GET MORE DETAILS

వేతనం' ఆగిపోవద్దు : ఇన్కం రిప్లేస్మెంట్ టర్మ్ ప్లాన్.

 వేతనం' ఆగిపోవద్దు : ఇన్కం రిప్లేస్మెంట్ టర్మ్ ప్లాన్.



టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారుడు మరణిస్తే, పాలసీ విలువను బట్టి, నామినీకి రూ. 50 లక్షలు, రూ. కోటి లేదా అంతకు మించి చేతికి అందుతాయి. కానీ, ఇక్కడే ఒక చిక్కు ఉంది. పెద్ద మొత్తంలో డబ్బు వస్తే ఏం చేయాలో కుటుంబ సభ్యులకు తెలియకపోతే? సరైన అవగా హన లేకుండా ఎక్కడైనా తప్పుడు పెట్టుబడులు పెడితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి భయాలు లేకుండా చూసేదే 'ఇన్కం రిప్లేస్మెంట్ టర్మ్ ప్లాన్.

ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల లాభాలేమిటో తెలుసుకుందాం.

ఏమిటిది?

సాధారణ టర్మ్ పాలసీలో క్లెయిం మొత్తాన్ని బీమా కంపెనీ ఒకేసారి నామినీకి చెల్లిస్తుంది. కానీ, ఇన్కం రీప్లేస్మెంట్ పాలసీ పనిచేసే విధానం భిన్నంగా ఉంటుంది.

‣బీమా మొత్తాన్ని ఒకేసారి కాకుండా, నెలవారీ వేతనంలా కొన్నేళ్లపాటు నామినీకి చెల్లిస్తారు.

‣ పాలసీదారుడి మరణానంతరం ఆగిపోయిన 'జీతాన్ని' ఇది భర్తీ చేస్తుంది. కాబట్టి, దీన్ని ఆదాయ భర్తీ పథకంగా పిలుస్తుంటారు.

రకాలున్నాయి...

పూర్తి నెలవారీ ఆదాయం: అంటే బీమా పరి హారం మొత్తం పూర్తిగా నెలవారీ వాయిదాల్లోనే అందుతుంది.

ఏకమొత్తం, నెలవారీ ఆదాయం: ఉదాహరణకు రూ. కోటి పాలసీ ఉందనుకుందాం. పాలసీదారుడు మరణించిన సందర్భంలో రూ.50 లక్షలు ఏకమొత్తంగా చెల్లిస్తుంది. మిగతా 50 శాతం 10-15 ఏళ్లపాటు నెల వారీ ఆదాయంగా ఇస్తుంది. అప్పులు తీర్చేందుకు ఏక మొత్తం, ఇంటి ఖర్చుల కోసం నెలవారీ ఆదాయం.. ఈ విధంగానూ పాలసీని ఎంచుకోవచ్చు.

పెరిగే ఆదాయం: కాలక్రమేణా ద్రవ్యోల్బణ ప్రభావంతో ధరలు పెరుగుతుంటాయి. దానికి తగ్గట్టుగా ఆదాయం ఉండాలి.. కాబట్టి, ఏటా వచ్చే మొత్తాన్ని 5 లేదా 10 శాతం పెరిగే విధంగానూ పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. ఉదా.. మొదటి ఏడాది నెలకు రూ.50 వేలు వస్తే, రెండో ఏడాది రూ.55,000, మూడో ఏడాది రూ.60,000 ఇలా పెరుగుతూ వెళ్తుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇది సరైన మార్గం.

ఎలా పనిచేస్తుంది?

ఉదాహరణకు ఒక వ్యక్తి రూ. కోటి విలువైన ఇన్కం రిప్లేస్మెంట్ టర్మ్ ప్లాన్ తీసుకున్నారనుకుందాం. దురదృష్టవశాత్తూ అతను/ఆమె మరణిస్తే.. బీమా కంపెనీ ఆ రూ. కోటిని ఒకేసారి నామినీకి ఇవ్వదు. దానికి బదులుగా రాబోయే 10 లేదా 15 ఏళ్లపాటు నెలకు నిర్ణీత మొత్తాన్ని అందిస్తుంది. పాలసీ తీసుకునేప్పుడే ఎంత చెల్లించాలి అనేది పాలసీదారుడు నిర్ణయించు కోవాల్సి ఉంటుంది.

ఎవరికి?

‣ ఆర్ధిక అవగాహన లేకపోతే కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో డబ్బును నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంట ప్పుడు టర్మ్ పాలసీలో ఈ విధానాన్ని ఎంచుకోవడం మేలు.

‣ ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, నిత్యావసరాల వంటి నెలవారీ ఖర్చులకు ఏ ఇబ్బందీ ఉండదు.

‣ ఒకేసారి చేతికి డబ్బు వస్తే తెలిసీ, తెలియక ఖర్చు చేసే ప్రమాదం ఉంది. నెలనెలా వస్తే ఆ అవకాశం ఉండదు.

‣ మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు ఎలా ఉన్నా.. బీమా కంపెనీ నెల నెలా హామీ ఇచ్చిన ఆదాయాన్ని ఇస్తుంది. కాబట్టి, ఇబ్బంది ఉండదు.

Post a Comment

0 Comments