అనాథ పిల్లలకు జీవనాడిగా టిటిడి ఎస్వీ బాలమందిరం
తిరుమల తిరుపతి దేవస్థానముల (టిటిడి) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) బాలమందిరం అనాథ పిల్లల జీవితాల్లో ఆశ, వెలుగులు నింపుతూ ఒక నిజమైన జీవనాడిగా నిలుస్తోంది. విద్య, వసతి, ఆహారం, ఆరోగ్య సంరక్షణతో పాటు సాంస్కృతిక, నైతిక విలువలను అందిస్తూ సమాజంలో ఆదరణకు దూరమైన పిల్లలకు ఒక సురక్షితమైన భవిష్యత్తు దిశను చూపిస్తోంది.
1943లో ఎస్వీ అనాధాశ్రమంగా ప్రారంభమైన ఈ సంస్థ, అనాథ పిల్లలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన వికాసాన్ని అందించాలనే లక్ష్యంతో 1961లో అప్పటి ప్రధానమంత్రి చాచా జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఎస్వీ బాలమందిరంగా నామకరణం చేశారు. 2014లో ఈ ఎస్వీ బాలమందిరాన్ని శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ పరిధిలోకి టిటిడి తీసుకొచ్చింది.
ప్రారంభంలో పరిమిత సంఖ్యలో పిల్లలతో ప్రారంభం
2003 నాటికి సంవత్సరానికి 300 మంది, 2005లో 500మంది విద్యను అభ్యసించేలా సీట్ల సంఖ్యను పెంచారు.
2025–26 విద్యా సంవత్సరంలో ఎస్వీ బాలమందిరంలో 100 మంది బాలికలు, 143 మంది బాలురు, పదో తరగతి అనంతరం టిటిడి, ఇతర ప్రైవేట్ కళాశాలలో బాలురు 56, బాలికలు 49 టిటిడి సంరక్షణలో విద్యను అభ్యసిస్తున్నారు. ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత వసతి, ఉచిత వైద్యం, పూర్తి భద్రతతో పాటు ఉన్నత విద్యకు ఆర్థిక సహకారం అందిస్తూ ఎందరో అనాథ పిల్లల భవిష్యత్తుకు ఎస్వీ బాలమందిరం బలమైన పునాదిగా నిలుస్తోంది.
ఎంపిక విధానం
హిందూ మతానికి చెందిన 5 ఏళ్లు నిండిన, 10 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలను మూడు కేటగిరీలుగా ఎంపిక చేస్తారు.
ఏ కేటగిరి: తల్లిదండ్రులు లేని పిల్లలకు మొదటి ప్రాధాన్యం
బీ కేటగిరి: తల్లి లేదా తండ్రి లేని పిల్లలు
సీ కేటగిరి: పేద వర్గాలు, తల్లిదండ్రులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న లేదా మానసిక వైకల్యం, వికలాంగత కలిగిన వారి పిల్లలు
టిటిడి జారీ చేసే నోటిఫికేషన్ ఆధారంగా సంరక్షకులు దరఖాస్తు చేసుకుంటే, నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది.
విద్య & వసతులు
ఎంపికైన పిల్లలను 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఎస్వీ ప్రాథమిక పాఠశాలలో, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు శ్రీ గోవిందరాజ స్వామి ఉన్నత పాఠశాలలో చేర్పిస్తారు. బాలమందిరంలో పిల్లలకు ఉదయం పాలు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించబడుతుంది. 10వ తరగతి పూర్తయ్యాక బాలురను ఎస్వీ జూనియర్ కాలేజీలో, బాలికలను ఎస్వీడబ్ల్యూ జూనియర్ కాలేజీలో చేర్పిస్తారు. విద్యార్థులకు స్టేషనరీ, దుస్తులు, కాస్మోటిక్స్ వంటి మౌళిక అవసరాలను టిటిడి ఉచితంగా అందిస్తోంది. విద్య, వసతి, వైద్యం, భద్రత వంటి అన్ని సౌకర్యాలు టిటిడి ఉన్నతాధికారులు, ఎస్వీ బాలమందిరం అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడతాయి.
కార్పోరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్య
డిసెంబర్ 4, 2025న టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధ్యక్షతన జరిగిన శ్రీ ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్ సమావేశంలో, 10వ తరగతిలో 75 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పోరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్య అందించాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎస్వీ బాలమందిరంలో చదివిన పలువురు విద్యార్థులు ఎస్.ఎస్.సిలో 600కి 580 పైగా మార్కులు, ఇంటర్మీడియట్‌లో 1000కి 982 మార్కులు సాధించి ప్రతిభను చాటుకున్నారు. మరింత నాణ్యమైన విద్య అందించేందుకు టిటిడి పటిష్ట చర్యలు చేపడుతోంది.
ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు
టిటిడి ఎస్వీ బాలమందిరంలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు ఉన్నత విద్య అనంతరం టిటిడిలో పలు ఉన్నత హోదాల్లోను, ఐటీ రంగంలో, మెడికల్, ప్రభుత్వ ఉద్యోగులు తదితర రంగాల్లో స్థిరపడ్డారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో అవకాశాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి ప్రముఖ వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎస్వీ బాలమందిరం విద్యార్థులకు టిటిడి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తోంది.
అడ్మిషన్లు – దరఖాస్తు విధానం
ఎస్వీ బాలమందిరంలో ఆయా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న అడ్మిషన్ల కోసం తెలుగు, ఇంగ్లీషు పత్రికలలో టిటిడి నోటిఫికేషన్ జారీ చేస్తారు . దరఖాస్తుదారులు తెల్ల కాగితంపై వివరాలు రాసి, కింది ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జత చేయాలి.
జనన తేదీ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, సంరక్షకుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆరోగ్య ధ్రువీకరణ పత్రం, సంరక్షకుల అఫిడవిట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్థున సంరక్షకుల ఫోటోలు, సెల్ నంబర్ లతో దరఖాస్తులను ఈ క్రింది చిరునామాకు పంపాలి.
చిరునామా:
సహాయ కార్యనిర్వహణాధికారి,
శ్రీ వేంకటేశ్వర బాలమందిరం,
టి.టి.డి, భవానీనగర్, తిరుపతి
చిరునామాకు స్వయంగా లేదా పోస్టు ద్వారా అందజేయవచ్చు. ఇతర వివరాలకు 0877–2264613 నంబరులో సంప్రదించవచ్చు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
.jpeg)
0 Comments