నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు
నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా ! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు.
వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు.
గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు.
వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.
శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను అవి అన్నియు వ్యర్థములగుచున్నవి.
అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జల దానము చేసినంతనే వచ్చును. దానములన్నిటిని ఒకవైపునను జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో జలదానమే గొప్పది యగును.
బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు. వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసనకఱ్ఱను దానమీయవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై జన్మించును.
ఎండకువచ్చిన వానికి విసనకఱ్ఱతో విసిరి యాదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నందును. గొడుగును దానము చేసినచో ఆధిభౌతిక, ఆధీఅత్మిక దుఃఖములు నశించును. చెప్పులు లేక బాధపడువానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును.
అంబరీషమహారాజా ! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. ఆకలిగొన్న వానికి అన్నము తప్ప వేరేదియు ముఖ్యం కాదు. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు. అన్నదానము ద్వారా అన్ని తీర్థముల పుణ్యము, సర్వదేవతల ఫలము కలుగును.
