GET MORE DETAILS

మాఘ పురాణం - 29 వ అధ్యాయము. మృగశృంగుని కథ

మాఘ పురాణం - 29 వ అధ్యాయము. మృగశృంగుని కథ



వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను,దిలీపమహారాజా వినుము,పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు, అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయవలెనని తల్లిదండ్రుల అనుమతి నొంది  ఇంటి నుండి బయలుదేరెను, మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరి తీరమును చేరెను, మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను.  శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలేనను సంకల్పము కలిగెను, అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను,వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. 

మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను, శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. "నాయనా!నీవు అనేక పర్యాయములు మాఘమాసస్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును,నా ప్రేమను సాధించితివి. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది,వరమును కోరుకొమ్మనెను". మృగశృంగుడును "స్వామీ !నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను, ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున  యీ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను". శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.

కౌత్సుడు ఇంటికి తిరిగివచ్చెను,వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి, కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను, అనుకూలతకల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి,ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును, ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను,వారును అతని ఆలోచనను మెచ్చిరి.

భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండేను. వానికొక కుమార్తె కలదు,ఆమె పేరు సుశీల,ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు, కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన ఇద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీస్నానమునకు బయలుదేరినది. ఆసమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను, అప్పుడు సుశీల, ఆమె మిత్రురాండ్రును బెదిరిపారిపోవుచు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి,కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను. చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆశరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండేను, మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను, తటాలున వానియెదుట తలవంచి వానిని తోండముతో తన మీదకు యెక్కించుకొన్నది, కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను,రెండు చేతులతో దానిని స్పృశించెను,వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను, శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు బోయెను.

కౌత్సుడును చనిపోయినవారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజు నుద్దేశించి తపము చేయసాగెను, యముడును వానికి ప్రత్యక్షమయ్యెను,వరము నిత్తును కోరుకొమ్మనెను, మృగశృంగుడును(కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను, దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను, యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను, మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపముచేతను, యముని దయవలన, సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి, వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి,సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి,వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి,జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును, భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు,పాపము చేసిన వాడు యెఱ్ఱగాకాలిన ఇనుపస్తంభమును కౌగిలించు కొనవలయును, మరుగుచున్న నూనెలో, పాపముచేసిన వానిని పడవేయుదురు, తలక్రిందుగ వ్రేలాడదీసి క్రిందమంటలను పెట్టుదురు,ఎఱ్ఱగా కాల్చివానితో వాతలు పెట్టుదురు, భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.

వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరును భయపడిరి,అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు, మాఘమాసస్నానము చేసి, ఇష్టదైవమును పూజించి, యధాశక్తి దానము,జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి,ఇట్లు పలుకుచున్న వశిష్టమహర్షిని దిలీపుడు గురువర్యా! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత?చనిపొయిన వారు మరల బ్రతుకుటకు వీలగునా యని ప్రశ్నించెను,అప్పుడు వశిష్టమహర్షి నాయనా! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు, పుణ్యమును కలిగించు మాఘస్నానమును,సుశీల మున్నగువారు అనేకమార్లు చేయుటవలన వారు సంపాదించిన పుణ్యము, కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని యీ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా ఇట్టిదే మరొక్క విషయము కలదు వినుము,పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు, అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు, మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.

యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసికొని వచ్చిరి,యముడు తీసికొని రమ్మన్నది ఇతనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి, యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను, క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను,పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను, పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను, యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి ఇతడు భయపడెను, భయముపోవుటకై హరినామ భజనమును చేసెను,ఇట్టి భజనమును వినుటచే పాపాత్ములపాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి,పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను, దిలీపా!యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను యెందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.

మృగశృంగుని వివాహములు

వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను, మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది,అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను, మాఘమాసస్నానములు తపము చేసి శ్రీహరియనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగువారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి,ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండ్రులు తలచిరి, మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను, వారును సంతోషముతో నంగీకరించిరి, శుభముహూర్తమున సుశీలామృగశృంగులకు వివాహము మహావైభవముగ జరుప నిశ్చయింపబడినది,సుశీల స్నేహితురాండ్రులిద్దరును మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడ ఆముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి, మృగశృంగుడు అంగీకరింపలేదు, వారు పురుషుడు యెక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్దము, ధర్మవిరుద్దము కాదు దశరధునకు భార్యలు ముగ్గురు లేరా? శ్రీకృష్ణునకుయెనిమిది మంది పట్టపు రాణులు లేరా?ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ,గంగ ఇద్దరు లేరా?వారికి లేని అభ్యంతరము నీకెందులకు?అని వాదించిరి,చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి,పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి,చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.

కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను, అప్పుడు వశిష్టుడు, బ్రాహ్మణకన్యను అలంకరించి వరునకిచ్చి చేయు వివాహము బ్రహ్మవివాహము, యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగానుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు, పెండ్లికుమారుని నుండి గోవులను తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహమందురు,ధర్మము కోరకు కలసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు, ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగా చేసికొను వివాహమును గాంధర్వమని యందురు, బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను,గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వారికి వాటిని గూడ వివరించెను.

దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను, మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను, గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను, మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను,ఉత్తమ లక్షణములు కలవానికి మృకండుడని పేరు పెట్టెను, మృకండుడును బందువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను, మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను, మృకండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికి ఇష్టుడై అందరిలోను అన్నిటమిన్నయై విద్యలన్నిటిని నేర్చెను, మృగశృంగుడు ఉత్తమలక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.

మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలనుగ్రహించిరి, మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను,ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు, ఇష్టదేవతార్చనను వీడలేదు, దానములను మానవయధాశక్తిగ చేయుచుండెను,తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను, మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను, సర్వలాభములను పొందెను, మనుమలను గూడ పొందెను,ఈవిధముగనున్న తన వృద్ధికి సంతృప్తినంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను,ఇక, అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు, దిలీపమహారాజునకు ఇట్లు వివరించినారు, మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహము నందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను,అయిననూ ఒక విచారము పీడించుచుండెను, అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు,అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను, అతడొకనాడు యీ విధముగా తలపోసెను. "కాశీ మహా పుణ్యక్షేత్రము, సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక, మనస్సునందలి కోరికలు నెరవేరెను,అనేకమంది కాశీ విశ్వనాధుని దర్శనము చేసికొని,వారి అభీష్టములను పొందగలిగిరి గాన మేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతికష్టము మీద తప్పించుకొని, కుటుంబసహితముగా కాశీక్షేత్రము చేరినాడు.

కాశీపట్టణము నానుకొని పవిత్రగంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించు చున్నది,మృకండుడు  పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదికవిధులు నెరవేర్చుకొని, విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను, ఆలయావలలోనికి రాగానే మృకండునకు యెక్కడలేని ఆనందము కలిగెను,తన జన్మ తరించెననియు తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో, ప్రాద్ధించెను. ఈవిధముగా సకుటుంబముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి, ఒక లింగమును ప్రతిష్టించి, దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దాని కెదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను,ఆవిధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను,ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి, మృకండుడు చాల దుఃఖించెను,విధిని యెవ్వరూ తప్పించలేరు గదా!అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి, చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు, మృకండుడు యెంతకాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా!సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు,అతని తపస్సునకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి,మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి, ప్రమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు, "మహామునీ!మీ భక్తికి యెంతయో సంతసించినారము,మీరు చేయు తపస్సుమమ్మెంతో ఆకర్షించినది,మీనిష్కళంగ భక్తికి మెచ్చి మీకోర్కెలను దీర్చగా వచ్చి నారము,కాన మీ యభీష్ట మెరిగినపుడుడని పలికెను, అంత మృకండుడు నమస్కరించి"తండ్రి! మహాదేవా!తల్లి అనంపూర్ణా!ఇవే మా నమస్కృతులు, లోకరక్షకా!మీదయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖసంసారము అనుభవించుచున్నాము, కాని యెంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నాము, సంతానము లేనివారికి ఉత్తమగతులు లేవు గదా! కావున మాకు పుత్రసంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను"అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు,మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు"మునిసత్తమా! నీ యభీష్టము నెరవేరగలదు,కానీ      ఒక నియమమున్నది బ్రతికియున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా?లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా?"అని ప్రశ్నించెను మృకండునకు ఆశ్చర్యము కలిగెను,పరమశివుని మాటలకు ఆలోచనలోపడవలసి వచ్చెను,కొంత తడబడి "హే శశిధరా!నన్ను పరీక్షింప నెంచితివా?నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటి వరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు యేమి చెప్పవలయునో తోచకున్నది,అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని"అడిగెను.

"అటులనే అగునుగాక" అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను, పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రునిగనెను, మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి,వ్యాస మహర్షి కూడావచ్చి  ఆబిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీపమహారాజా! పరమపూజ్యుడును, ఋషిసత్తముడునూ యగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి,వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన యీ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.

Post a Comment

0 Comments