2040లో జాబిల్లిపైకి మన వ్యోమగాములు: ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా 2040కల్లా జాబిల్లిపైకి భారతీయ వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, 2027 తొలి త్రైమాసికంలో మానవసహిత గగన్‌యాన్ యాత్ర ఉంటుందని చెప్పారు. అంతకుముందు మూడు మానవరహిత గగన్‌యాన్ యాత్రలు పూర్తిచేస్తామని తెలిపారు. వాటిలో మొదటిది ఈ ఏడాది డిసెంబరులో జరుగుతుందని చెప్పారు. ఈ యాత్రలో వ్యోమమిత్ర అనే రోబోను పంపుతామని, శుక్ర గ్రహ పరిశీలనకు వీనస్ ఆర్బిటల్ మిషన్ కూడా చేపడతామని తెలిపారు. 2035కల్లా భూకక్ష్యలో భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తామని చెప్పారు. అంతరిక్ష రంగంలో భారత్ చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలనిస్తున్నాయని వివరించారు. కొన్నేళ్ల క్రితం ఒకటీ రెండు అంతరిక్ష అంకుర సంస్థలు మాత్రమే ఉండగా, ఇప్పుడవి 300కు చేరుకున్నాయన్నారు. శ్రీహరికోట నుంచి 100 రాకెట్లను ప్రయోగించిన ఇస్రో అక్కడ మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి పొందిందని తెలిపారు.
0 Comments