిగా వేడుకున్నారు.

దేవతల మొర ఆలకించి కృష్ణయ్య బకుని పొట్టలో తన శరీరాన్ని పెంచుకున్నాడు. అలా పెరిగి పెరిగి బృహద్రూపం ధరించిన కృష్ణయ్యను బకుడు బరించలేక గిలగిల కొట్టుకొని అతడ్ని బయటకు కక్కేశాడు. ఆ తరువాత బకుడు కూడా శరీరాన్ని పెంచుకుని తన పొడుగాటి ముక్కుతో కృష్ణయ్యను చంపబోయాడు.

అది గ్రహించి కృష్ణయ్య తన రెండు చేతులతోనూ బకుని ముక్కు తుండాలు పట్టుకొని చీపురుపుల్ల మాదిరి చీల్చేశాడు. మరుక్షణం ఆ కొంగ మాయమైపోయింది. దానిస్థానంలో ఒక రాక్షసుడు రెండుగా చీలిన శరీరంతో కనిపించి గిలగిల తన్నుకుని ప్రాణం వదిలాడు.

ఇంతకీ ఆ బకుడెవరంటే.... పూర్వజన్మలో హయగ్రీవుని కుమారుడైన ఉత్కలుడు. ఆ ఉత్కలుడు దేవతలను అమితంగా వేధించేవాడు. ఒకసారి ఉత్కలుడు జాజుల మహర్షి ఆశ్రమప్రాంతంలోవున్న మడుగులో ప్రవేశించి చేపల్ని పట్టుకున్నాడు. అది జాజలుడు చూసి 'నీ ప్రతాపం చూపించడానికి ఈ మీనాలే దొరికాయా' అన్నాడు. ఉత్కలుడు బదులివ్వలేదు. జాజల మహర్షికి కోపం వచ్చి 'నువ్వు బకుడివై పుడతావు' అని శపించాడు. జాజలుడు సామాన్యుడు కాదు. ఆరువేల సంవత్సరాలు తపస్సు చేసిన మహానుభావుడు. జాజల మహర్షి శాపానికి గురైన ఆ ఉత్కలుడే బకుడై పుట్టడం, బృందావనం దగ్గర అడవిలో చరిస్తూ వుండటం, కాలక్రమాన శ్రీకృష్ణుని స్పర్శచేత ముక్తి పొందడం జరిగింది.

Post a Comment

0 Comments