చెక్కు క్లియరెన్స్ ఇక గంటల్లోనే... రేపటినుంచే అమల్లోకి
ఇంటర్నెట్ డెస్క్: సాంకేతికత అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ వ్యవస్థలో కాలక్రమంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఫోన్ సాయంతో క్షణాల్లోనే నగదు పంపుకొనే వెసులుబాటు లభించింది. మొబైల్ అప్లికేషన్ కారణంగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరమే దాదాపు తప్పింది. కానీ, చెక్కు విషయంలో మాత్రం ఆ ఆలస్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏదైనా చెక్కు క్లియర్ అవ్వాలంటే ప్రస్తుతం రెండ్రోజుల సమయం పడుతోంది. ఇకపై ఈ సమయం గణనీయంగా తగ్గనుంది. అక్టోబర్ 4 నుంచి కొన్ని గంటల్లోనే చెక్కు క్లియర్ కానుంది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు శనివారం నుంచి దీన్ని అమలు చేయనున్నాయి.చెక్కులు క్లియర్ చేయడానికి అయ్యే సమయాన్ని గంటల వ్యవధిలోకి తగ్గించేందుకు ఆర్‌బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో చెక్కు సమర్పించిన గంటల వ్యవధిలోనే క్లియర్ అవుతుంది. ఈ విధానంలో వ్యాపార వేళల్లో చెక్కుల స్కానింగ్, సమర్పణ, క్లియరింగ్ అనేవి నిరంతరాయంగా సాగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు చెక్కులు సమర్పించవచ్చు. సాయంత్రం 7 గంటల్లోపు క్లియర్ అవుతాయి. అంటే చెక్కు ఉదయం డిపాజిట్ చేస్తే అదే రోజు సాయంత్రానికల్లా నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ అయిపోతుంది. సంబంధిత చెక్కును ఆమోదించడమో, తిరస్కరించడమో ఏదైనా సరే సాయంత్రం ఏడుకల్లా జరిగిపోవాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది.మొత్తం రెండు దశల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఫేజ్-1లో భాగంగా సాయంత్రం 7 గంటల్లోపు గడువు నిర్దేశించగా.. ఫేజ్-2లో కేవలం మూడు గంటల్లోనే చెక్కు క్లియర్ చేయాల్సి ఉంటుంది. 2026 జనవరి 3 నుంచి రెండో దశ ప్రారంభమవుతుంది. అంటే బ్యాంకు పనివేళల్లో ఎప్పుడు చెక్కు సమర్పించినా మూడు గంటల వ్యవధిలోనే బ్యాంకు ఖాతాలో నగదు జమవుతుంది. అంటే ఉదయం 10 గంటలకు చెక్కు సమర్పిస్తే మధ్యాహ్నం ఒంటిగంటకల్లా దాన్ని బ్యాంకులు క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం మునుపటిలా రోజులతరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పుతుంది.
0 Comments