కార్తీక వన భోజనాల్లో శాస్త్రం ఏం చెప్పింది? మనమేం చేస్తున్నాం?ఎందుకు మనకు పుణ్యం రావడం లేదు? పుణ్యం బదులు పాపం రావడానికి గల కారణం ఏమిటి?
1. శాస్త్రం ఏం చెప్పింది?
నైమిషారణ్యంలో శౌనకాది మునులంతా కలిసి కార్తీక పౌర్ణమి నాడు వారితో తెచ్చుకున్న తులసి చెట్టును, ఉసిరి చెట్టును ఉంచి వాటి మధ్యలో విష్ణు భగవానుడిని విగ్రహాన్ని ఉంచి వనభోజనాలు ఏర్పాటు చేసి, తులసిదళాలతో, ఉసిరికాయలతో, పూలను సమర్పించి భక్తితో పూజించారు. సాయంత్రం దాకా హరి నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంతో మునిగిపోయారు.
🔹మనమేం చేస్తున్నాం...
వనభోజనాలంటే మనధృష్టిలో పిక్నిక్ కదా, కాబట్టి రెండు చాపలు, రెండు దిండ్లు, రెండు దుప్పట్లు, ఒక ఢేషా నిండా పులిహోర, గిన్నె నిండా గారెలు కారు డిక్కీలో పెట్టి, దారిలో స్వీట్ షాపు కనిపిస్తే 10 లడ్డులు, 10 జాంగ్రీలు, భోజనం అయ్యాక తినడానికి స్వీట్ కిళ్లీలు సంచిలో సద్దేసి, ఊరి చివర ఉన్న పార్కులో ఒక మూలన, జనాలంతా తుపు తుపూ అని ఉమ్మేసిన చోట చాపలు పెరిచేసి, “ఇక మొదలెడదామా” అంటూ గిన్నెల్లోని ఆయుధాలను బయటకి తీస్తాం.
2. శాస్త్రం ఏం చెప్పింది?
వన భోజనం కూడా యజ్ఞంతో సమానం కాబట్టి, మునులు, రాజులు సాంప్రదాయ దుస్తులతో లక్ష్మీ నారాయణులను పురుషసూక్త, శ్రీసూక్తాలతో పూజించారు.
🔹మనమేం చేస్తున్నాం...
పంచె సంగతి దేవుడెరుగు, ప్యాంట్ కూడా లేకుండా, అదేదో 3/4th షాట్ అంటూ, చినిగిపోయిన జీన్స్, వెనుకభాగమంతా కనిపించే రవికలు, మెడనిండా ఆభరణాలు ధరించి పార్కులో ఫోటో షూట్ కోసం సిద్ధమయ్యాం.
3. శాస్త్రం ఏం చెప్పింది?
అటు పిమ్మట విష్ణువుకు సమర్పించిన తులసి తీర్థాన్ని భక్తితో స్వీకరించారు సూత మహర్షి వంటి మునులు.
🔹మనమేం చేస్తున్నాం?
గంట క్రితం తెచ్చిన 2 లీటర్ల ThumsUp బాటిల్లను ఓపెన్ చేసి, ప్లాస్టిక్ డిస్పోజబులు గ్లాసుల్లో పోసి, మధ్య మధ్యలో మంచింగ్ మాదిరిగా Lays చిప్స్ ప్యాకెట్లను ఆవురావుర మంటూ పొట్టలోకి పంపించేసాం.
4. శాస్త్రం ఏం చెప్పింది?
సూతుడు కార్తీక పురాణాన్ని, విష్ణు మహిమలను, శివకేశవ ప్రాసస్థ్యాన్ని, అంబరీషోపాఖ్యాన్ని వివరిస్తుండగా మునులంతా పరమ భక్తితో వింటూ ఉండగా సమయం గడిచిపోయింది.
🔹మనమేం చేస్తున్నాం...
ఇక అసలు పని మొదలు పెడదాం. ఆడవాళ్లంతా ఒకచోట చేరి సంవత్సరం క్రితం నుంచి ఈ రోజు ఉదయం దాకా ఏం జరిగాయో, ఇంట్లో ఏం జరిగిందో, ఆఫీసులో ఏం జరిగుతుందో, ఏ సీరియల్ లో ఎన్ని ఎపిసోడ్లు జరిగాయో చక్కగా చర్చించుకున్నాం. మగవాళ్లంతా మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి YouTube లో కొన్ని వీడియోలు చూసేసి, అది బోరు కొడితే Ludo, హౌసీ గేమ్ లను ఆడేసుకున్నాం.
5. శాస్త్రం ఏం చెప్పింది?
శ్రీమన్నారాయణుడికి సమర్పించిన సాత్విక ప్రసాదాన్ని మునులు, రాజులంతా భక్తితో స్వీకరించారు.
🔹మనమేం చేస్తున్నాం...
మనం తెచ్చుకున్న టిపిన్లన్నీ ఖాళీ అయిపోయాయి కాబట్టి, పార్కులో సమోసాలు, టీలు అమ్మేవాడిని పిలిచి, వాటిని కూడా ఒక పట్టు పెట్టేసాం.
