మాఘ పురాణం : 26 వ అధ్యాయము. పుణ్యక్షేత్రములలో నదీస్నానము
ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్టులవారు వివరించగా, ఆరాజు"మహర్షి!మీ కృపవలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని,కాని మరొక సంశయము నాకు గలదు,అది ఏమనగా, మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిం"డని వినమ్రుడై కోరగా వశిష్టులవారు మరల యిట్లనిరి,దిలీప మహారాజా! మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను,శ్రద్దగా ఆలకింపుము, మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది, మాఘస్నానములు చేయలేక, తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము, ఏలననగా మాఘమాసములో యే నదిలోని నీరైనను గంగ నీటితో సమానము, అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది, ఆవశ్యమైనది కూడా, అటులనే ప్రయాగ అతిముఖ్యమైన క్షేత్రం, ఈభరత ఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన యేడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును, మాఘమాసములో నదీస్నానముతో బాటు, విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.
ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రం కలదు, ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది,అచటనే పవిత్ర గోదావరి నది జనించినది,గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుట కిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప జేసినాడు,కావున మాఘమాసములో గోదావరియందు స్నానము చేసిన యెడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే గాక, ఇహమందు,పరమందు కూడా సుఖపడుదురు, మన దేశములో యెన్నో నదులున్నవి,ప్రతి నదీతీరమున యెన్నో క్షేత్రములున్నవి, ఆనదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగావున్నవి. అటువంటి కొన్నిపేరు స్మరించినచో, ఆనదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును, అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము, నందిని,మందాకిని, నళిని,తామ్రవర్ణి,భీమరధి, గంగా,యమున,నేత్రావతి, పంపానది,కృష్ణవేణీ, మహేద్రతనయ,గోదావరి, నర్మదా మొదలైనవి, మహానదులు,భగీరధి,గంగ, నర్మద,యమున,సరస్వతి, కృష్ణవేణీ,బాహుద, భీమరధి,తుంగభద్ర, రేణుక,మలావహరి,కావేరి, క్పతమాల,తామ్రపర్ణి, విశోక,కేశికి,గండకి, విచిత్రక,వశిష్ఠప్రవర, కాశ్యపి,సరయు, సర్వపాపహరి,కుశాపతి, పల్గుని కరతోయ,పుణ్యద, ప్రణిత మొదలైనవి పుణ్యనదులు, మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి, పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యము నందించునని, మహానదులు, పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ, యమున మొదలైన నదులు, మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును, ఈనదులలో చేసిన స్నానం విశేషఫలప్రదం,మనము ఆనదులలో స్నానము చేయలేకపోయినను, పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా,ఈ స్మరణ వలన ఆ నదులను, ఆనదీతీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా, గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్దములగు ఉపనదులు కూడా కలసి తమతమ స్నేహసౌభ్రాతృత్వములను చాటుచున్నవి,అటులనే "వరం తప"అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు,దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు,ఆక్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు, ఇందుకొక ఇతి వృత్తము గలదు,సావధానుడవై ఆలకింపుము.
విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును,ఈశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి,ఈశ్వరునికి పంచరుద్రుదు,త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించెను,ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను, కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదుతలలను నరికి వేసెను,వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది,శివుడు భయపడి,తాను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలోవున్న బ్రహ్మతల యెండిపోయి పుర్రెగా అయినది,ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు,అతడు భిక్షాటనకు వచ్చి "భిక్షాందేహీ"యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి, ఈవిచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక, అతనికి"పురుషత్వము నశించునుగాక"అని శపించిరి,ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆలింగమునందే ఐక్యమయి పోయినాడు, అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆలింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను,కోటి సూర్యుల తేజస్సు కలిగి, ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను,అప్పుడు బ్రహ్మ , విష్ణువులు,శివుని,వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి, ఆవిధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటినుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆలింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.
.jpeg)
0 Comments