6. శాస్త్రం ఏం చెప్పింది?
కార్తీక మాసం కాబట్టి మునులు, రాజులంతా, విష్ణు సన్నిధిన కార్తిక దీపాలను వెలిగించి, “ఓం శ్రీ తులసీ, ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః” అంటూ స్వామిని దీపాలతో పూజిస్తూ, పేదవారికి ఉసిరి దీపాలను దానం చేసారు.
🔹మనమేం చేస్తున్నాం...
అరెరే వన భోజనాల సమయంలో మనతోపాటే వేంకటేశ్వరస్వామి పటం, రెండు దీపాలు తెచ్చుకొని ఉంటే బాగుండేదే, ఏంటో ఏది గుర్తుండదు ఈ మనిషికి అంటూ ఆడవాళ్లమీద మగవాళ్ళు, మగవాళ్ళ మీద ఆడవాళ్లు రుసరుసలాడుతూ, ఫ్లాస్క్ లో మిగిలిపోయిన కాసిన్ని టీ చుక్కలు తాగేసి, అలసిపోయి కాసేపు చెట్టు కింద పడుకొని నిద్రపోయాం.
7. శాస్త్రం ఏం చెప్పింది?
అటుపిమ్మట మునులు, రాజులు తమ తమ శక్తికొలది బంగారం, వెండి, రత్నాలను పేదవారికి, పేద బ్రహ్మణులకు శ్రీహరిని స్మరిస్తూ దానం చేసారు.
🔹మనమేం చేస్తున్నాం...
“డబ్బులేమీ ఊరికే రావు” అని ఒక పెద్దాయన లలితా జ్యువెలరీ Ad లో చెప్పినట్టు పేదవాడికి డబ్బులు దానం చేయడానికి మనసు రాదు. అయినా కార్తీక మాసంలో దానం చేయడం విష్ణువు ప్రీతి చెందుతాడని శాస్త్రం చెబుతుంది కాబట్టి, అటుపక్కన వెళ్తున్న భిక్షకుడిని పిలిచి, జేబులోనుంచి ఒక్కరూపాయి బిల్ల తీసి, అదేదో మన ఆస్తి అంతా రాసిచ్చినట్టు, “పోరాపో, పండగ చేసుకొపో” అంటూ గర్వంగా ఫీల్ అయిపోయాం.
8. శాస్త్రం ఏం చెబుతోంది?
చీకటి పడుతుండగా శౌనకాది మహామునులంతా హరి నామ సంకీర్తనలతో, నృత్యాలు చేసుకుంటూ కాలాతిక్రమణ కూడా లెక్కజేయకుండా ఈశ్వర సేవయందు తన్మయులై హరి సన్నిధిన రాత్రంతా కాలం గడిపారు.
🔹మనమేం చేస్తున్నాం...
రాత్రికి ఇంటికి వెళ్లి వంట చేసుకోవాలి కాబట్టి తట్ట, బుట్ట సద్దుకొని, ఇంటికి చేరి, వనభోజనాల సమయంలో(పార్కులో) తీసుకున్న రకరకాల ఫోటోలను WhatsApp status, Insta, Facebook లో పెట్టి, మన ఫోటోలను చూసి బంధువులు, స్నేహితులు మనమేదో యజ్ఞం చేసినట్లు ఫీలయై పోయి రాత్రి 11 దాకా కాల్స్ చేస్తుంటే కాలాతిక్రమణ అయినా లెక్కచేయకుండా రోజును గడిపేసాం.
9. శాస్త్రం ను పాటించిన వారికి ఏం వచ్చింది?
విష్ణు ఆరాధన, హరినామ స్మరణ, ఉసిరి, తులసి పూజ, దీపాలంకరణ, కార్తీక పురాణ శ్రవణం చేత మునులు, రాజులందరూ అపారమైన సిరిసంపదలు పొందారు, విష్ణు సాయుజ్య మోక్షాన్ని పొందారు. పూర్ణాయుస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం, జ్ఞానాన్ని పొందారు. ఎవరెవరు ఏమేమి కోరుకున్నారో అన్ని సిద్ధులను పొందారు.
🔻మనమేం పొందుతున్నాం...
మనమెళ్ళింది వనభోజనాలకు కాదు, పిక్నిక్ కి కాబట్టి పుణ్యం రాకపోగా మన పుణ్యమే ఖర్చయి పోయింది. సిరిసంపదలు కలగకపోగా పెట్రోల్ ఛార్జీలు, స్నాక్స్ లకు డబ్బులు ఖర్చయి పోయాయి. ఆరోగ్యం రాకపోగా పార్కులో అడ్డమైన గడ్డి తినడం వలన అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. చివరికి మనకేం మిగిలిందంటే వాట్సాప్ స్టేటస్ లో కొన్ని ఫోటోలు, కొన్ని జ్ఞాపకాలు.
ఇదే మన “నవ భోజనాలు”. క్షమించాలి “వన భోజనాలు"

0 Comments